దశాబ్దాల కల నెరవేరింది
హైదరాబాద్, సెప్టెంబర్ 16 : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ శనివారం ప్రారంభించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద నిర్మించినటవంటి మొదటి దశ ఎత్తిపోతల్లోని పంపు మీటనొక్కి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలను ప్రారంభించారు. శ్రీశైలం వెనుక ఉన్నటువంటి నీటి ఆధారంగా కృష్ణా నది నుంచి కోతిగుండు ద్వారా నీటిని తీసుకునేలా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. 60 రోజుల్లోనే ఏకంగా 90 టీఎంసీల నీటిని తరలించేందుకు వీలుగా అయిదు ఎత్తిపోతలను, ఆరు జలాశయాలను నిర్మించారు. ఇందులో భాగంగానే మొదటి పంపుహౌసులో తొలి పంపును సిద్ధం చేశారు. భూగర్భంలో పంపుహౌస్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఉపరితలంపై ఏర్పాటు చేసినటువంటి కంట్రోలింగ్ కేంద్రం నుంచి పంపు మీట నొక్కి నీటి ఎత్తిపోతను ముఖ్యమంత్రి ప్రారంభించారు.

ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టుపై మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.అవాంతరాలు, అడ్డంగులను అధిగనిస్తూ.. కుట్రలను ఛేదిస్తూ.. కృష్ణమ్మ జలాలను తీసుకొచ్చి పాలమూరు ప్రజల పాదాలు కడుగుతామని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్ కృతజ్ఞతలని తెలిపారు. పాలమూరు ప్రజల దశాబ్దాల కల, తరతరాల ఎదురుచూపులు నెరవేరే సమయం ఆసన్నమైనట్లు పేర్కొన్నారు. నెర్రెలు బారినటువంటి పాలమూరు నేలను తడపడానికి కృష్ణమ్మ రానుందని అన్నారు. నాడు పాలకులు మారినా కూడా పాలమూరు ప్రజల బతుకులు మారలేవని అన్నారు. తాగు, సాగునీటికి తిప్పలు తప్పలేవన్నారు. కానీ పదేళ్ల స్వరాష్ట్రంలో.. సీఎం కేసీఆర్ పాలనలో పాలమూరు దశ దిశ మారిందని పేర్కొన్నారు. నదులు, చెరువులు, వాగులు ఎండిన చేలా దాహాన్ని తీరుస్తున్నాయని.. పచ్చదనాన్ని పరుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోత పథకం ద్వారా 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం చాలా గొప్ప విషయమని అన్నారు.ఇది తెలంగాణ సాధించనటువంటి శతాబ్ధపు విజయని అన్నారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు చేశారు. మరోవైపు మంత్రి కేటీఆర్ కూడా ఈ పథకం ప్రారంభోత్సవంపై స్పందించారు. తరతరాల ఎదురు చూపులు ఫలించిన వేళ.. పల్లేర్లు మొలచిన పాలమూరులో పాలనురగల జలహేల అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.
ఇదిలా ఉండగా.. మరోవైపు రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మొదలైంది. ఈ ఏడాది డిసెంబర్‌లో ఎన్నికలు జరగనున్నట్లు ప్రచారంలో ఉండేది. అయితే ఈసారి జమిలి ఎన్నికలు నిర్వహిస్తారనే ఊహగాణాలు వస్తున్నాయి. మరోవైపు ఇటీవల మంత్రి కేటీఆర్ కూడా అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యం అయ్యే అవకాశం ఉండొచ్చని చెప్పడి ఈ ఊహగాణాలను మరింత పెంచేసింది. అయితే సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై విమర్శలు గుప్పించారు. ఈ రోజు అమిత్ షా వచ్చి తిడుతారు.. రేపు ఖర్గే వచ్చి తిడుతారు అంటూ మంత్రి అన్నారు. వాళ్ళది తిట్లలో పోటీ.. మనది కిట్లలో పోటీ అని హరీశ్ రావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీది బట్ట కాల్చీ మీద వేసే సంస్కృతి.. ప్రతిపక్షాల పాలనకు మా పాలనకు నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది అని వైద్యారోగ్యమంత్రి అన్నారు.కాంగ్రెస్ పార్టీది తన్నుల సంస్కృతి.. BRS పార్టీది టన్నుల పంట పండించే సంస్కృతి అంటూ మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ భారతదేశానికి దిక్సుచిగా మారింది..

దేశంలో 3 శాతం జనాభా ఉన్న మన తెలంగాణ ఎన్నో అవార్డులు సాధించింది.. ధాన్యం ఉత్పత్తిలో హర్యానా, పంజాబ్ రాష్ట్రాలను దాటి కేరాఫ్ అడ్రస్ గా తెలంగాణ మారింది అని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసింది.. పాలమూరు ప్రాజెక్టు దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేస్తుంది.. దేశ వైద్య అవసరాలు తీర్చేందుకు డాక్టర్లును తయారు చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు.అదే విధంగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించాడు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి గెలిచినప్పటి నుంచి అందుబాటులో లేడు.. ఆ ఎమ్మెల్యే అడ్రస్ లేదు.. ఎక్కడున్నాడో తెలియదు.. నియోజకవర్గ ప్రజలకు ఫోన్ నెంబర్ తెలియని ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. కాంగ్రెస్ వాళ్లు గొప్పలు చెప్పి చెవిలో పువ్వులు పెడుతున్నారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ చేసేందేమి లేదు.. కాంగ్రెస్ వి వట్టి మాటలే.. కేసీఆర్ సర్కార్ చేతల ప్రభుత్వం.. కేసీఆర్ పక్క హిందూ.. కానీ కుల మతాలకు అతీతంగా పని చేసాడు.. సీఎం కేసీఆర్ అద్భుతాలు సృష్టిస్తున్నారు.. కాంగ్రెస్ వాళ్లు అబద్ధాలు చెబుతున్నారు అని హరీశ్ రావు విమర్శించారు.




