త్రికాల సినిమాటిక్ యూనివర్స్’ సృష్టికర్తగా మణి తెల్లగూటి
Mani Tellaguti as the creator of the ‘Trikala Cinematic Universe’
కలలు కనడం సులభమే… కానీ ఆ కలలకు రెక్కలొచ్చి వెండితెరపై విశ్వరూపం దాల్చాలంటే అద్భుతమైన పట్టుదల, సాంకేతిక ప్రతిభ, ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆ మూడింటినీ కలబోసుకున్న అరుదైన ప్రతిభామూర్తి మణి తెల్లగూటి.
పచ్చని పొలాల మధ్య ఎదిగిన ఒక సాధారణ రైతు బిడ్డ… నేడు టాలీవుడ్‌ను త్రికాలాల వైపు తిప్పి చూసేలా చేసిన దర్శకుడిగా మారడం వెనుక ఒక గొప్ప తపస్సు ఉంది. ప్రొజెక్టర్ గదిలో వినిపించే రొద, వెండితెరపై ప్రసరించే వెలుగులో తన భవిష్యత్తును వెతుక్కున్న ఆ కుర్రాడు… నేడు ‘త్రికాల సినిమాటిక్ యూనివర్స్’తో శభాష్ అనిపించుకుంటున్నారు.
ప్రొజెక్టర్ వెలుగు నుంచి ప్రొడక్షన్ ఛైర్ వరకు..
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా, చింతాపూడి గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించిన మణి తెల్లగూటి ప్రయాణం అత్యంత స్ఫూర్తిదాయకం. తిరుపతిలో చదువుకుంటూ, ఒక సినిమా ఆపరేటర్ కుమారుడిగా పెరిగిన ఆయనకు చిన్నతనం నుంచే సినిమా పై అపారమైన మక్కువ ఏర్పడింది. చీకటి కొట్టు ప్రొజెక్టర్ గది నుంచి కదిలే ప్రతిబింబం ఆయనలోని దర్శకుడిని, సృష్టికర్తను నిరంతరం నిద్రలేపుతూనే ఉంది.
కేవలం ఆశయంతో ఆగిపోకుండా, సినీ పరిశ్రమలో తనకంటూ ఒక బలమైన స్థానాన్ని సంపాదించుకోవడానికి ఆయన ఎంచుకున్న మార్గం VFX (విజువల్ ఎఫెక్ట్స్). పదునైన VFX ఆర్టిస్ట్‌గా సాంకేతికతపై పట్టు సాధించారు. సీన్ల మూడ్‌ను, సినిమా పేసింగ్‌ను శాసించే ఎడిటర్‌గా తన ప్రతిభను చాటుకున్నారు. సాంకేతిక అనుభవాన్ని సృజనాత్మకతకు జోడించి రచయితగా, దర్శకుడిగా కొత్త అవతారం ఎత్తారు.
‘త్రికాల’ – తెలుగు తెరకు కొత్త అనుభూతి!
టెక్నికల్ బ్రిలియన్స్, గ్రిప్పింగ్ కథన శైలితో మణి తెల్లగూటి తెరకెక్కించిన ‘త్రికాల’ చిత్రం ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. నిర్మాత రాధిక శ్రీనివాస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి పవన్ చెన్న అందించిన కెమెరా పనితనం గ్రాండ్ విజువల్ ట్రీట్‌గా నిలిచింది. థియేటర్లలోనే కాకుండా, OTT రంగంలోనూ అడుగుపెట్టిన తర్వాత ‘త్రికాల’ ఒక ట్రెండ్ సెట్టర్‌గా మారింది. విజువల్ ఎఫెక్ట్స్ వాడకంలోనూ, కాలభ్రమణం, ఆధ్యాత్మికత, వైజ్ఞానిక అంశాలను ముడిపెడుతూ మణి చెప్పిన కథా విధానం సినీ ప్రియులను కట్టిపడేసింది.
TCU: ‘త్రికాల సినిమాటిక్ యూనివర్స్’తో సంచలనం!
‘త్రికాల’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు… అదొక సుదీర్ఘమైన కథా ప్రపంచానికి ఆరంభం! దర్శకుడు మణి తెల్లగూటి ఇప్పుడు తన ఆలోచనలను మరింత విస్తరిస్తూ ‘త్రికాల సినిమాటిక్ యూనివర్స్ (TCU)’ ను నిర్మిస్తున్నారు.
“ఒక కథతో ఆగిపోవడం నా లక్ష్యం కాదు… ప్రేక్షకులను సరికొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్లే ఒక విశ్వాన్ని (Universe) నిర్మించడమే నా ధ్యేయం! ఈ సినిమాకు పెద్ద బ్యాక్ గ్రౌండ్ లేనప్పటికీ, మీడియా అందించిన అపారమైన మద్దతును తాను ఎప్పటికీ మర్చిపోలేను” అని ఆయన అన్నారు.
తదుపరి రాబోయే సీక్వెల్స్, నూతన చిత్రాల కథలన్నీ ఈ ‘TCU’ లో భాగంగానే అనుసంధానమై ఉంటాయని తెలియడంతో, సినీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ స్థాయి కాన్సెప్టులను మన దేశీయ మూలాలకు జోడిస్తూ మణి డిజైన్ చేస్తున్న ఈ ‘యూనివర్స్’ రాబోయే రోజుల్లో తెలుగు సినిమా స్థాయిని పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.
మట్టి వాసన తెలిసిన రైతు బిడ్డగా ప్రయాణం మొదలుపెట్టి, డిజిటల్ యుగంలో అత్యంత అరుదైన VFX-మాస్టర్, ఎడిటర్, రైటర్, డైరెక్టర్ గా రూపాంతరం చెందిన ఆయన విజన్ ప్రశంసనీయం. సాంకేతికతను నమ్ముకుని, స్వయంకృషితో ఎదిగిన మణి తెల్లగూటికి సినీ ప్రముఖులు, అభిమానులు, సాంకేతిక నిపుణులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మణి తెల్లగూటి సృష్టించిన ‘త్రికాల సినిమాటిక్ యూనివర్స్’ దిగ్విజయంగా వికసించాలని, తెలుగు తెరకు మరిన్ని అద్భుతమైన, సాంకేతికంగా ఘనమైన దృశ్యకావ్యాలను ఆయన అందించాలని కోరుతూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.




