హైదరాబాద్ సిటీ: నగరంలోని మెట్రో రైళ్లలో ఆగిపోయిన ఆఫర్లను మరో ఆరు నెలల వరకు పొడిగించారు. ఉగాది పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్థం ఆఫర్లను కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
గతేడాది సెప్టెంబర్ 23న ప్రారంభించిన సూపర్ సేవర్ ఆఫర్ – 59 ఈ ఏడాది మార్చి 31న ముగిసింది. దీంతో ఏప్రిల్ 1 నుంచి ఎల్‌అండ్‌టీ అధికారులు ఈ ఆఫర్‌ను రద్దు చేశారు. అలాగే స్మార్ట్ కార్డు, కాంటాక్ట్ లెస్ కార్డ్స్ లపై ఉన్న 10 శాతం రాయితీని ఎత్తివేశారు. మెట్రో స్టూడెంట్ పాస్(Metro Student Pass)ను తొలగించడంతో ఆయా వర్గాలకు చెందిన ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వేసవికాలం సమయంలో రద్దీ పెరగడంతో డిస్కౌంట్లను ఎత్తివేసి అధిక ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారని ప్యాసింజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో, ఎల్‌అండ్‌టీ అధికారులు స్పందించి ఆయా ఆఫర్లను తిరిగి కొనసాగిస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. రూ.59తో నడిచే సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డు, మెట్రో స్టూడెంట్ పాస్, సూపర్ ఆఫ్ పీక్ అవర్ ఆఫర్లు నేటి నుంచి ఆరునెలలపాటు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ సందర్భంగా హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్‌అండ్‌టీ ఎండీ కేవీబీ రెడ్డి మాట్లాడుతూ ప్రయాణికులకు సౌకర్యవంతమైన రవాణాను అందించేందుకు హైదరాబాద్ మెట్రో రైలు కట్టుబడి ఉందన్నారు. ప్రయాణికులు ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.