మల్కాజ్ గిరి అందిరికి ప్రతిష్టాత్మకం
హైదరాబాద్, మార్చి 30,
లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుండి అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లేందుకు వ్యూహాలను రెడీ చేసుకుంటున్నాయి. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజిగిరి పైన ప్రధాన పార్టీలన్నీ ఫోకస్ పెట్టాయి. ఎలాగైనా మల్కాజిగిరి స్థానాన్ని దక్కించుకోవాలని కసరత్తులు చేస్తున్నాయి.మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి మరోసారి జెండా ఎగురవేయాలని కాంగ్రెస్ ఉవ్విల్లూరుతోంది. ఇప్పటి వరకు జరిగిన మూడు ఎన్నికల్లో రెండు సార్లు కాంగ్రెస్ పార్టీకే నియోజకవర్గ ప్రజలు పట్టం కట్టారు. ప్రస్తుత ఎంపీగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈసారి రాష్ట్రంలో అధికారంలో ఉండటం.. గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గెలుపొందిన నియోజకవర్గం కావడంతో కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈసారి మల్కాజిగిరి నుంచి ఎట్టి పరిస్థితిలో గెలుపొందాలనే ఆలోచనలో బలమైన అభ్యర్థి కోసం బీఆర్‌ఎస్‌లో ఉన్న వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డిని కాంగ్రెస్‌లోకి తీసుకుని బరిలో నిలిపారు.మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం అంటేనే మిని ఇండియాగా పేరుంది. నియోజకవర్గంలోని ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్ అత్యంత కీలకమైన ప్రాంతాలు. గ్రేటర్ హైదరాబాద్‌లో అంతర్భాగమైన ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, ఉప్పల్, ఎల్బీనగర్, కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ఈ నియోజకవర్గంలో దేశ రక్షణ రంగానికి చెందిన ఏయిర్ ఫోర్స్, ఆర్మీ స్థావరాలతో పాటు పారిశ్రామికరంగం, విద్యారంగానికి సంబంధించిన ప్రతిష్టాత్మకమైన యూనిర్శిటీలు ఇలా అన్ని రంగాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంది. అంతేకాదు దేశంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా మల్కాజిగిరికి గుర్తింపు.ఆర్థికంగా తెలంగాణకు గుండెకాయ లాంటి ప్రాంతం మల్కాజిగిరి. హైదరాబాద్‌కు తూర్పు వైపున ఉన్న ఈ నియోజకవర్గం సెంటిమెంట్‌గా అత్యంత కీలకమైన నియోజకవర్గంగా గుర్తింపు పొందింది. దాదాపు 38 లక్షల ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మల్కాజిగిరి నియోజకవర్గంగా అవతరించింది. ఇప్పటి వరకు జరిగిన మూడు ఎన్నికల్లో రెండు సార్లు కాంగ్రెస్, ఒక్కసారి టీడీపీ గెలుపొందాయి. అయితే ఈసారి మూడు ప్రధాన పార్టీలు గెలుపుపై ఫోకస్ పెట్టాయి.ఈ నియోజకవర్గం గెలుపుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. మూడెంచల విధానంతో గెలుపుబావుట ఎగురవేయాలని కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ నియోజకవర్గానికి సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును నియోజకవర్గ ఇంచార్జ్‌గా నియమించింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఈ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్‌లలో కాంగ్రెస్ ఒక్కటీ కూడా గెలవక పోవడం పెద్ద మైనస్ గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచినా.. ఈ నియోజకవర్గం స్వయంగా రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించినా, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఖాతా తెరవలేదు. దీంతో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల విషయంలో కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి.అభ్యర్థి ఎంపిక విషయంలో అనేక ఊహాగానాల మధ్య.. చేవెళ్ల నుంచి అనుకున్న అభ్యర్థిని మల్కాజిగిరిలో బరిలో దింపారు. ఇక గెలుపు విషయంలో గత ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు ఇప్పుడు జరగకుండా.. లోటుపాట్లను సరి చేసుకుని విజయకేతనం ఎగురవేయాలని చూస్తోంది కాంగ్రెస్. అందుకోసం ఇతర పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నేతలను చేర్చుకుని విజయబావుట ఎగురవేయాలని చూస్తోంది. కాంగ్రెస్ గెలిస్తేనే నియోజకవర్గం అభివృద్ధి సాధ్యం అంటూ ప్రచారం చేస్తోంది.