కేటీఆర్ పాదయాత్ర
హైదరాబాద్, జూలై 9,
భారత రాష్ట్ర సమితిని మరోసారి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గట్టి ప్రయత్నాలు చేయనున్నారు. ఇందులో భాగంగా ఆయన పాదయాత్ర చేస్తారనే ప్రచారం జరుగుతోంది. త్వరలో తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలను కలుపుతూ కేటీఆర్ పాదయాత్ర చేస్తారని సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు ప్రచారం ప్రారంభించారు. ప్రస్తుతం ఓటమి బాధలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. కొంత మంది పార్టీలు వదిలి వెళ్లిపోతున్నారు. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ కు భారీ యాక్టివిటీ ఉండాలని.. కీలక నేతలు ఎప్పుడూ ప్రజల్లో ఉండాలన్న అభిప్రాయం ఆ పార్టీ క్యాడర్ లో ఉంది.ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు పాదయాత్ర పెద్ద అస్త్రం . ప్రతి సారి ఎన్నికల సీజన్ కు ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలక నేతలు పాదయాత్రలు చేస్తూనే ఉన్నారు. వైఎస్ రాజశేకర్ రెడ్డి, చంద్రబాబు, జగన్, షర్మిల , లోకేష్ వరకూ పాదయాత్రలు చేశారు. వారు పాదయాత్రలు చేసినప్పుడల్లా మంచి ఫలితాలు సాధించారు. అయితే షర్మిల మాత్రం రెండు సార్లు పాదయాత్రలు చేసినా ప్రయోజనం పొందలేకపోయింది. అయితే అది అందరికీ వర్కవుట్ అయ్యే సూచనలు లేవు. షర్మిల తెలంగాణ మొత్తం పాదయాత్ర చేశారు కానీ.. కనీసం తనకైనా డిపాజిట్ వస్తుందన్న గ్యారంటీ లేకపోవడంతో కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించి .. తర్వాత కాంగ్రెస్ లో విలీనం అయిపోయారు. బీజేపీ నేత బండి సంజయ్ కూడా విడతల వారీగా పాదయాత్ర చేశారు కానీ కీలక సమయంలో ఆయనను టీ బీజేపీ చీఫ్ పదవి నుంచి తప్పించడంతో పాదయాత్ర ఆగిపోయింది. బీజేపీ కూడా మంచి ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల్లో సాధించలేకపోయింది. ఏపీలో నారా లోకేష్ చేసిన యవగళం పాదయాత్ర టీడీపీకి అధికారాన్ని దగ్గర చేసిందని అనుకోవచ్చు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఉన్న గడ్డు పరిస్థితుల్లో కేటీఆర్ కూడా పాదయాత్ర చేయాలని ఆ పార్టీ క్యాడర్ కోరుకుంటోంది. పాదయాత్రలు చేస్తే మంచి ఫలితాలు వచ్చిన చరిత్ర ఉండటంతో కేటీఆర్ కూడా అదే తరహాలో పాదయాత్ర చేస్తే బాగుంటుందని బీఆర్ఎస్ క్యాడర్ ఆలోచన. అందుకే ఆయనపై ఒత్తిడి పెంచేందుకు సోషల్ మీడియా ద్వారా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. కానీ ఇప్పుడే అలాంటి ప్రయత్నాలు చేయలేమని.. ఎన్నికలకు ఏడాది లేదా ఏడాదిన్నర ముందు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. ప్రస్తుతం కవిత బెయిల్ పిటిషన్లపై ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై కేటీఆర్ న్యాయనిపుణులతో చర్చలు జరుపుతున్నారు.
కేటీఆర్ పాదయాత్ర
- Advertisement -
- Advertisement -