తెలంగాణలో రహదారి మౌలిక వసతులకు భారీ ప్రాధాన్యం
రూ.13 వేల కోట్లతో ఆర్అండ్బీ రోడ్డు పనులు: కోమటిరెడ్డి
Major emphasis on road infrastructure in Telangana: Komatireddy
పెద్దపల్లి, ఆగస్టు 19 (వాయిస్ టుడే):
తెలంగాణలో రహదారి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోందని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. మెరుగైన రహదారులు పారిశ్రామిక, వ్యాపార కార్యకలాపాల విస్తరణకు దోహదపడటంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గరేపల్లిలో బుధవారం రూ.219.67 కోట్ల విలువైన హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM), నాన్-ప్లాన్ రోడ్డు అభివృద్ధి పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ–పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తదితరులతో కలిసి శంకుస్థాపన చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో రూ.13 వేల కోట్లతో, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో మరో రూ.17 వేల కోట్లతో రోడ్డు పనులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంత పెద్ద స్థాయిలో రోడ్డు పనులు జరగడం లేదని పేర్కొన్నారు.
HAM విధానంలో ప్రాజెక్టు వ్యయంలో 40 శాతం ప్రభుత్వమే భరిస్తుందని, మిగిలిన 60 శాతం కాంట్రాక్టర్ భరిస్తారని వివరించారు. శంకుస్థాపన చేసిన పనులను రెండేళ్లలో పూర్తి చేస్తామని, వారం రోజుల్లోనే క్షేత్రస్థాయి పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.
గత ప్రభుత్వం సుమారు రూ.40 వేల కోట్ల పెండింగ్ బిల్లులు వదిలివెళ్లిందని మంత్రి ఆరోపించారు. హైదరాబాద్–రామగుండం మధ్య కొత్త గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణానికి కేంద్ర మంత్రితో చర్చలు జరిపామని, ప్రతిపాదిత రహదారిలో సుల్తానాబాద్ బైపాస్కు కూడా అనుమతి తీసుకురావడానికి ప్రయత్నిస్తామని చెప్పారు.
రోడ్డు భద్రతపై ప్రజలు, వాహనదారులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మంత్రి సూచించారు. చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శిస్తూ, ప్రస్తుత ప్రభుత్వం శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం నుంచి నీటిని పంపింగ్ చేసి స్థానిక సాగుకు తోడ్పడుతోందన్నారు.
పెద్దపల్లి బైపాస్ రోడ్డుకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలలోనే నిధులు మంజూరు చేశామని, ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.




