Sunday, September 8, 2024

పోటీకి దూరంగా కేసీఆర్ ఫ్యామిలీ

- Advertisement -

పోటీకి దూరంగా కేసీఆర్ ఫ్యామిలీ
హైదరాబాద్, మార్చి 14
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి త్వరలో ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీ మొదటి జాబితా అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ కూడా అదే పని చేసింది. భారత రాష్ట్ర సమితి ఐదు నుంచి ఆరు స్థానాలకు అభ్యర్థుల వివరాలు వెల్లడించింది.. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి, కాంగ్రెస్ కు అభ్యర్థుల కరువు లేదు. పైగా సీట్లలో పోటీ చేసేందుకు చాలామంది రెడీగా ఉన్నారు. 2019లో భారత రాష్ట్ర సమితికి కూడా ఇదే పరిస్థితి ఉండేది. కానీ 2023 ఎన్నికల్లో ఓడిపోవడంతో ఒక్కసారిగా తారుమారయింది. దీంతో ఆ పార్టీకి సంబంధించి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేరనే ప్రచారం జరుగుతోంది.అభ్యర్థులు లేకపోయినప్పటికీ కెసిఆర్ వరుసగా సమీక్షలు చేస్తున్నారు. వివిధ జిల్లాలకు చెందిన నాయకులతో తెలంగాణ భవన్ లో భేటీ అవుతున్నారు. పలు విషయాలపై మాట్లాడుతున్నారు. అయితే కొన్ని స్థానాలకు సంబంధించి భారత రాష్ట్ర సమితి తరపున ప్రకటించిన అభ్యర్థుల పేర్లను చూసి సొంత పార్టీ నాయకులే విస్మయం వ్యక్తం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.. వారు కనీసం పోటీ ఇస్తారా అని కామెంట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది..మాల్కాజ్ గిరి పార్లమెంటు స్థానానికి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పేరును కేసీఆర్ ప్రకటించారు. వాస్తవానికి శంభీపూర్ రాజు ఇంతవరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ పడలేదు. పైగా ఆయన ఎంపీ స్థాయి అభ్యర్థి ఎలా అవుతారని స్థానిక నాయకులు ప్రశ్నిస్తున్నారు. జహీరాబాద్ స్థానానికి గాలి అనిల్ కుమార్, చేవెళ్ల స్థానానికి కాసాని జ్ఞానేశ్వర్ పేర్లను కేసీఆర్ ఖరారు చేయడం పట్ల పై వ్యాఖ్యలే వ్యక్తమవుతున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పై రెండు స్థానాల్లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థులు విజయం సాధించారు.. ఇక్కడ వారికి లీడ్ కూడా ఎక్కువగానే వచ్చింది. కానీ పార్లమెంటు స్థానాలకు భారత రాష్ట్ర సమితి ప్రకటించిన అభ్యర్థులను చూస్తే.. వీరు గెలుస్తారా? గెలిచేందుకేనా వీరిని బరిలోకి దింపింది? అనే సందేహాలను కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం భారత రాష్ట్ర సమితిలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కెసిఆర్ కుటుంబ సభ్యులు రంగంలోకి దిగితేనే కొన్ని స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి 2019 ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కవిత పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆమెను ఎమ్మెల్సీ చేశారు. అయితే ఇప్పుడు కూడా ఆమెను నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయిస్తే బాగుంటుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే ఆమెను ఎందుకు పోటీ చేయించడం లేదనే ప్రశ్నకు కెసిఆర్ వద్ద సమాధానం లేదు. కవిత కొద్దిరోజులుగా పలు కార్యక్రమాలు చేపడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా అసెంబ్లీలో పూలే విగ్రహం కోసం బీసీ సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఇక్కడ భారత రాష్ట్ర సమితి తరపున కాకుండా జాగృతి ఆధ్వర్యంలో ఆమె సమావేశం నిర్వహించడం విశేషం. ఇక గత కొంత కాలం నుంచి కవిత పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. మరోవైపు నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి సంబంధించి అభ్యర్థి విషయంలో గులాబీ పార్టీ కసరత్తు చేయడం లేదు. నిజామాబాదులో గెలిచే పరిస్థితి లేకపోతే మెదక్ లో ఆమెకు అవకాశం ఉంది. కానీ ఆ దిశగా కేసీఆర్ ఆలోచించడం లేదు. మొన్నటిదాకా మెదక్ నుంచి కేసీఆర్ పోటీ చేస్తారని వార్తలు వినిపించాయి. కానీ తర్వాత ఆ ఆలోచనను ఆయన విరమించుకున్నారు. కేటీఆర్ మల్కాజ్ గిరి స్థానం నుంచి పోటీ చేద్దామని భావించారు. కానీ ఆయన కూడా సైలెంట్ అయిపోయారు. కాంగ్రెస్ పార్టీ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తుండడం, బిజెపి కదనరంగంలో జోరుగా ఉండడంతో పార్లమెంటు ఎన్నికలు ఈ రెండు పార్టీల మధ్య జరుగుతాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి అనుకూలంగా కేసీఆర్ ఎలాంటి వ్యూహం పన్నుతారో చూడాల్సి ఉంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్