కమలంలో వలస నేతలకే పెద్ద పీట…
హైదరాబాద్, మార్చి 15,
భారతీయ జనతా పార్టీ బుధవారం రాత్రి విడుదల చేసిన రెండో జాబితాలో ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలకే టికెట్లు ఖరారు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు సంపాదించి మూడో సారి నరేంద్రమోదీని ప్రధాన మంత్రిని చేయాలనే లక్ష్యంతో కమలనాథులు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మూడు రోజుల క్రితం పార్టీలో చేరిన నలుగురు నేతలకు బీజేపీ టికెట్లు ఇచ్చారు. దీనిపై గత కొంత కాలంగా బీజేపీలో పనిచేస్తున్న సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. ఇది సహజమే.మొదటి జాబితాలోనూ ఫిరాయింపు దార్లకే పెద్ద పీట వేశారు. రెండో జాబితా అంతే. ఇక మూడో జాబితాలో రాబోయే రెండు సీట్లు ఫిరాయింపు నేతలకే ఇవ్వడం ఖాయం. తెలంగాణలో బలపడ్డామంటున్న బీజేపీకి బలమైన అభ్యర్థులు లేరా ? ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, మాజీ ఎంపీ గొడం నగేష్ ను బీఆర్ఎస్ పార్టీ నుంచి రప్పించి కాషాయం కండువా కప్పిన మూడు రోజుల్లోనే టికెట్టు ఇచ్చారు. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యేలున్న బీజేపీ గోండు వర్గానికి చెందిన గొడం నగేష్ ను బరిలోకి దించడం ద్వారా విజయం సాధించాలని అనుకుంది. ఆదిలాబాద్ బీజేపీ టికెట్టు ఆశించిన సిట్టింగ్ ఎంపీ సోయంబాపురావు, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ లు తీవ్ర అసంతృప్తి జ్వాలలతో రగులుతున్నారు. పార్టీలో ఉన్న తమను కాదని బీఆర్ఎస్ పార్టీ నేతకే టికెట్టిస్తారా అని వారు మండిపడుతున్నారు. పార్టీకి ఎవరూ లేని సమయంలో బీజేపీలో చేరి పోటీ చేసి.. ఎంపీగా గెలిచానని సోయం బాపూరావు అంటున్నారు. పార్టీలో తనకు అవమానం జరిగిందని.. పార్టీ మారిపోవడానికి సిద్ధమని ఆయన అంటున్నారు. మహబూబాబాద్ ఎస్టీ రిజర్వుడ్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ ను బీజేపీ బరిలోకి దించింది. ఇటీవల వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి సీతారాం నాయక్ ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఢిల్లీకి పిలిపించి ఆయనకు కేంద్ర నేతలతో కాషాయ కండువా కప్పి ఎన్నికల బరిలోకి దించారు. మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డిని నల్గొండ ఎంపీ బరిలో దించారు. బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన సైదిరెడ్డి కమలం పార్టీలో చేరిన మూడు రోజులకే టికెట్ దక్కించుకున్నారు. బీజేపీ మొదటి జాబితాలోనూ బీఆర్ఎస్ అభ్యర్థులు .. బీజేపీ అభ్యర్థులుగా ఎంపీ ఎన్నికల్లో బరిలోకి దించారు. మొదటి జాబితా ప్రకటించడానికి ముందు నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరిపోయారు. వారికి టిక్కెట్లు ఇచ్చేశారు. పోతుగంటి రాములు కుమారుడికి చాన్సిచ్చారు. ప్పటికే 9 మంది అభ్యర్థులను మొదటి జాబితాలో ప్రకటించింది. నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్, మల్కాజిగి నుంచి ఈటల రాజేందర్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, హైదరాబాద్ నుంచి మాధవి లత , జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్, నాగర్ కర్నూలు నుంచి భరత్, చెవేళ్ల నుంచి కొండ విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేస్తారు. ఇందులో బండి సంజయ్ , కిషన్ రెడ్డి మాత్రమే బీజేపీని అంటి పెట్టుకుని ఉన్నారు. మిగతా అంతా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే. రెండో జాబితాతో కలిసి మొత్తం తెలంగాణలో పదిహేను స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లు అయింది. ఇంకా రెండు స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. ఒకటి ఖమ్మం నియోజకవర్గం కాగా.. మరొకటి వరంగల్ నియోజకవర్గం. ఈ రెండింటిలోనూ ఫిరాయింపు దార్లకే చాన్సివ్వనున్నారు. ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారు. సొంత పార్టీ నేతలకు పెద్దగా బలం లేకపోవడంతో ఇతర పార్టీల నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. రెండు రోజుల కిందట జలగం వెంకట్రావు పార్టీలో చేరారు. అయితే ఆయనకు టిక్కెట్ ప్రకటించలేదు. మరో కీలక నేత కూడా బీజేపీ తరపున పోటీకి సిద్ధమయ్యారన్న ప్రచారం జరుగుతోంది. వరంగల్ నుంచి ఆరూరి రమేష్ పేరు ప్రచారంలో ఉంది. అంటే ఆ రెండు సీట్లు కూడా ఫిరాయిపు దారులకే ఇస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన డీకే అరుణ రాజకీయ మార్పులతో గతంలోనే కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ప్రస్థుతం మాజీ కాంగ్రెస్ నాయకురాలైన డీకే అరుణను ఎన్నికలబరిలోకి దించారు. దీంతో మరో సీనియర్ నాయకుడైన జితేందర్ రెడ్డి అసంతృప్తికి గురయ్యారు.మెదక్ పార్లమెంటు బరిలో మాజీ ఎమ్మెల్యే ఎం రఘునందన్ రావును దించారు. రఘనందన్ రావు గతంలో టీఆర్ఎస్ పార్టీలో పనిచేసి, ఆపై బీజేపీ తీర్థం స్వీకరించారు. గతంలో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా ఉప ఎన్నికల్లో గెలిచారు. పెద్దపల్లి పార్లమెంట్ బరిలో బీజేపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ ను రంగంలోకి దించారు. ఆయన బీఆర్ఎస్ లో మండల స్థాయి నేత. మొత్తం మీద బీజేపీ ఇతర పార్టీల్లో బలమైన అభ్యర్థులకు కాషాయ కండువా కప్పి వారికే బీజేపీ టికెట్లు ఇవ్వడంపై కమలం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. సొంత పార్టీ నేతలపై ఎందుకు నమ్మకం పెట్టుకోవడం లేదనేది.. రాజకీయ వర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తున్న ప్రశ్న. గతంలో బీజేపీ సిద్దాంత పార్టీ. పార్టీలో చేరికలకు ఆపరేషన్లు చేసే వారు కాదు. బీజేపీ సిద్ధాంతాలను పూర్తిగా ఆకళింపు చేసుకుని కింది స్థాయి నుంచి ఎదిగిన వారే నేతలుగా ఉంటారు. కిషన్ రెడ్డి.. లక్ష్మణ్.. ఇంద్రసేనారెడ్డి ఇలాంటి వారంతా.. ఆ తరహా నేతలు. కానీ ఇప్పుడు.. బీజేపీని చూస్తే.. మొత్తం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే ఉంటున్నారు. వారికే ప్రాధాన్యం లభిస్తోంది. దీని వల్ల కింది స్థాయి నుంచి పని చేసుకుంటూ వస్తున్న వారికి నిరాశ కలుగుతోంది. తము పని పనిచేయడం అవసరమా అన్న్ భావన కలుగుతోంది. పార్టీలో చేరే వారు ప్రజా నేతలా అంటే కానే కాదన్న వాదన ఉంది. కేవలం బీఆర్ఎస్ లో కొన్ని పదవులు అనుభవించడమే వారి ప్లస్ పాయింట్. అంత మాత్రానే సీట్లు ఇచ్చేస్తారా ?. ఇలా వచ్చిన వారు పార్టీని అంటి పెట్టుకుని ఉంటారా?
కమలంలో వలస నేతలకే పెద్ద పీట…
- Advertisement -
- Advertisement -