స్థానిక సంస్థల ఎన్నికలపై కేసీఆర్ దృష్టి
KCR's focus on local body elections
హైదరాబాద్
తెలంగాణ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది సీఎం రేవంత్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వ హణ పైన ఫోకస్ చేసారు. అటు ఎన్నికల సంఘం ఈ ఎన్నికల పై కసరత్తు చేస్తోంది. ఇటు ఇదే సమయంలో కేసీఆర్ అలర్ట్ అయ్యారు. రాజకీయంగా తిరిగి యాక్టివ్ కావాలని నిర్ణయం తీసుకున్నారు. భారీ బహిరంగ సభల ద్వారా తిరిగి ప్రజా క్షేత్రంలోకి వచ్చేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. అందులో భాగంగా రెండు సభలకు నిర్ణయించారు. రేవంత్ ప్రభుత్వం లక్ష్యంగా కేసీఆర్ సమరానికి సిద్దం అవుతున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత కేసీఆర్ కేవలం పార్లమెంట్ ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల్లోకి వచ్చారు. విపక్ష నేత అసెంబ్లీ సమావేశానికి ఒక్క సారి మాత్రమే హాజరయ్యారు. పార్టీ నేతలతో అప్పుడప్పుడూ భేటీ అవుతున్నారు. కేసీఆర్ ఫాం హౌస్ కే పరిమితం కావటం పైన సీఎం రేవంత్ మంత్రులు పలు సందర్బాల్లో విమర్శలు చేసారు. అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సూచనలు చేయాలని సూచించారు. ఇక, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల దిశగా చర్చ సాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు పూర్తయింది. ఈ సమయంలో కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
బీసీ రైతాంగం అంశాలపై:
తాను మౌనంగా ఉంటూనే గంభీరంగా పరిస్థితులు గమనిస్తున్నానని తాజాగా పార్టీ నేతల భేటీలో కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజల్లో ప్రభుత్వం పైన వ్యతిరేక పెరుగుతోందని వ్యాఖ్యానించారు. ఇక, కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా కుల గణన గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటోంది. అటు రైతు రుణమాఫీ అమలు తో పాటుగా రైతు భరోసా అమలు చేస్తున్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. బీసీ గణన పైన ఢిల్లీ నేతలను ఆహ్వానించి భారీ సభకు ప్లాన్ చేసింది. ఈ సమయంలో కేసీఆర్ సైతం బీసీ- రైతు అంశాల పైన రెండు భారీ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందు కోసం వేదికలను ఖరారు చేసారు. ఈ సభల ద్వారా తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. ఈ మేరకు కేటీఆర్ పార్టీ నేతలకు స్పష్టత ఇచ్చారు. కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై క్షేత్ర స్థాయిలో ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. కాంగ్రెస్ నేతలు కనిపిస్తే కొట్టేంత కోపం మీద ఉన్నారని తనదైన శైలిలో విమర్శలు చేశారు. తాను కొడితే మామూలుగా ఉండదు అంటూ కార్యకర్తలను ఉత్తేజ పరిచే ప్రయత్నమూ చేశారు. ఆ నేపథ్యంలోనే పార్టీకి పట్టు కొమ్మలాంటి ఉత్తర తెలంగాణలో జరుగతున్న టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతను క్యాష్ చేసుకునే అవకాశాన్ని మాత్రం వదిలేస్తున్నారట.
రెండు సభ వేదికలుగా:
కామారెడ్డి వేదికగా బీసీ గర్జన, గజ్వేల్ వేదికగా రైతు గర్జన నిర్వహించాలని నిర్ణయించారు. గజ్వేల్ నియోజకవర్గంలో ప్రత్యేకించి 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని పార్టీ నేతలు నిర్ణయించారు. రైతు రుణమాఫీ రైతు భరోసా అమలు పైనే ప్రధానంగా ఈ సభ ద్వారా కేసీఆర్ ప్రశ్నించనున్నారు. అదే విధంగా కామారెడ్డిలో కాంగ్రెస్ గతంలో నిర్వహించిన సభ ప్రదేశంలోనే తాము భారీ సభ ఏర్పాటు చేసి బీసీలకు ఇచ్చిన హామీలు కులగణనలో చోటు చేసుకున్న లోపాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. అటు బీజేపీ సైతం ఇదే అంశం పైన ప్రజల్లోకి వెళ్లేలా కొత్త కార్యాచరణ సిద్దం చేస్తోంది. దీంతో తెలంగాణలో మళ్లీ రాజకీయంగా కీలక పరిణామాలు మూడు పార్టీల సమరం హోరా హోరీగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది.