దుర్మార్గ పాలన పోవాలి
రాష్ట్రంలో సుపరిపాలన చేస్తాం
ఎల్బీనగర్ అభివృద్ధి పథంలో నడిస్తా..దీవించండి:
ఎల్బీనగర్, వాయిస్ టుడే
రాష్ట్రంలో ఉన్న దుర్మార్గ పాలన పోయి, సుపరిపాలన వచ్చేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధుయాష్కిగౌడ్ పిలుపునిచ్చారు. ఎల్బీనగర్ నియోజకవర్గం చంపాపేట డివిజన్ కు చెందిన బీఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ చంపాపేట అధ్యక్షులు బుదారపు గోపాల్ ముదిరాజ్, బీఆర్ఎస్ పార్టీ చంపాపేట డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌని అనసూయ గౌడ్ ఆధ్వర్యంలో పలువురు మహిళలు, యువకులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధుయాష్కిగౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మధుయాష్కి గౌడ్ మాట్లాడారు. అధికార దాహంతో ఇక్కడి స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సుధీర్ రెడ్డి మరోసారి ప్రజలను నయవంచనకు గురి చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఆయన కుట్రలు, కుతంత్రాలకు ప్రజలు లోనుకావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎల్బీనగర్ లో తన హయాంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి జరిగిందని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. ఎల్బీనగర్ లో అభివృద్ధి జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనేనని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ప్రజలు ఆకర్షితులై తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఎల్బీనగర్ లో తనను గెలిపిస్తే అవినీతిలేని పరిపాలనను అందిస్తానని ఆయన హామీనిచ్చారు. పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు మధుయాష్కిగౌడ్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన గోపాల్ ముదిరాజ్, అనసూయ గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో అవమానాలు పడలేక పార్టీ మారాల్సిన పరిస్థితి వచ్చేలా చేశారని అధికార నేతలపై మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలకు విలువలేదని, విలువలు లేని చోట ఉండలేక మధుయాష్కి గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్, పిసిసి కార్యదర్శి మల్ రెడ్డి రాంరెడ్డి, మాజీ కార్పొరేటర్ వజీర్ ప్రకాష్ గౌడ్, చంపాపేట డివిజన్ అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి, నాయకులు గ్యారగోని ప్రవీణ్ గౌడ్, రాగసుధ, భారతమ్మ, లక్ష్మమ్మ, విజయలక్ష్మి, కార్తీక్ ముదిరాజ్, దీపక్ ముదిరాజ్, జంగయ్య గౌడ్, సునీల్, లక్ష్మణ్, హన్మంతరెడ్డి, శ్రీకాంత్ గౌడ్, రాము యాదవ్, సామ మహేశ్వర్ రెడ్డి, రాహుల్, అధిక సంఖ్యలో మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.