జనసేనకు పోతిన మహేష్ రాజీనామా
విజయవాడ, ఏప్రిల్ 8
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీలో కీలక నేత పోతిన వెంకట మహేష్ సోమవారం ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీలో పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు జనసేనాని పవన్ కల్యాణ్ కు తన రాజీనామా లేఖను పంపించారు. కాగా, విజయవాడ పశ్చిమ టిెకెట్ ను మహేష్ ఆశించారు. అయితే, టీడీపీ – బీజేపీ – జనసేన పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీ నేత సుజనా చౌదరికి కేటాయించారు. ఈ టికెట్ తనకే కేటాయించాలని పలు సందర్భాల్లో మహేష్ డిమాండ్ చేస్తూ వచ్చారు. తన అనుచరులతో కలిసి నిరసన, ఆందోళనలు నిర్వహించారు. అయితే, అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురై పార్టీకి రాజీనామా చేశారు.పార్టీకి రాజీనామా చేసిన పోతిన మహేష్ జనసేనానికి ఈ సందర్భంగా లేఖ రాశారు. ‘జనసేన పార్టీలో నాకున్న పదవీ బాధ్యతలు, క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. ఇప్పటివరకూ నాకు సహకరించిన జనసేన పార్టీ నాయకులకు, వీర మహిళలకు, జనసైనికులకు, పెద్దలకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు.’ అంటూ లేఖలో పేర్కొన్నారు. కాగా, 2019 ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ అసెంబ్లీ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన పోతిన మహేష్ ఓటమి పాలయ్యారు. ఈసారి మళ్లీ పోటీ చేసి ఎలాగైనా విజయం సాధించాలని ప్రణాళికలు రచించారు. అయితే, టీడీపీ – బీజేపీ – జనసేన పొత్తులో భాగంగా ఆయనకు సీటు దక్కలేదు. అటు, టీడీపీ నుంచి కూడా ఈ సీటు కోసం గట్టిగానే పోటీ నడిచింది. సీటు విషయంలో టీడీపీ నేతలు వెనక్కి తగ్గినా పోతిన మహేష్ మాత్రం వెనక్కు తగ్గలేదు. ఈ క్రమంలో తాజాగా ఆయన పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఈ క్రమంలో ఆయన భవిష్యత్ కార్యచరణ ఏంటనే దానిపై ఆసక్తి నెలకొంది. ఆయన ఓ పార్టీలో చేరుతారో అనేది తెలియాల్సి ఉంది.
జనసేనకు పోతిన మహేష్ రాజీనామా

- Advertisement -
- Advertisement -