వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం –
ఖమ్మంలో ఉద్రిక్తత
ఖమ్మం, మార్చి 9
Kavitha takes to the streets to fight for Velugamatla victims –
Tension in Khammam
ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల బాధితుల పక్షాన నిలుస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. నగరంలోని జెడ్పీ సెంటర్ వద్ద బాధితులతో కలిసి ఆమె బైఠాయించడంతో భారీగా నిరసన వ్యక్తమైంది. ఈ సందర్భంగా ఖమ్మం ఆర్డీవో కవితతో చర్చలు జరిపినప్పటికీ, ఆమె తన పట్టు వీడలేదు. జిల్లా కలెక్టర్ స్వయంగా ఇక్కడికి వచ్చి, వెలుగుమట్ల బాధితులకు వారు గతంలో ఉన్న చోటే ఇంటి పట్టాలు మరియు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చే వరకు ఈ ఆందోళన విరమించే ప్రసక్తే లేదని ఆమె తెగేసి చెప్పారు.ఈ సందర్భంగా కవిత స్థానిక మంత్రులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా పరీక్షల సమయంలో విద్యార్థుల పుస్తకాలతో సహా ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేయడం అత్యంత అమానుషమని ఆమె మండిపడ్డారు. ఒక ఆడబిడ్డ ఏడిస్తేనే ఇంటికి మంచిది కాదు, అలాంటిది ఇంతమంది మహిళల ఆవేదన చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. ఈ పేదల ఉసురు ఖచ్చితంగా ప్రభుత్వానికి, రాజకీయ నాయకులకు తగులుతుంది అని ఆమె హెచ్చరించారు. రాష్ట్రంలో పేదల ఇళ్లపైనే జులుం నడుస్తోందని, పెద్దల భవనాల జోలికి వెళ్లని బుల్డోజర్లు పేదల ఇళ్ల మీదకు రావడం రాజ్యాంగాన్ని కూనీ చేయడమేనని ఆమె విమర్శించారు. గతంలో వెలుగుమట్ల ఇళ్లను కూల్చే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు భోజనాలు, హెల్త్ క్యాంపులు పెడుతూ తమ పాపాలను కడుక్కునే ప్రయత్నం చేస్తోందని కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాధితుల ఆవేదనను కొన్ని రాజకీయ పార్టీలు కేవలం ఒక ఎగ్జిబిషన్ లా చూసి వెళ్తున్నాయని, కానీ తాను మాత్రం సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదని స్పష్టం చేశారు. బాధితులను ఒక కొట్టంలో వేసినట్లు ఇక్కడకు తెచ్చి పడేశారని, కనీసం మహిళలకు కనీస వసతులు కానీ, ఆరోగ్య శిబిరాలు కానీ ఏర్పాటు చేయకపోవడం దారుణమని ధ్వజమెత్తారుజిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ ఎవరికీ బాధితుల కష్టాలు పట్టడం లేదని, కనీసం జిల్లా కలెక్టర్ కూడా ఇప్పటి వరకు బాధితులను పరామర్శించకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమని కవిత విమర్శించారు. మా డిమాండ్ ఒక్కటే.. ఎక్కడైతే పేదల ఇళ్లను నేలమట్టం చేశారో, అదే స్థలంలో వారికి కొత్త ఇళ్లు కట్టించి ఇవ్వాలి. వేరే చోటికి వెళ్లమంటే మేము ఒప్పుకోము అని ఆమె డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీలు, ధర్మ సమాజ్ పార్టీ , ప్రజా సంఘాలతో కలిసి సమగ్ర కార్యాచరణతో ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని ఆమె ప్రకటించారు
ఆడవారి కన్నీరు మంచిది కాదు
వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతల బాధితులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ పరామర్శించారు. ఇళ్లు కోల్పోయి కన్నీరు పెట్టుకుంటున్న మహిళలను చూసి ఆమె చలించిపోయారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఆడబిడ్డల దుఃఖం, వారి కన్నీళ్లు ప్రభుత్వానికి మంచిది కాదని హెచ్చరించారు.”నేను టూరిస్ట్‌ను కాదు. మీ సమస్యకు పరిష్కారం చూపేవరకూ ఇక్కడే ఉండి పోరాడతా” అని కవిత బాధితులకు భరోసా ఇచ్చారు. జిల్లా కలెక్టర్, మంత్రులు తక్షణమే వెలుగుమట్లకు వచ్చి బాధితులతో మాట్లాడి, వారి సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. పేదల ఇళ్లపై బుల్డోజర్లు పంపడం అన్యాయమని మండిపడ్డారు. కొన్ని రాజకీయ పార్టీలు ఈ దుఃఖాన్ని కూడా రాజకీయం కోసం వాడుకుంటున్నాయని ఆమె ఆరోపించారు.గతంలో బీఆర్ఎస్ వాళ్లు కూడా ఇళ్లు కూల్చడానికి ప్రయత్నాలు చేశారని కవిత అన్నారు. ఎక్కడైతే ఇళ్లు కూల్చివేశారో అక్కడే తిరిగి స్థలాలు ఇచ్చి, ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు, సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికేంత వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని కవిత స్పష్టం చేశారు



