శపధాలకే పరిమితమైన కవిత…
నిజామాబాద్, మార్చి 15
నిజామాబాద్ ఎంపీగా కవిత పేరు ఎందుకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రకటించడం లేదంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నలు సంధించడం … నిజామాబాద్ ఎంపీగా బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి పేరును బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రకటించడం ఇప్పుడు చర్చాంశనీయంగా మారింది. భద్రాచలం పర్యటనలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తే చాలా ప్రశ్నలు తలెత్తుతాయి. నిజామాబాద్ ఎంపీ స్థానం అభ్యర్థి ఎవరు అని ఎందుకు టార్గెట్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు…కవిత పేరు ఎందుకు ప్రకటించలేదు…. బీజేపీ ఎంపీ అర్వింద్ ను ఓడిస్తానని శపథం చేసిన కవిత ఎందుకు జిల్లా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు అంటు రేవంత్ బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ కు పలు ప్రశ్నలు సంధిస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.కుటుంబ పాలన అంటూ, కుటుంబ సభ్యులకే పదవులు అంటూ గత ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు టికెట్ ఇవ్వాలని ఎందుకు కోరుకుంటున్నట్లు. రాజకీయ నాయకులు ఊరికే ఏదీ మాట్లాడరు. మాట్లాడారంటే ఆ మాటల వెనుక చాలా లోతైన విషయం ఉంటుంది. ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడటం వెనుక మర్మం ఏంటన్నది తెలుసుకోవాల్సిందే.సీఎం అయినా, ప్రతిపక్ష నేత అయినా, ఢిల్లీ లీడరైనా, గల్లీ లీడర్ అయినా రాజకీయ నేత గా మాట్లాడే ప్రతీ మాట వెనుక ఉండేది. రాజకీయ వ్యూహమే. సీఎం రేవంత్ రెడ్డి కూడా రాజకీయ వ్యూహంతోనే నిజామాబాద్ ఎంపీగా కవిత పేరు ప్రకటించండని సవాల్ విసరడం వెనుక ఉంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాజకీయాల్లో ఓ కుదుపు ఏదైనా ఉందంటే.. అది సిట్టింగ్ ఎంపీగా ఉన్న కవిత… 2018 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అర్వింద్ కుమార్ చేతిలో ఓడిపోవడమే. ఆతర్వాతి రాజకీయ పరిణామాల్లో అర్వింద్- కవితల మధ్య పచ్చగడ్డి వేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. సవాళ్లు- ప్రతి సవాళ్లు ఇరువురి మధ్య సాగాయి. అర్వింద్ దూకుడు వ్యాఖ్యలు, కవిత ఛాలెంజ్‌లతో నిజామాబాద్ జిల్లా వేడెక్కింది. అర్వింద్ ఎక్కడ పోటీ చేసినా తాను నిలబడి ఓడిస్తానని కవిత మీడియా సమావేశంలో సవాల్ విసిరారు. అయితే ఇప్పుడు ఏకంగా ఆమె ఎంపీ ఎన్నికల నుంచి తప్పుకున్నారు. ఈ పరిస్థితులను చూసే రేవంత్ రెడ్డి ముందుగానే కవితను ఎందుకు నిలబెట్టడం లేదన్న ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నల వెనుక ఆంతర్యం ఏంటో ఇప్పుడు చూద్దాం.బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మరోసారి నిజామాబాద్ అభ్యర్థిగా కవితను ప్రకటించి ఉంటే ప్రతిపక్షాలకు చేతులారా మరోమారు కుటుంబ పాలన అనే అస్త్రాన్ని అందించిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే ఎమ్మెల్సీ పదవిలో ఉన్న ఆమెను తిరిగి ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తే… కాంగ్రెస్,బీజేపీ,సహా పార్టీలోను విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కేసీఆర్‌కు ఏర్పడి ఉండేది. శాసన సభ ఎన్నికల్లో కుటుంబ సభ్యులకే పదవులు అన్న ప్రచారం కారు పార్టీని దెబ్బ తీసింది. ఈ విషయమై బహిరంగంగా గులాబీ నేతలు మాట్లాడనప్పటికీ అంతర్గత సంభాషణల్లో మాత్రం ఈ విషయాన్ని నిర్థారిస్తున్నారు. తిరిగి పార్లమెంట్ ఎన్నికల్లో అదే ప్రచారం దెబ్బతీసే అవకాశం ఉంది ఆ భయంతోనే కవితను బీఆర్ఎస్ చీఫ్ ఎంపీగా ప్రకటించకుండా ఆ పార్టీలో సీనియర్ నేత అయిన బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డిని ప్రకటించారు. అష్టదిగ్భంధనం అనే మాట క్షుద్ర పూజల్లో ఎక్కువ వింటాం. అలాగే రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల వేళ గెలుపే లక్ష్యంగా ప్రత్యర్థి పార్టీని గాని, నేతలను గాని అష్టదిగ్భంధనం చేసే వ్యూహాలు సిద్ధం చేస్తారు. అందులో భాగమే టికెట్ ఇచ్చినా విమర్శలు.. ఇవ్వకపోయినా విమర్శలు తప్పని పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఎదుర్కోక తప్పదు. బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి ఎంపిక పైన కాంగ్రెస్ నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సిందే. అదెలా అంటే…. 2019 ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కవితనే 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ నుంచి పోటీ చేసిన ఏకైక మహిళ. అందులో కేసీఆర్ కుమార్తెగా ఓ ఇమేజ్. అంతే కాకుండా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. అయినా ధర్మపురి అరవింద్ చేతిలో ఆమె ఓడిపోయారు. అలా గెలిచే స్థానంగా భావించి ఆనాడు సొంత కూతురుకు నిజామాబాద్ ఎంపీగా టికెట్ ఇచ్చారని, ఇవాళ పరిస్థితి మారింది. బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదు. పార్లమెంట్ పరిధిలోని ఏడు శాసన సభ నియోజకవర్గాల్లో కేవలం ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు. ఓడిపోయే సీటు కాబట్టి బాజిరెడ్డిని కట్టబెట్టారన్న విమర్శలు చేసే అవకాశం ఉంది. మరోమారు తన కూతురి రాజకీయ భవిష్యత్తు కోసం ఓ సీనియర్ నేతను బలిపశువు చేస్తున్నారన్న విమర్శలు తప్పవు.అంతే కాకుండా… ధర్మపురి అర్వింద్‌కు గట్టి అభ్యర్థి కవితను నిలబెట్టి బీజేపీని ఓడించే ప్రయత్నం చేయకుండా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బలహీనమైన అభ్యర్థిని నిలబెట్టారని ఇది బీజేపీ – బీఆర్ఎస్ బంధంలో భాగమన్న విమర్శలు కాంగ్రెస్ నేతల నుంచి రాక మానవు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ బంధం బయట పడిందని అందులో భాగమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల మార్పు.. ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలపై ఐటీ, ఈడీ దాడులు చేసి బీజేపీ బీఆర్ఎస్ కు సహకరించిందని, ఇప్పుడు పార్లమెంట్ స్థానాలు బీజేపీకి కట్టబెట్టేందుకు ఆ పార్టీకి బీ టీంగా బీఆర్ఎస్ వ్యవహరిస్తుందని కాంగ్రెస్ ఎదురు దాడి చేసే అవకాశాలు ఉన్నాయి.పరిస్థితులు మారితే తాడు పామై కరుస్తుందంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీది అదే పరిస్థితి. ఏ నిర్ణయం తీసుకన్నా ఏదో విమర్శ ఎదుర్కోక తప్పని స్థితి గులాబీ పార్టీది. రాష్ట్రంలో అధికారం కోల్పవడంతోనే పార్టీ నుంచి నేతలు ఇతర పార్టీల పంచన ఒక్కోక్కరుగా చేరుతున్నారు. ఈ పరిణామాల నడుమ తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ ఎన్ని స్థానాల్లో గెలుస్తుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. సిట్టింగ్ ఎంపీ స్థానాల్లో తిరిగి గెలుపు మాత్రం ఆషామాషీ కాదు. సమకాలీన రాజకీయాల్లో రాజకీయ వ్యూహ చతురత కలిగిన వ్యక్తిగా పేరొందిన కేసీఆర్ ఇప్పుడు ఈ ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీల వ్యూహాలను తట్టుకుని కారును ఎలా గట్టెక్కిస్తారన్నది వేచి చూడాలి.
శపధాలకే పరిమితమైన కవిత…
- Advertisement -
- Advertisement -