Wednesday, January 22, 2025

తెలంగాణలో హరిగోస పడుతున్న వైద్య విద్యార్థులు

- Advertisement -

తెలంగాణలో హరిగోస పడుతున్న వైద్య విద్యార్థులు

Medical students suffering in Telangana

— కళాశాలల్లోనే ఒరిజినల్ సర్టిఫికెట్స్

—- కస్టోడియన్ సర్టిఫికెట్ ఇచ్చి గెంటివేత

— ఒరిజినల్స్ కు లక్షల్లో డిమాండ్ చేస్తున్న వైనం

—అవకాశాలు చేజారి పోతున్నాయంటూ విద్యార్థుల ఆవేదన

—రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాలని విజ్ఞప్తులు.

—ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్న బాధిత విద్యార్థులు

వైద్యో నారాయణ హరి అంటారు కానీ తెలంగాణ రాష్ట్రంలో అదే వైద్య విద్యార్థులు హరిగోస పడుతున్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.భారతదేశంలో గొప్ప ప్రజాస్వామ్యం పరిడవిల్లుతోందని ప్రపంచ వేదికల పైన ఉచిత ప్రసంగాలు  చేస్తున్న స్థితిని చూసిన మన భారతమాత కన్నీరు పెడుతోందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తొండ ముదిరి ఊసరవెల్లి ఐన చందంగా చిరు వ్యాపారస్తులుగా తమ ప్రయాణాన్ని ప్రారంభించి బడా వ్యాపారస్తులుగా అనతి కాలంలోనే ఎదిగిపోతున్నారు. అంతటితో ఆగకుండా వారి వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత రెట్టింపు చేసుకోవడానికి రాజకీయాల్లోకి  రంగ ప్రవేశం చేస్తున్నారు. అనంతరం అసెంబ్లీ, పార్లమెంట్లలో అడుగు పెట్టి వారి వ్యాపార సామ్రాజ్యానికి అనుకూల చట్టాలను తయారు చేసుకుంటున్నారు. ఆ చట్టాలను వారి  చుట్టాలుగా వాడుకుంటున్నారు. ముఖ్యంగా ఈ అప్రజాస్వామిక,అసాధారణ పోకడలు ఈ తెలుగు రాష్ట్రల్లో జోరందుకున్నాయి.గత అర్ధ దశాబ్ద కాలంగా తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న అసహజ పరిణామాలే ఇందుకు చక్కని ఉదాహరణ. తమ పిల్లల్ని డాక్టర్లుగా చూడాలనే పేద,మధ్య తరగతి తల్లిదండ్రుల కోరికనే  తెలంగాణలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల కు అందివచ్చిన అవకాశంగా మారింది.ఉదాహరణకు “ఏ” అనే ఒక కోర్సు కు అప్పటివరకు ఆరు లక్షల చిల్లర ఉన్న ఫీజును అమాంతం 12 లక్షల వరకు  పెంచి తీసుకోవడానికి అప్పటి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడకుండా , స్వార్థ ప్రయోజనాల కోసం,రాజకీయ మిత్రుల స్వప్రయోజనాల కోసం  మాత్రమే తీసుకున్న నిర్ణయం అని ఇట్టే అర్థం అవుతుంది.ఒకవేళ పెంచాల్సిన అవసరం వస్తే యాభై వేలో,లక్షనో పెంచాలి కానీ అమాంతం ఉన్న ఫీజును రెట్టింపు చేయడం అంటే మమ్మల్ని దారి దోపిడీ చేసి దండుకోవడమేనని బాధిత వైద్య విద్యార్థినీ,విద్యార్థులు వారి ఆవేదనను వెలిబుచ్చుతున్నారు.ఇదిలా ఉండగా కొంతమంది విద్యార్థులు ఇదే అంశంపై న్యాయస్థానాలను ఆశ్రయించగా విద్యార్థులకు అనుకూలంగా తీర్పులు సైతం వచ్చినట్లు తెలుస్తోంది. న్యాయస్థానాల తీర్పులు సైతం గత ప్రభుత్వ హయాంలో అమలుకు నోచుకోలేదని వైద్య విద్యార్థులు వాపోతున్నారు. తెలంగాణలోని ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఏ మాత్రం వెనక్కి తగ్గకపోగా పెంచిన ఫీజులు కట్టాల్సిందేనని తెగేసి చెబుతున్నారు.న్యాయస్థానం తీర్పు వచ్చింది కదా అని ఎవరైనా ఎదురు మాట్లాడే ప్రయత్నం చేస్తే,మేము సుప్రీంకోర్టుకు వెళ్తున్నాం అక్కడ చూసుకుంటామని వైద్య విద్యార్థుల తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేస్తున్నారు.కొంతమంది తల్లిదండ్రులు బ్యాంకు గ్యారంటీలను సైతం ఇచ్చి ఉన్నారు కనుక భవిష్యత్తులో ఉన్నత న్యాయస్థానాలు ఏ తీర్పు ఇచ్చిన ,ఆ తీర్పుకు కట్టుబడి అదనపు ఫీజు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని తల్లిదండ్రులు చెబుతున్న మాటలను ప్రవేట్ మెడికల్ కళాశాలల యాజమాన్యాలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.

—-అక్రమంగా కళాశాలల వద్దే ఒరిజినల్ సర్టిఫికెట్స్ .

ఎస్సెస్సి  నుండి మొదలుకొని అన్ని స్టడీ సర్టిఫికెట్స్ తాము వైద్య విద్యను అభ్యసించిన  ప్రైవేటు మెడికల్ కళాశాలలోనే ఉండడంతో అన్ని అర్హతలు ఉండి అనర్హులుగా మారామని వారి ఆవేదనను, ఆందోళన వెలిబుచ్చున్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్స్ లేని కారణంగా మాకు అందివచ్చిన అవకాశాలు సైతం చేజారి పోతున్నాయంటున్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్స్ కోసం కళాశాలల వద్దకు వెళ్తే  కస్టోడియన్ సర్టిఫికెట్ ఇచ్చి గెంటి వేస్తున్నారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన సైతం పనిచేయడానికి కూడా ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఉంటేనే అవకాశాలు కల్పిస్తున్నారు.ఏ మాత్రం పనికిరాని కస్టోడియన్ సర్టిఫికెట్ ను విద్యార్థుల చేతిలో పెట్టి తమ పని అయిందని చేతులు దులుపుకుంటున్నారన్నారు.దీంతో అన్ని అర్హతలు ఉండి అనర్హులుగా తమ పిల్లలు మిగిలిపోతున్నారని తల్లిదండ్రులు పడుతున్న బాధ వర్ణనాతీతం అనే చెప్పవచ్చు.

— ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలి.

గత ప్రభుత్వం ప్రైవేట్ మెడికల్ కళాశాలలకు అనుకూలంగా, ఉన్న ఫీజుని అమాంతం రెట్టింపు చేసి  మమ్మల్ని  ఆర్థిక దోపిడీ చేసే ప్రయత్నం చేసిందన్నారు.గత ప్రభుత్వానికి పలుమార్లు మా సమస్యను విన్నవించినప్పటికీ పట్టించుకోలేదన్నారు. ఈ దఫా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని మా యొక్క పిల్లల ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇప్పించాలని వైద్య విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. గత ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులకే ప్రవేట్ మెడికల్ కళాశాలలు ఉన్నందున మా గోడును పట్టించుకునే నాధుడే కరువయ్యారన్నారు. అన్ని వైద్య విద్య అర్హతలు ఉండి,రోడ్డున పడ్డ మా పిల్లల భవిష్యత్తును కాపాడాలని తెలంగాణ ముఖ్యమంత్రిని సవినయంగా వేడుకుంటున్నారు.

___ఉద్యమ కార్యాచరణకు సమాలోచనలు

గత అనేక పర్యాయాలుగా విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు పెడచెవిన పెడుతుండడంతో బాధిత వైద్య విద్యార్థిని,విద్యార్థులు ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మధ్యలో ఖమ్మం కేంద్రంగా బాధిత వైద్య విద్యార్థిని,విద్యార్థులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను ఏ విధంగా చేయాలి అనే దానిపై సమాలోచనలు చేసుకున్నట్లు తెలుస్తోంది.ఒరిజినల్ సర్టిఫికెట్స్ , ప్రభుత్వం ద్వారా కళాశాలలు పొందిన ఫీజు రియంబర్స్మెంట్ అక్రమాలపై, తదితర సమస్యలపై ఆందోళనలు చేయడానికి టైం టేబుల్ తయారు చేసుకున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్