Wednesday, February 11, 2026

 కోట్లు కురిపిస్తున్న మేడారం హుండీలు

- Advertisement -

 కోట్లు కురిపిస్తున్న మేడారం హుండీలు
వరంగల్ ఫిబ్రవరి 10, (వాయిస్ టుడే )

Medaram Hundis are pouring in crores
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర ఇటీవల పూర్తయిన సంగతి తెలిసిందే. దాదాపు రెండున్నర కోట్ల మంది భక్తులు వచ్చి.. అమ్మవార్లను దర్శించుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. ఇక మేడారంలో ఏర్పాటు చేసిన హుండీలను హనుమకొండకు తీసుకువచ్చి.. టీటీడీ కల్యాణ మండపంలో గత గురువారం రోజున లెక్కింపు ప్రక్రియను రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు ప్రారంభించారు. ఇవాళ్టికి గత 5 రోజులుగా హుండీలను లెక్కించే పనిలో దేవాదాయ శాఖ సిబ్బంది తలమునకలై ఉన్నారు. ఇక ఐదోరోజు 163 హుండీలను లెక్కించిన అధికారులు ఇప్పటివరకు వచ్చిన ఆదాయం వివరాలను వెల్లడించారు. ఒక్కరోజే 163 హుండీలను లెక్కించగా.. అందులో మొత్తం రూ.1.12 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు గత 5 రోజుల్లో మొత్తం 788 హుండీలను లెక్కించినట్లు దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు. ఇందులో మొత్తంగా ఇప్పటివరకు రూ.11.83 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఇందులో మన దేశ కరెన్సీతోపాటు విదేశాలకు చెందిన నోట్లు వస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు దాదాపు 18 దేశాలకు చెందిన నోట్లు వచ్చాయని వెల్లడించారు.మిగిలిన హుండీల లెక్కింపు ప్రక్రియ కూడా ముమ్మరంగా సాగుతోందని ఆలయ సిబ్బంది పేర్కొన్నారు. లెక్కింపు పూర్తి కావడానికి మరో రెండ్రోజుల సమయం పట్టవచ్చని సిబ్బంది అంచనా వేశారు. ఇప్పటివరకు డబ్బులు మాత్రమే లెక్కిస్తుండగా.. ఈ నోట్లు మొత్తం లెక్కించడం పూర్తి అయిన తర్వాత బంగారం, వెండి వస్తువులను వాటి బరువు ఆధారంగా విలువను నిర్ధరించనున్నట్లు వెల్లడించారు.మరోవైపు.. మేడారం మహాజాతరలో ఏర్పాటు చేసిన హుండీల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయంలో 33 శాతాన్ని మేడారం పూజారులకు అందించనున్నారు. ఇక గతంలో నిర్వహించిన మహాజాతరలో సుమారు రూ.13 కోట్ల ఆదాయం సమకూరింది. అయితే.. ఈసారి భారీగా పెరగనున్నట్లు దేవాదాయ శాఖ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. గతంతో పోల్చితే 3 రెట్లు అధికంగా హుండీ ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.ఇక మొత్తం హుండీల లెక్కింపునకు దాదాపు 10 రోజులకు పైనే సమయం పడుతుందని పేర్కొంటున్నారు. హుండీల్లో డబ్బులు, బంగారం, వెండి, ఇతర ఆభరణాలు, విదేశీ కరెన్సీ లెక్కింపు ఇంతా పూర్తి అయిన తర్వాత మొత్తం ఈసారి ఆదాయం ఎంత వచ్చింది అనేదానిపై అధికారిక ప్రకటన చేయనున్నారు.ఈ మహాజాతరలో భాగంగా గద్దెల ప్రాంగణంలో మొత్తం 828 హుండీలను ఏర్పాటు చేశారు. వాటిలో 780 ఇనుప హుండీలు కాగా.. 45 వస్త్ర హుండీలు, 3 బియ్యం హుండీలు ఉన్నట్లు దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక హుండీల్లో పాత రూ.500, రూ.1000 నోట్లు కూడా వస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు.. మరికొందరు భక్తులు పేపర్లు, నోట్లపై తమ కోరికలను రాసి వాటిని తీర్చాలంటూ సమ్మక్క సారలమ్మలను వేడుకున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్