రాజ్యసభలో బీజేపీకి మెజార్టీ….
Majority for BJP in Rajya Sabha
న్యూఢిల్లీ, ఆగస్టు 13,
ఎన్డీఏ కూటమి రాజ్యసభలో పూర్తి మెజార్టీ సాధించనుంది. కీలక బిల్లులను ఆమోదింపజేసుకోవడం కోసం ఎగువసభలో మెజారిటీ ఉండటం కీలకం. ఎగువసభలో ప్రస్తుతం ఉన్న 229 స్థానాలలో బిజెపికి 87 మాత్రమే ఉన్నాయి. ఎన్‌డిఎలోని ఇతర పార్టీలతో కలిసి ఆ బలం 105కు చేరింది. ఆరుగురు నామినేటెడ్ సభ్యులు ఎలాగూ అధికార పక్షానికే ఓటు వేస్తారు కనుక ప్రభుత్వ పక్షాన 111 మంది సభ్యులు ఉన్నట్లు. సెప్టెంబరులో రాజ్యసభలోని 12 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. వాటిలో పదకొండు స్థానాలు బీజేపీ ఖాతాలోనే పడనున్నాయి. వక్ఫ్ సవరణ బిల్లు సహా పలు కీలక బిల్లులు ఆమోదం పొందాలంటే రాజ్యసభలో మెజారిటీ సాధించడం బిజెపికి తప్పనిసరి. కాంగ్రెస్‌కు 26 మంది సభ్యులు ఉండగా మిత్రపక్షాల బలం 58. అంటే ఇండియా కూటమి మొత్తం బలం 84. వైసిపికి చెందిన 11 మంది, బిజెడికి చెందిన 8 మంది ఉన్నారు. తాము వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తామని ఆ పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి. తొమ్మిది రాష్ట్రాల నుండి 12 స్థానాలకు వచ్చే నెల 3వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. జమ్మూకాశ్మీర్ నుండి నలుగురు ఎగువసభకు ఎన్నిక కావాల్సి ఉంది. అక్కడ శాసనసభ లేకపోవడంతో ఎన్నికలు జరగవు. దీంతో రాజ్యసభ సభ్యుల సంఖ్య 241కి తగ్గుతుంది. రాజ్యసభలో మొత్తం 245 స్థానాలు ఉన్నాయి. ఇందులో జమ్మూకశ్మీర్ కి సంబంధించి అసెంబ్లీలు లేకపోవడంతో నాలుగు సీట్లు ఖాళీగా ఉన్నాయి . ప్రస్తుతం పన్నెండు స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పన్నెండు కాకుండా 229 మందిలో ఎన్డీఏ పార్టీలకు 105 మంది సభ్యులు ఉన్నారు. మరో ఆరుగురు నామినేటెడ్ సభ్యులు కూడా బీజేపీకే మద్దతిస్తారు. అంటే 111 మంది. ఉపఎన్నికలు జరుగుతున్న 12 రాజ్యసభ స్థానాల్లో 11 బీజేపీ , మిత్రపక్షాల ఖాతాల్లో ఏకగ్రీవంగా పడనున్నాయి అంటే 122 మంది సభ్యుల బలం ఉన్నట్లే. ప్రస్తుతం 241 సీట్ల రాజ్యసభలో 122 మంది సభ్యులు అంటే.. సాధారణ మెజార్టీ వచ్చినట్లే. వైసీపీ, బీజేడీ మద్దతు బీజేపీకి అక్కర్లేదు. పదకొండు మంది రాజ్యసభ సభ సభ్యులు ఉన్న వైసీపీ.. తమ అవసరం బీజేపీకి ఉందని ఆ పార్టీ నేతలు సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతున్నారు. సెప్టెంబర్‌లో ఉపఎన్నికలు పూర్తయిన తర్వాత ఎన్డీఏ కూటమికి ఇక ఎవరి అవసరం ఉండకపోవచ్చు. అందుకే.. వక్ఫ్ బిల్లును అప్పటికే సభలోకి వచ్చేలా జేపీసీకి పంపించారన్న అభిప్రాయం వినిపిస్తోంది.