హైదరాబాద్, నవంబర్ 3, (వాయిస్ టుడే ): మొత్తం 9 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ శుక్రవారం వెల్లడించారు. గతంలో తరహాలోనే తమ కంచుకోట అయిన చాంద్రాయణగుట్ట, యాకుత్ పురా, చార్మినార్, బహుదూర్‌పురా, కార్వాన్, నాంపల్లి, మలక్ పేట స్థానాల్లో ఎంఐఎం పోటీ చేయనుంది. వీటితో పాటు కొత్తగా జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ స్థానాల్లో సైతం పోటీ చేస్తామని అసదుద్దీన్ కీలక ప్రకటన చేశారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ దారుసలాంలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈసారి ఎన్నికల్లో సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ, ముంతాజ్ అహ్మద్ ఖాన్ పోటీ చేయడం లేదని అసదుద్దీన్ ప్రకటించారు. కానీ వారు పార్టీ విజయం కోసం పనిచేస్తారని, పార్టీ కార్యక్రమాలలో పాల్గొటారని చెప్పారు. చాంద్రాయణగుట్ట, చార్మినార్, యాకుత్ పురా, మలక్‌పేట, కార్వాన్, నాంపల్లి నియోజకవర్గాలకు ఎంఐఎం అభ్యర్థులను ప్రకటించారు. కాగా, కొత్తగా పోటీ చేయనున్న జూబ్లీహిల్స్, రాజేంద్ర నగర్ నియోజకవర్గాలతో పాటు పాత స్థానం బహుదూర్‌పురా అభ్యర్థులను పెండింగ్ లో ఉంచింది ఎంఐఎం.
ఎంఐఎం అభ్యర్థుల జాబితా వివరాలు..
చాంద్రాయణగుట్ట నియోజకవర్గం – అక్బరుద్దీన్ ఒవైసీ
చార్మినార్ నియోజకవర్గం – మీర్ జుల్ఫీకర్ అలీ సాహబ్ (మాజీ మేయర్)
యాకుత్ పురా నియోజకవర్గం – జాఫర్ హుస్సేన్ మెహరాజ్ సాహబ్
మలక్‌పేట నియోజకవర్గం – అహ్మద్ బలాలా
కార్వాన్ నియోజకవర్గం – కౌసర్ మొహియుద్దీన్ సాహబ్
నాంపల్లి నియోజకవర్గం – మాజిద్ హుస్సేన్ సాహబ్
దేశంలోని ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల సమయంలో ఓ మేనిఫెస్టో విడుదల చేస్తుంది. ఉచిత హామీలు, ప్రాజెక్టులు, స్కీములు లాంటివి పార్టీలు ప్రకటిస్తాయి. కానీ దేశంలో అన్ని పార్టీల కంటే భిన్నం మజ్లిస్ పార్టీ. ఆ పార్టీ ఎలాంటి మేనిఫెస్టో ప్రకటించదు. మేనిఫెస్టోను ప్రతీ సారి ఎన్నికల సంఘానికి సబ్‌మిట్ చేయాలి. తమకు ఎలాంటి మేనిఫెస్టో లేదని లేఖను మజ్లిస్ సబ్‌మిట్ చేయడం విశేషం. ఈ సారి కూడా ఎలాంటి మేనిఫెస్టో విడుదల చేయడం లేదని పార్టీ చీఫ్ అసదుద్దీన్ ప్రకటించారు. అయితే కొన్ని హామీలు పాతబస్తీ వాసులకు ఇచ్చారు.
కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడమే మేనిఫెస్టో 365 రోజులు ప్రజల మధ్యలో ఉండటమే మా ఎజెండా మేనిఫెస్టో అని అసదుద్దీన్ చెబుతున్నారు. ఎంఐఎం పార్టీ కౌన్సిలర్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా పార్టీ ఆఫీసులో నేరుగా ప్రజలను కలవడమే తమ మేనిఫెస్టోలో ప్రధాన అంశమమని ఇటీవల ఆయన వెల్లడించారు . సాధారణంగా పాతబస్తీలో ఏ చిన్న కార్యక్రమం అయినా, చివరికి అంత్యక్రియలు లాంటివి జరిగినా ఎంఐఎం నేతలు అందుబాటులో ఉంటారని చెబుతున్నారు. పెళ్లిళ్లు జరిగితే చిన్న నేత నుంచి ఎంపీ స్థాయి వరకు అంతా వెళ్లికి హాజరవుతామంటున్నారు.
ప్రజలు పిలవడమే ఆలస్యం వెంటనే అక్కడికి చేరుకుంటామని.. పెళ్లి వేడుకలకు సైతం పిలిచినా, పిలవకపోయినా వెళ్లి వధూవరులను ఆశీర్వదిస్తుంటారని ఆసద్ మొదటి హామీగా ప్రకటించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా అదుకునేందుకు కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు వెంటనే అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని ఎంపీ వెల్లడించారు. ఇలా నిత్యం జనాల్లో ఉండే ప్రయత్నం దేశంలో ఏ పార్టీ చేయదని.. కానీ తాము చెప్పిందే చేస్తామని, చేసేదే చెబుతామని ఆ పార్టీ నేత అసద్ భరోసా ఇచ్చారు