కేటీఆర్ కాన్పిడెన్సా…
హైదరాబాద్, మార్చి 25, వాయిస్ టుడే)
KTR is confident...
నేను కేసీఆర్ అంత మంచోడ్ని కాదు, మేం అధికారంలోకి వస్తే ఎవర్నీ వదిలిపెట్టం.. ఇలాంటి డైలాగులతో కేటీఆర్ ఎవర్ని మెప్పించాలనుకుంటున్నారు..? ఇప్పటికే కొంతమంది నాయకులు చేజారారు, కేడర్ కూడా పార్టీకి దూరమవుతోంది. ఈ దశలో కాంగ్రెస్ పై, సీఎం రేవంత్ రెడ్డిపై పదే పదే తీవ్ర విమర్శలు చేస్తూ హైలైట్ కావాలనుకుంటున్నారు కేటీఆర్. బీఆర్ఎస్ రజతోత్సవ సభతో అయినా కేడర్ లో కాస్త ఉత్సాహం వస్తుందేమోనని ఆయన ఆశ. కానీ ఆ ఆశ నెరవెరేలా లేదు.తెలంగాణలో బీఆర్ఎస్ తిరిగి పుంజుకోగలదా..? ఆ పార్టీ నేతలు మాత్రం పైకి మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పని అప్పుడే అయిపోయిందని రాబోయేది తమ ప్రభుత్వమేనని చెప్పుకుంటున్నారు. అందులోనూ అధికారానికి దూరంగా ఉండాలంటే కేటీఆర్ లాంటి నాయకులకు అస్సలు కుదరట్లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోపే ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు ఎక్కుపెట్టారు కేటీఆర్. సీఎం విఫలమయ్యారని, ఆయనకు పార్టీలో ఎవరి సపోర్ట్ లేదని బురదజల్లాలనుకున్నారు. కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డిని ఒంటరిని చేయాలనేది బీఆర్ఎస్ ఎత్తుగడ. అందుకేసం సోషల్ మీడియా ద్వారా పదే పదే తప్పుడు ప్రచారం చేసింది. చివరకు పెయిడ్ జర్నలిస్ట్ లతో చేసిన ఎత్తుగడలు కూడా విఫలమయ్యాయి. తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సాక్షాత్తూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు కూడా.రెండేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ని ప్రజలు 2023 ఎన్నికల్లో నిర్ద్వందంగా తిరస్కరించారు. అప్పటికీ ఆ పార్టీలో మార్పు రాలేదు. దీంతో ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి పెద్ద షాకిచ్చారు. ఆ ఓటమిని కూడా మసిపూసి మారేడుకాయ చేయాలనుకున్నారు కేటీఆర్. జనంలోకి రాని కేసీఆర్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న కవిత.. ఇలా బీఆర్ఎస్ ప్రతిష్ట ఎప్పుడో మంటగలిసి పోయింది. భవిష్యత్ నాయకుడిగా చెప్పుకుంటున్న కేటీఆర్ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అటు హరీష్ రావు నుంచి ఆపద ఉందని తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు కేటీఆర్. అందుకే ఆయన త్వరలో పాదయాత్ర చేపడతానని ప్రకటించారు.రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు ఇప్పుడు కేసీఆర్ గుర్తొస్తున్నారనేది కేటీఆర్ వ్యాఖ్యానం. కేసీఅర్ ని ఎందుకు ముఖ్యమంత్రి చేసుకోలేకపోయామా అని వారు బాధపడుతున్నారట. ఆ మాటకొస్తే రాష్ట్ర ప్రజలే ఇప్పుడు కేసీఆర్ కి గుర్తొస్తున్నారు. ప్రజలను ఎందుకు దూరం చేసుకున్నామా అని ఆయన బాధపడుతూ ఉండొచ్చు. అధికారం పోయిందని కేటీఆర్ అంతకంటే ఎక్కువ బాధపడుతూ ఉండొచ్చు. అది బాధే కానీ, పశ్చాత్తాపం కాదని ఆయన పలుమార్లు తన మాటలతో రుజువు చేశారు కూడా. ఓటములనుంచి గుణపాఠాలు నేర్చుకుని ప్రజల్లోకి రావాలి కానీ, ప్రజలు కాంగ్రెస్ చేతిలో మోసపోయారంటూ తమని తాము కవర్ చేసుకోవాలని చూడటం కేటీఆర్ అవివేకం. అయినా ప్రజల ముందు గంభీరంగా ఉండాలి. ఓడిపోయినా తమ తప్పేమీ లేదని చెప్పుకోవాలి, కేడర్, లీడర్ చేజారకుండా చూసుకోవాలి. అందుకే కేటీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంటారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా గులాబీ జెండా రెపరెపలాడుతుందని సవాళ్లు విసురుతున్నారు.త్వరలో జరగబోతున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం కరీంనగర్ లో నిర్వహించగా ఆ సమావేశంలో కేటీఆర్ మరోసారి సవాళ్లతో కేడర్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఏప్రిల్ లో నిర్వహించే రజతోత్సవ సభతో తిరిగి పుంజుకుంటామని అంటున్నారాయన. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టింగ్ లు పెట్టిన వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని నానా యాగీ చేస్తున్నారు కేటీఆర్. బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకోవాలని అంటున్నారు కాంగ్రెస్ నేతలు.అసలింతకీ బీఆర్ఎస్ జాతీయ పార్టీనా, రాష్ట్ర పార్టీనా అనే కౌంటర్లు కూడా పడుతున్నాయి. జాతీయ రాజకీయాల్లో వెలిగిపోవాలనే ఆశతో పార్టీ పేరు కూడా మార్చేసి, పక్క రాష్ట్రాల్లో ఆఫీసులు కూడా తెరిచేసి ఆమధ్య హడావిడి చేశారు. తీరా సొంత రాష్ట్రంలో ఘోర పరాభవంతో ఆ మాటే ఎత్తకుండా సైలెంట్ అయ్యారు. పార్టీ పేరు తిరిగి టీఆర్ఎస్ గా మార్చేస్తారనే వార్తలు వినిపించినా ఇక్కడ కూడా కేసీఆర్, కేటీఆర్ కి ఇగో అడ్డు వచ్చింది. పార్టీ పేరు తిరిగి మార్చేస్తే కాంగ్రెస్, బీజేపీనుంచి పడే కౌంటర్లను తట్టుకోలేమని సైలెంట్ అయ్యారు. ఎప్పటికైనా పార్టీ పేరు జాతీయ స్థాయిలో మార్మోగి పోతుందని లేనిపోని బీరాలు పలుకుతున్నారు కేసీఆర్, కేటీఆర్.