హైదరాబాద్ : ఇంటర్మీడియట్ బోర్డులో ఫిజికల్ డైరెక్టర్ పోస్టుకు సంబంధించి విద్యార్హతలను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. ఈ మేరకు ప్రభుత్వం ఈనెల 9వ తేదీన ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణలో ఫిజికల్ డైరెక్టర్ పోస్టుకు బ్యాచ్‌లర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(బీపీఈడీ), మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(ఎంపీఈడీ) కోర్సులను అర్హతగా పరిగణించేవారు. కానీ పలువురు అభ్యర్థులు ఇతర రాష్ట్రాల్లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ గుర్తింపు పొందిన కాలేజీల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సును పూర్తిచేశారు. గతంలో తెలంగాణలో ఈ కోర్సును పరిగణలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో పలువురు అభ్యర్థులు ప్రభుత్వానికి అప్పీల్ చేసుకోగా బ్యాచ్‌లర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(బీపీఈ), బ్యాచ్‌లర్ అఫ్ సైన్స్ హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులు కూడా ఫిజికల్ డైరెక్టర్ పోస్టుకు అర్హతగా సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా బీపీఈ, బ్యాచ్‌లర్ అఫ్ సైన్స్ హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కు చెందిన అభ్యర్థులు 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. లేదా 50 శాతం మార్కులతో బీపీఈడీ చేసి ఉండాలి లేదా 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(బీపీఈడీ) కోర్సు పూర్తిచేసి ఉంటే ఫిజికల్ డైరెక్టర్ పోస్టుకు అర్హులుగా పేర్కొంది. వీటితో పాటు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ నుంచి గుర్తింపు పొందిన శిక్షణ సంస్థ నుంచి కనీసం 2 సంవత్సరాల ఎంపీఈడీ కోర్సును పూర్తి చేసిన అభ్యర్థులను అర్హులుగా పరిగణించాలని పేర్కొంది. ఈ మేరకు ఈ అర్హత పరిగణలోకి తీసుకోవాలని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఆర్జేడీలను ఆదేశించారు. అయితే ఈ విషయాన్ని బోర్డు అధికారులు ఆలస్యంగా వెల్లడించారు. దీనిపై పలువురు అభ్యర్థుల నుంచి విమర్శలు వస్తున్నాయి. బోర్డు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.



