తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు-
Land Bill in Assembly in Telangana-
దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక
తెలంగాణలో ఆర్‌వోఆర్ చట్టం-2020ను పూర్తిగా ప్రక్షాళన చేసిన ప్రభుతవం కొత్తగా భూభారతి బిల్లును తీసుకొచ్చింది. అనేక రోజులు పరిశోధనల తర్వాత దీన్ని రూపొందించినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభలో ప్రకటించారు. ఈ బిల్లు ఏర్పాటుకు ప్రతిపక్షాలు కూడా సలహాలు సూచలు చేశాయని గుర్తు చేశారు. ఈ బిల్లుతో తెలంగాణలోని ప్రతి ఇంచు భూమికి రక్షణ దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజల భూముల రక్షణతోపాటు కబ్జాదారుల భరతం పట్టేందుకు ఈ బిల్లు సహకరిస్తుందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. పదేళ్లు భూములను కబ్జాలు చేసిన వారి పని పడతామని సభా వేదికగా హెచ్చరించారు. ప్రజల భూములను కంటికి రెప్పలాకాపాడుకుంటామన్నారు. అనాలోచితంగా తీసుకొచ్చిన ధరని పోర్టల్ వల్ల ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పుకొచ్చారు. ఇందులో ఉన్న ఇబ్బందులు బీఆర్‌ఎస్ నేతలకి కూడా తెలుసన్న మంత్రి… ఇబ్బందులు వస్తాయని వారు నోరు విప్పడం లేదన్నారు. రెవెన్యూ అధికారుల దగ్గర పరిష్కారం కావాల్సినవి కూడా కోర్టులకు చేరాయని మంత్రి పొంగులేటి చెప్పారు. భూయజమానికి తెలియకుండానే భూమి చేయి దాటిపోయిందని ప్రస్తావించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొత్త ముసాయిదా సిద్ధం చేశామన్నారు. పలు రాష్ట్రాల్లో ఆర్వోఆర్ చట్టాలను పరిశీలించి ఈ చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ధరణిలో అనేక లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. వాటన్నింటిని సరిదిద్దేలా… కొత్త ముసాయిదా తీసుకొచ్చామని చెప్పారు.తహసీల్దార్లతోపాటు ఆర్డీవోలకూ మ్యుటేషన్ చేసే అధికారం ఇచ్చేలా ముసాయిదా రూపొందించారు. మ్యుటేషన్ సమయంలో విచారణకు అవకాశం కల్పిస్తుండగా… తప్పుగా తేలితే మ్యుటేషన్ నిలిపివేసే అధికారాలను కట్టబెట్టనుంది. ప్రతి భూకమతానికి భూ ఆధార్ ఉండనుంది. హక్కుల బదలాయింపు జరగ్గానే గ్రామ పహాణీలో నమోదయ్యేలా చర్యలు తీసుకుంటారు. అప్పీల్, రివిజన్‌లకు వెసులుబాటు కల్పిస్తూ బిల్లును రూపొందించారు. గతంలో అప్పీల్ కు అవకాశం లేకుండా చట్టం చేశారని మంత్రి పొంగులేటి చెప్పుకొచ్చారు.
ఆర్వోఆర్ రికార్డుల్లో తప్పులుంటే వాటిపై మొదటి అప్పీలుపై రివిజన్ అధికారాలు కలెక్టర్ లేదా అదనపు కలెక్టర్‌కు ఇవ్వనున్నారు, ఇక రెండో అప్పీలుపై సీసీఎల్‌ఏకు, మూడో అప్పీలుపై ప్రభుత్వానికి చేసుకునే వీలు ఉంటుందికొత్త బిల్లుపై ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరం చెప్పాయి. కనీసం సమయం ఇవ్వకుండా అర్ధరాత్రి ముసాయిదా బిల్లును వెబ్ సైట్ లో ఉంచారని.. ఇలా ఉంటే ఎలా ప్రిపేర్ అవుతారని అభ్యంతరం చెప్పారు. ఇవాళే సభలో ప్రశవేపెట్టి.. ఆమోదముద్ర వేయటం సరికాదని ఎంఐఎం, బీఆర్ఎస్, సీపీఐ, బీజేపీ సభ్యులు చెప్పుకొచ్చారు. రేపు పూర్తిస్థాయిలో చర్చ జరగాలని కోరారు. సభ్యులకు సవరణ ప్రతిపాదన అవకాశం ఇవ్వాలని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… స్పీకర్ అనుమతి ఇస్తే రేపు చర్చ జరుపుతామని ప్రకటించారు.ధరణితో కొందరికే మేలు జరిగిందన్న మంత్రి పొంగులేటి… లక్షల మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం కాకపోవడంతో అధికారుల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. భూ యజమానులకు తెలియకుండానే రికార్డులు తారుమారు అయ్యేవని అందుకే దీన్ని పూర్తిగా బంగాళాఖాతంలో కలిపేసి ప్రజాభిష్ఠం మేరకు కొత్త చట్టం తెచ్చామని పేర్కొన్నారు. ఇప్పుడు తీసుకొచ్చిన చట్టం రూపొందించడానికి లక్షల మంది ప్రజల అభిప్రాయాలు, రిటైర్డ్ ఉద్యోగుల ఆలోచనలు, ప్రతిపక్షాల మాటలను కూడా పరిగణలోకి తీసుకున్నామని తెలిపారు మంత్రి. హరీష్‌రావు, వినోద్ కుమార్ లాంటి వాళ్లు కూడా సలహాలు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రశ్నోత్తరాల టైంలో సభలో మంత్రులు, హరీష్ రావు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తెలంగాణలో రోడ్ల అంశంపై అడిగిన ప్రశ్నకు మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ మామ చాటు అల్లుడిగా ఉంటూ వేల కోట్లు దోచుకున్నారని కూలిపోయే కాళేశ్వరం కట్టారని విమర్శించారు. వాళ్లకు కమీషన్లు తీసుకోవడమే తెలుసని.. ప్రజలకు మంచి చేయడం తెలియదన్నారు. ఉప్పల్‌లో ఓ ఫ్లైఓవర్ పూర్తి చేయని వాళ్లు తమ ఫామ్‌హౌస్‌లకు నాలుగు లేన్ల రోడ్లు వేసుకున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే మార్చి నాటికి భూసేకరణ పూర్తి చేసిన నాలుగేళ్లలో త్రిబుల్ ఆర్ పూర్తి చేస్తామన్నారు. దీనికి కౌంటర్‌గా హరీష్‌రావు మాట్లాడుతూ.. తాను కమీషన్ తీసుకున్నట్టు నిరూపించాలని సవాల్ చేశారు. కొంతమంది సభ్యులు సభకు తాగి వస్తున్నారని అందుకే డ్రంకన్ టెస్టు పెట్టాలని సభాపతికి సూచించారు. కోమటి రెడ్డి కమీషన్ల చిట్టా విప్పితే తట్టుకోలేరని హెచ్చరించారు. తనపై ఆయన చేసిన కామెంట్స్ రికార్డుల నుంచి తొలగించాలన్నారు. హరీష్‌రావు కామెంట్స్‌ను మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖండించారు. ఇలాంటి మాటలు సరికాదని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన కామెంట్స్ కేసీఆర్‌ను గుర్తుకు తెచ్చినట్టు ఉందన్నారు విప్ బీర్ల ఐలయ్య. స్పీకర్ జోక్యం చేసుకొని హరీష్, బీర్ల ఐలయ్య మాటలు రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.