రాహు కేతువులకు అర్ధరాత్రి పూజలు….
శ్రీకాళహస్తి ఆగస్టు 5
midnight worship to Rahu Ketu
మూడు చోట్ల దీపాలకు 1500 రూపాయలు… భక్తులను మోసగిస్తున్న వ్యాపారులు…
రాహు కేతు పూజల ద్వారా శ్రీకాళహస్తీశ్వరాలయం ఎంత ప్రసిద్ధి చెందిందో అంత అపవాదును కూడా మూట గట్టుకుంటూ ఉంది. అటు దేవస్థానం ఉద్యోగులు… ఇటు వ్యాపారులు భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు. దీంతో రాహు కేతు పూజలకు వచ్చిన భక్తులు తీవ్ర ఆవేదనతో తిరిగి వెళుతున్నారు. తాజాగా కొందరు వ్యాపారులు అర్ధ రాత్రి పూజలు ప్రారంభించారు. శివయ్య గోపురం సమీపంలోని షెడ్లలో నిద్రిస్తున్న భక్తులను అర్ధరాత్రి ఒంటిగంటకు లేపి నిద్ర ముఖంతో… స్నానం చేయకుండా దీపాలు వెలిగించే కార్యక్రమం చేపట్టారు. నకిలీ నేతి దీపం, కొబ్బరికాయ, కర్పూరం, ఆకులు అలుములు కలిపి మొత్తం 500 రూపాయలు తీసుకుంటున్నారు. మర్రి చెట్టు వద్ద… కాశీ విశ్వనాథ స్వామి గుడి వద్ద… వాయు మూల గణపతి వద్ద మూడు దీపాలు వెలిగించి ఒక్కో దీపానికి 500 రూపాయలు వసూలు చేస్తున్నారు. అర్ధరాత్రి 1:00 నుంచి తెల్లవారుజాము 5 వరకు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దేవస్థానం అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తెల్లవారిన తర్వాత ఆలయంలో రాహుకేతు పూజ చేయించు కోవడానికి వచ్చిన భక్తులు తెల్లవారక ముందే మోసపోతున్నారు. తెచ్చిన డబ్బు ఖర్చు అయిపోవడంతో స్వామి అమ్మవార్లను దర్శించుకుని తిరిగి వెళ్ళిపోతున్నారు. ప్రధాన ఆలయం ఉదయం ఐదు గంటల తర్వాత తెరుచుకుంటుంది. అనుబంధ ఆలయాలైన కాశీ విశ్వనాథ స్వామి, వీరభద్ర స్వామి ఆలయాలు మాత్రం అర్ధరాత్రి 1:00 కే తెరుచుకుంటున్నాయి. కొందరు వ్యాపారులు ముఠాగా ఏర్పడి ఈ దందాని కొనసాగిస్తున్నారు. మూడు దీపాలు వెలిగించి 1500 రూపాయల చెల్లించుకున్న తర్వాత తాము మోసపోయామని భక్తులు గ్రహిస్తున్నారు.దీనివల్ల ఆలయ హుండీ ఆదాయం తగ్గిపోవడమే కాకుండా ఆలయానికి మరింత చెడ్డ పేరు వస్తోంది. అర్ధరాత్రి పూజల గురించి దేవస్థానంలో కొందరికి తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోకుంటే ఆలయానికి మరింత అప్రదిష్ట వచ్చే ప్రమాదం ఉంది…