రేవంత్ కు మాస్ ఇమేజ్…
Mass image for Revanth...
హైదరాబాద్, సెప్టెంబర్ 11, (న్యూస్ పల్స్)
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తన సన్నిహితుల వద్ద తరచూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నోటి నుంచి ఒక మాట వినిపిస్తూ ఉంటుందని చెబుతారు. ‘‘ముఖ్యమంత్రిని అవుతామని ఎప్పుడైనా అనుకున్నామా? దేవుడి పుణ్యమా అని అయ్యాం,భయపడుతూ కూర్చుకుంటే ఏ పని చేయలేం. వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టొద్దు. పాలనలో మన ముద్ర వేద్దాం. అనవసర భయాలకు పోవద్దు. మంచి చేసుకుంటూ పోదాం. ఏది జరిగితే అది జరుగుతుంది’’ అని వ్యాఖ్యానించేవారట. నిజానికి ఈ తెగింపే రేవంత్ కు కొత్త ఇమేజ్ ను తెచ్చి పెట్టిందని చెప్పాలి.రేవంత్ పాలనను తీసుకుంటే.. బోలెడన్ని సంచలన నిర్ణయాలు తీసుకోవటం కనిపిస్తుంది. అధికారంలో ఉన్నంత కాలంలో పాలన మీద తనదైన ముద్ర వేయాలన్న తహతహ రేవంత్ లో ఎక్కువగా కనిపిస్తుందని చెబుతారు. అందుకు తగ్గట్లే రేవంత్ తీరు ఉందని చెప్పాలి.ఎయిర్ పోర్టు మెట్రో కావొచ్చు.. మూసీ ప్రక్షాళన కావొచ్చు.. ఫోర్త్ సిటీ కావొచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే వినూత్నంగా ప్లాన్ చేసి.. హైదరాబాద్ ఇమేజ్ ను గ్లోబల్ చేయాలన్న పట్టుదల కనిపిస్తూ ఉంటుంది.ఈ కోవలోనే తెర మీదకు వచ్చింది హైడ్రా. విపత్తుల వేళ సాయం చేసేందుకు.. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ ముఖ్యమంత్రి రేవంత్ కు సరికొత్త ఇమేజ్ ను తీసుకురావడమే కాదు.. ఆయనకు ఒకలాంటి మాస్ ఇమేజ్ ను తీసుకొచ్చింది.రేవంత్ ప్రభుత్వ గ్రాఫ్ విషయానికి వస్తే.. కొన్నిసార్లు అప్.. మరికొన్నిసార్లు డౌన్ అన్న పరిస్థితి. అందుకు భిన్నంగా హైడ్రా పుణ్యమా అని రేవంత్ సర్కారు గ్రాఫ్ దూసుకెళుతోంది.హైడ్రా పని తీరు మీద ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు మాత్రమే కాదు.. పాలకులు సైతం ఫోకస్ చేస్తున్నారు. హైడ్రా వ్యవస్థ ఏర్పాటు వివరాల్ని తమకు షేర్ చేయాలని కోరుతున్న పరిస్థితి. ఏదైనా మంచి పని చేయాలన్నప్పుడు చాలానే అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి.అలాంటి వాటిని పట్టించుకోకుండా.. పని మీదే ఫోకస్ తప్పించి.. మరే ఇతర ఒత్తిళ్లకు తలొగ్గదన్న సీఎం రేవంత్ క్లారిటీతో హైడ్రా అధికారులు దూసుకెళుతన్నారు. మొత్తంగా పాలనలో కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న రేవంత్ సర్కారుకు.. హైడ్రా అనుకోకుండా ఒక ఆయుధంగా మారటమే కాదు.. వ్యక్తిగతంగా సీఎం రేవంత్ ఇమేజ్ ను భారీగా పెంచేసిందని చెప్పాలి