భూముల వేలం…రచ్చేంటీ…
హైదరాబాద్, మార్చి 28, (వాయిస్ టుడే)
Land auction...what's up...
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన విద్యార్థులు కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్నారు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి వేలాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యూనివర్శిటీకి చెందిన భూములను వేలం
వేయటమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ భూమి యూనివర్శిటీకి చెందినదని… ఇక్కడ జీవ వైవిద్యాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వ చర్యలున్నాయని ఆరోపిస్తున్నారు.ఓవైపు విద్యార్థుల ఆందోళన చేస్తుండగా… మరోవైపు
ప్రభుత్వ స్పందన మరోలా ఉంది. ఆ భూములతో యూనివర్శిటీకి సంబంధం లేదని స్పష్టం చేస్తోంది. ఆ 400 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానికి చెందినదే అని చెబుతోంది. ఓపెన్ ఆక్షన్ ద్వారా పెట్టుబడుల కోసం
అంతర్జాతీయ సంస్థలకు ఇవ్వాలని నిర్ణయించామని అంటోంది. అసలు హెచ్ సీయూ భూముల వివాదమేంటి..? విద్యార్థుల ఆందోళనకు కారణాలేంటి..? వంటి వాటిపై అంశాలకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు
ఇక్కడ తెలుసుకోండి…
HCU భూముల వివాదం – ముఖ్యమైన విషయాలు:
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ పరిధిలో(కంచ గచ్చిబౌలి) 400 ఎకరాల భూమిని టీజీఐఐసీ ద్వారా 400 ఎకరాలను వేలం వేసేందుకు తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే బిడ్డింగ్స్ కూడా దాఖలయ్యాయి.
400 ఎకరాల భూముల వేలాన్ని యూనివర్శిటీ విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ భూములపై రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని… ఆ 400 ఎకరాలు యూనివర్శిటీకి చెందినవి చెబుతున్నారు.
ప్రభుత్వ నిర్ణయంతో యూనివర్శిటీ ప్రాంతంలో జీవ వైవిధ్యాన్ని కోల్పోయే పరిస్థితి ఉంటుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ భూమి మొదట విశ్వవిద్యాలయానికి చెందినదని అని చెబుతున్నారు. వేలం
నిలిపివేయాలని విద్యార్థులతో పాటు విశ్వవిద్యాలయ బోధనేతర సిబ్బంది కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి కూడా లేఖ రాశారు.
విశ్వవిద్యాలయం యొక్క విలువైన వనరులను దోచుకునేలా భూములను వేలం వేస్తున్నారు హెచ్ సీయూ విద్యార్థి జేఏసీ ఆరోపిస్తోంది. వీరికి పలువురు ప్రకృతి ప్రేమికులు కూడా మద్దతునిస్తున్నారు. అటవీ ప్రాంతాన్ని
అభివృద్ధి చేస్తే నగరానికి సమీపంలో కొలువైన జీవవైవిధ్యం అంతరించిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు.
హెచ్‌సీయూ భూముల చరిత్ర చూస్తే… ఈ యూనివర్శిటీని 1974లో ఏర్పాటు చేశారు. ఆ సమయంలో 2,300 ఎకరాల భూమిని కేటాయించారు. పలు విభాగాలకు కేటాయింపులు చేయగా.. ప్రస్తుతం 1800
ఎకరాల వరకు భూమి ఉందని లెక్కలు చెబుతున్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం, యూనివర్శిటీ మధ్య ఉన్న భూవివాదానికి కంచ గచ్చిబౌలిలోని అటవీ భూమి కేంద్రంగా ఉంది.
నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(2003)లో 400 ఎకరాల భూమిని క్రీడా సౌకర్యాల అభివృద్ధి పేరిట ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించింది. ఐఎంజీ ఆ ప్రాజెక్టును ప్రారంభించలేదు.
నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలటంతో…. 2006లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి కేటాయింపును రద్దు చేసింది.
ఇదే విషయంపై ఐఎంజీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరగా… ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును కూడా ఐఎంజీ ఆశ్రయించింది. అక్కడ కూడా వారి
పిటిషన్‌ను కొట్టివేసింది.
శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్‌లు రెవెన్యూ రికార్డుల ఆధారంగా ఈ 400 ఎకరాలను ప్రభుత్వ భూమిగా ధ్రువీకరించారు. ఈ భూమికి అటవీ శాఖకు ఏ సంబంధం లేదని ప్రభుత్వం ప్రకటన కూడా విడుదల
చేసింది. ఈ భూమిని ఇటీవలే టీజీఐఐసీకి కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చింది.ఈ భూమిని వేలానికి కూడా ఇటీవలే ప్రకటన జారీ కాగా.. బిడ్డింగ్స్ దాఖలయ్యాయి.
భూముల వేలాన్ని ఖండిస్తున్న విద్యార్థులు… ఆందోళన చేస్తున్నారు. అయితే ఈ ఆందోళనల నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పందించారు. “25 ఏండ్ల క్రితం బిల్లీరావుకు(ఐఎంజీ)
గచ్చిబౌలిలో భూమిని కేటాయించారు. ఆ భూమితో సెంట్రల్ యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పటి వరకు బిల్లీరావు నుంచి భూమిని వెనక్కు తీసుకోలేదు. ఓపెన్ ఆక్షన్ ద్వారా పెట్టుబడుల కోసం
అంతర్జాతీయ సంస్థలకు ఇవ్వాలని ముందుకు వస్తే.. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులకు తీసుకొచ్చేందుకు అక్కడ విస్తరణ చేయాలనుకుంటున్నాం” అని చెప్పారు.
రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఇదే విషయంపై స్పందించారు. టీజీఐఐసీ అభివృద్ధి చేస్తున్న 400 ఎకరాల భూమిలో బఫెలో లేక్, పికాక్ లేక్ వంటి ప్రకృతి ప్రదేశాలు లేవు. యూనివర్శిటీ భూములను
తీసుకోవటం లేదని చెప్పారు. విశ్వవిద్యాలయంలోని రెండు సరస్సులతో పాటు అక్కడి ప్రకృతిని కూడా రక్షిస్తామని చెప్పారు.
విద్యార్థుల ఆందోళనకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మద్దతు తెలిపింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన పలువురు విద్యార్థి సంఘాల నాయకులు.. మంగళవారం కేటీఆర్ ను కలిశారు. తమ ఉద్యమానికి
మద్దతు అందించాలని విజ్ఞప్తి చేశారు. యూనివర్సిటీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న నేపథ్యంలో…. ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు కూడా మద్దతు అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ భూములను
వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే అక్కడి వైవిధ్యమైన జీవవైవిధ్యం మరియు వృక్షజాలం నశించి…. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.