ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సీపీఐ, సీపీఎం, తెలంగాణ జన సమితి నేతలు భేటీ
తీన్మార్ మల్లన్న భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం
హైదరాబాద్ మే 25
స్);ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సీపీఐ, సీపీఎం, తెలంగాణ జన సమితి నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ విశ్వేశ్వర్ రావు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జూలకంటి
రంగారెడ్డి, ఎస్.వీరయ్య, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, మల్లు రవి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, బొంతు రామ్మోహన్, తదితరులు హాజరయ్యారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక,
చివరి రోజు ప్రచార సరళిపై నేతలు చర్చించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై రేవంత్ రెడ్డి సమీక్షించారని ఎమ్మెల్సీ మహేశ్కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సీపీఐ, సీపీఎం, జన సమితి పార్టీలు పూర్తిగా కాంగ్రెస్కు
మద్దతుగా నిలుస్తున్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే తమ అభ్యర్థి తీన్మార్ మల్లన్న భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరిన
ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ప్రజాస్వామ్యం బతకాలంటే తీన్మార్ మల్లన్న గెలవాలన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించేందుకు సీపీఐ నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
పొత్తులో భాగంగా సీపీఐగా కాంగ్రెస్కు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామన్న ఆయన, మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.బీజేపీ, బీఆర్ఎస్కు వ్యతిరేకంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతుగా
నిలిచామని తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తమ మద్దతు హస్తం పార్టీకి ఉంటుందని ఇప్పటికే స్పష్టం చేశామని, మార్పు కోసం అందరం కలిసి కాంగ్రెస్ను
గెలిపించాలని కోరారు. ప్రజాస్వామ్య పాలనను బలోపేతం చేసేందుకు హస్తం పార్టీని గెలిపించాలని కోరుతున్నామన్న ఆయన, ప్రజా సంక్షేమం వర్ధిల్లాలంటే తీన్మార్ మల్లన్నను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.