గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలోకి కవిత పార్టీ
వరంగల్–ఖమ్మం–నల్గొండ అభ్యర్థిగా డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ ప్రకటన
హైదరాబాద్, అక్టోబర్ 21 (వాయిస్ టుడే): తెలంగాణ రక్షణ సేన ప్రత్యక్ష ఎన్నికల సమరానికి సిద్ధమైంది. పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న కవిత.. ఉమ్మడి వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉద్యమకారుడు, విద్యావేత్త డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను ప్రకటించారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎన్నికల ప్రచారం, క్షేత్రస్థాయి సమన్వయ బాధ్యతల కోసం పార్టీ సీనియర్ నాయకుడు సయ్యద్ ఇస్మాయిల్‌ను స్టేట్ పార్టీ అబ్జర్వర్, ఎన్నికల కో-ఆర్డినేటర్‌గా నియమించారు. పట్టభద్రుల సమస్యలు, నిరుద్యోగ యువత ఆకాంక్షలను ప్రధాన ఎజెండాగా తీసుకుని ప్రచారాన్ని నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.
అభ్యర్థి డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లికి చెందినవారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి దశ నుంచే చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి ఆవిర్భావం నుంచి కవిత వెంట నడుస్తూ, పార్టీ అధికార ప్రతినిధిగా టీవీ చర్చలు, ప్రజా వేదికలపై తన గళాన్ని వినిపించారు.
బీసీ సామాజిక వర్గానికి చెందిన ఉన్నత విద్యావంతుడిని అభ్యర్థిగా ఎంపిక చేయడం ద్వారా బహుజన ప్రాతినిధ్యానికి ప్రాధాన్యమిచ్చినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణ రక్షణ సేన తొలి ఎన్నికగానే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని ఎంచుకోవడంతో ఉమ్మడి వరంగల్–ఖమ్మం–నల్గొండ రాజకీయాల్లో ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారనుంది.