ఇక ప్రతిపక్ష బీఆర్‌ఎస్ ఈ సారి మల్కాజిగిరిపై జెండా ఎగురవేయాలని చూస్తోంది. రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న ఈ పార్లమెంట్ సెగ్మెంట్‌ను మాత్రం కైవసం చేసుకోలేకపోయింది. మల్కాజిగిరి పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవడంతో ఈసారి పార్లమెంట్ స్థానంపై ఆశలు మెండుగా ఉన్నాయి అని ఆశిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 9.5 లక్షల ఓట్లు సాధించింది. అన్ని అసెంబ్లీ స్థానాల్లో కలిపి బీఆర్‌ఎస్ పార్టీకి 3.5 లక్షల మెజారిటీ వచ్చింది. ఎమ్మెల్యేలందరూ కలిసి కట్టుగా ఉండటంతో గెలిచి తీరాలని పట్టుదలతో ఉంది. మల్కాజిగిరి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన స్థానం కావడంతో గెలిచి కాంగ్రెస్‌కు ఝలక్ ఇవ్వాలని చూస్తోంది.బీఆర్‌ఎస్ అగ్రనేతలు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఈనేపథ్యంలోనే ఇటీవల కాంగ్రెస్ వీడి బీఆర్ఎస్‌లో చేరిన రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆదరించిన మాదిరిగానే ఓటర్లు ఈసారి బీఆర్‌ఎస్‌నే ఆదరిస్తారని గట్టి నమ్మకంతో ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న పాజిటివ్.. పార్లమెంట్ ఎన్నికల్లో ఉంటుందా అనే అనుమానం పార్టీ నేతలను వెంటాడుతోంది. రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో క్యాడర్‌లో కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. అయితే ప్రజల్లో పార్టీ పట్ల విశ్వాసం అలాగే ఉందని..పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్‌ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామంటోంది.ఈసారి మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కాషాయపార్టీ సిద్దం అవుతోంది. డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ పదే పదే నినదిస్తున్న బీజేపీ ఈ సెగ్మెంట్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఈసారి మెజారిటీ ఎంపీలు గెలిస్తే.. రాష్ట్రంలో కీలక పాత్ర పోషించవచ్చని భావిస్తోంది. అందులో భాగంగా సానుకూల పవనాలున్న మల్కాజిగిరిని కైవసం చేసుకోవాలని చూస్తోంది. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాదరణ కలిసొస్తుందని గట్టి ధీమాతో ఉంది. మల్కాజిగిరి వంటి పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకుంటే తెలంగాణపై పట్టు సాధించవచ్చని చూస్తోంది. బీజేపీ తరపున ఈసారి ఈటెల రాజేందర్ వంటి బలమైన అభ్యర్థి బరిలో దిగడంతో అంచనాలు కూడా భారీగా పెరిగాయి.ప్పటి వరకు మల్కాజ్‌గిరిపై కాషాయ జెండా ఎగరకపోవడంతో ఈసారి ఖచ్చితంగా గెలిచితీరాలని పట్టుదలతో ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపకపోవడంతో బీజేపీకి మైనస్‌గా మారింది. నాలుగు లక్షల ఓట్లు కూడా సాధించకపోవడంతో.. ఎక్కడో చిన్న అనుమానం రేకెత్తుతోంది. గత మూడు పర్యాయాలు జరిగిన ఎన్నికలు నిరాశజనకంగా ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం మోదీ మేనియా.. పార్టీకి ఉన్న పాజిటివ్ టాక్ ద్వారా ఎట్టి పరిస్థితిలో గెలవాలని పట్టుదలగా ఉంది.సో.. మొత్తం మీద మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం అన్ని ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఒక వైపు అధికార కాంగ్రెస్.. తన సిట్టింగ్ సీటును కాపాడుకోవాలని చూస్తుంటే, అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన బీఆర్‌ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో సైతం జెండా ఎగురవేయాలని చూస్తోంది. ఇక కాషాయదళం జెండా ఎగురవేసి సత్తా చాటాలని బీజేపీ ఉవ్విల్లూరుతోంది. చూడాలి మల్కాజిగిరి ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది..!
మల్కాజ్ గిరి అందిరికి ప్రతిష్టాత్మకం
- Advertisement -
- Advertisement -