అంజన్నకు ఆస్తిని రాసేసిన తండ్రి
మెదక్, మే 2 ( వాయిస్ టుడే )
టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందుతూ, రోజురోజుకూ ఓ మెట్టు ఎదుగుతున్నప్పటికీ.. మరోవైపు మానవ సంబంధాలు అంతకు మించి ప్రభావితం అవుతున్నాయి. బంధువులు, స్నేహితులను కాదు కదా, రక్త సంబంధం ఉన్న వారిని సైతం కొందరు పట్టించుకోవడం లేదు. పిల్లల కోసం తన జీవితం మొత్తం ధారపోస్తే, వాళ్లు మాత్రం తల్లిదండ్రుల్ని సరిగ్గా చూసుకోవట్లేదు. దీంతో మనస్తాపం చెందిన ఓ తండ్రి యావదాస్తిని తన కుమారులకు చెందకుండా దేవుడికి సమర్పించారు. తెలంగాణలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.బాలయ్య అనే వ్యక్తి స్వస్థలం సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం అలీపూర్. అసలే వయసు మీద పడటంతో కొడుకులు తనను ప్రేమగా చూసుకుంటున్నారని, పట్టెడన్నం పెడతారని భావించారు. కానీ అలా జరగటం లేదు. ఎంతో ప్రయోజకులై తనను బాగా చూసుకుంటారని భావించిన తండ్రి బాలయ్యకు నిరాశే ఎదురైంది. తండ్రికి సరిగ్గా అన్నం పెట్టడానికి, బాగోగులు చూసుకోవడానికి నువ్వంటే నువ్వు అని కొడుకులు అంటున్నారు. ఆస్తిలో వాటాకు మాత్రం రెడీగా ఉంటున్నారు. తన కొడుకులు అన్నం పెట్టట్లేదని, సరిగా చూసుకోవట్లేదని మనస్థాపానికి బాలయ్య గురయ్యారు. దాంతో జీవితాంతం తాను కష్టపడి కొడుకుల కోసం సంపాదించిన తన యావదాస్తిని కొండగట్టు అంజన్నకు కానుకగా సమర్పించారు. మొదట తన నిర్ణయం ప్రకారం.. కొండగట్టు అంజన్న సన్నిధికి చేరుకున్నారు బాలయ్య. తన వెంట తీసుకొచ్చిన ఆస్తికి సంబంధించిన పత్రాలను కొండగట్టుదేవస్థానంలోని హుండీలో వేయానికి సిద్ధమయ్యారు. ఆలయం హుండీలో వేస్తే ఆ ఆస్తి పత్రాలు వేస్తే అంజన్నకి చెల్లదని చివరి నిమిషంలో పూజారులు చెప్పారు. దాంతో, తన ఆస్తిని కొండగట్టు అంజన్న పేరుతో పట్టా చేస్తానని బాలయ్య తెలిపారు. తన ఆస్తి మొత్తాన్ని కొండగట్టు అంజన్నకు అందాలంటే పట్టా చేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన కోరారు
కొండగట్టు అంజన్నకు ఆస్తిని రాసేసిన తండ్రి
- Advertisement -
- Advertisement -