ప్రధానమంత్రి మోడీ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు
వేదిక వద్ద హెలీప్యాడ్ ఏర్పాటు అనుమతులు నిరాకరణ
మూడు హెలీ ప్యాడ్ లు ఒకే చోట
మొహరించిన కేంద్ర బలగాలు
రాజమహేంద్రవరం సమీపంలో కడియం మండలం వేమగిరి జాతీయ రహదారి పక్కన గల స్థలంలో సోమవారం బిజెపి, టిడిపి, జనసేన (ఎన్డిఎ కూటమి) విజయ శంఖారావం పేరుతో బహిరంగ సభ జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లు ఈ బహిరంగ సభలో పాల్గొనున్నారు. ప్రధానమంత్రి వస్తున్నందున పూర్తి అధికారిక ప్రోటోకాల్ ప్రకారం చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బొమ్మూరు భూలోకమ్మ గుళ్ళు సమీపంలో గల అమర్నాథ్ పొలంలో ఈ ముగ్గురికి వేరువేరుగా హెలీ ప్యాడ్ లను సిద్ధం చేస్తున్నారు. అలాగే ప్రధానమంత్రి కి జాతీయ రహదారితో సంబంధం లేకుండా బహిరంగ సభ జరిగే సమీపంలో వేరేగా హెలి ప్యాడ్ తయారికి సన్నహాలు చేశారు. బహిరంగ సభకు తూర్పు వైపున గల స్థలంలో హెలీ ప్యాడ్ నిర్మాణానికి అంతరాయం గా ఉంటుందని 132 కె.వి విద్యుత్తు లైనును మార్పు చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆ విద్యుత్ వైర్లను తొలగించే పనిని కూడా విద్యుత్ శాఖ ఎస్సీలు గురుముర్తి,టివిఎస్‌ఎన్ మూర్తి ల ఆద్వర్యంలో చేపట్టారు. అయితే శనివారం సాయంత్రం ఢిల్లీ నుంచి వచ్చిన ప్రధానమంత్రి భద్రత అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రధానమంత్రి కి హెలీ ప్యాడ్ బహిరంగ సభ సమీపంలో తయారు చేయడం వీలుపడదని తేల్చి చెప్పారు. దీంతో విద్యుత్ లైన్ తొలగించడం నిలుపుదల చేశారు. ముగ్గురికి ఒకే చోట ఈ హెలిపాడ్ లు ఆగమేఘాల మీద సిద్దం చేస్తున్నారు.
ప్రధానమంత్రి హెలిపాడ్ కు చేరుకున్నాక రహదారులన్నీ నిలుపుదల చేయడంతో ఈ బహిరంగ సభకు వచ్చే ప్రజలకు తీవ్ర అంతరాయం కలగనుంది. అందుకునే ప్రధానిమంత్రి రాకకు ముందే సభా స్థలానికి ప్రజలు వచ్చేలా ఏర్పాటు చేయాలని బిజెపి నాయకులకు ఏలూరు ఐజి అశోక్ కుమార్ సూచించారు.శనివారం బిజెపి నాయకులు కాశి రాజు, కె.లక్ష్మీనారాయణ, ఆకుల శ్రీధర్, అడబాల రామకృష్ణ, పడాల నాగరాజు,కొలవలస హారిక తదితరులతో వేమగిరి సభా ప్రాంగణం వద్ద ఐజి,కేంద్ర బృందం చర్చించారు. జిల్లా ఎస్పీ పి.జగదీష్, అడిషనల్ ఎస్పీ పి. అనిల్ కుమార్, సౌత్ జోన్ డిఎస్పి ఎం.అంబికా ప్రసాద్, కడియం ఇన్స్పెక్టర్ బి. తులసీదాస్ తదితర అధికారులంతా ప్రధానమంత్రి పర్యటనలో ఎలాంటి అవాంతరాలు కలగకుండా కృషి చేస్తున్నారు.