కేటీఆర్‌ ను కలిసిన  మదన్‌రెడ్డి

- Advertisement -

మెదక్‌, నర్సాపూర్‌ : నర్సాపూర్‌ శాసనసభ నియోజకవర్గ స్థానం నుంచి భారాస తరఫున బరిలో నిలిచే అభ్యర్థిత్వంపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. ఆయా అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థులను ప్రకటించిన పార్టీ అధిష్ఠానం.. నర్సాపూర్‌ స్థానాన్ని మాత్రం పెండింగ్‌లో ఉంచింది. అభ్యర్థులను ప్రకటించి 20 రోజులు గడుస్తున్నా ఇక్కడ ఇంకా ఖరారు కాకపోవడంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ప్రస్తుత ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతారెడ్డి మధ్య పోటీ నెలకొన్న సంగతి విదితమే. టిక్కెట్ల ప్రకటనకు ముందు మంత్రి కేటీఆర్‌ విదేశీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన తిరిగి వచ్చాక స్పష్టత రావచ్చని భావించినా, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.

అధిష్ఠానానికి అందరి బలాబలాలు తెలుసు

సునీతారెడ్డి కొన్ని రోజులుగా నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. విష జ్వరంతో బాధపడుతున్న మదన్‌రెడ్డిని వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. మంగళవారం మదన్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌ను కలిసి టిక్కెటు విషయమై ప్రస్తావించినట్లు సమాచారం. ఈ సమయంలో అన్ని నాన్న (సీఎం కేసీఆర్‌)కు తెలుసని, తుది నిర్ణయం వారిదేనని మంత్రి అన్నట్లు ఎమ్మెల్యే వర్గీయులు తెలిపారు. తాను విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఏం జరిగిందో వాకబు చేశానని, పార్టీ అధిష్ఠానానికి అందరి బలాబలాలు తెలుసునని, మా కుటుంబం ఎల్లప్పుడు మీతోనే ఉంటుందని అన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు సునీతారెడ్డి సైతం మూడు రోజుల కిందట మంత్రిని కలిశారు. ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతామన్నారని కేటీఆర్‌ చెప్పారన్నారు. నియోజకవర్గంలో అధికార పార్టీ అభ్యర్థి ఎవరనేది తేలాలంటే మరికొద్ది రోజులు వేచిచూడాల్సిందే.

నాయకుల వేడుకోలు..

నర్సాపూర్‌ టిక్కెట్‌ను ఎమ్మెల్యే మదన్‌రెడ్డికే ఇవ్వాలని మండలానికి చెందిన భారాస నేతలు, ప్రజాప్రతినిధులు మంత్రి కేటీఆర్‌ను వేడుకున్నారు. పార్టీ మండల అధ్యక్షుడు రమణాగౌడ్‌, సహకార సంఘం ఛైర్మన్‌ చింతల వెంకట్రాంరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ చంద్రాగౌడ్‌, జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు మన్సూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో కలిసి మంత్రిని కలిశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular