ధర్వేశిపురం లో మంత్రి కోమటిరెడ్డి పర్యటన
Minister Komati Reddy's visit to Dharveshipuram
నల్గోండ
నల్గొండ జిల్లా, కనగల్ మండలం, ధర్వేశిపురం రేణుక ఎల్లమ్మ దేవాలయ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని రాష్ట్ర రోడ్లు ,భవనాలు ,సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.
సోమవారం ఆయన దర్వేశిపురం రేణుక ఎల్లమ్మ దేవాలయ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
పాలకవర్గం చైర్మన్, డైరెక్టర్లు వారికి లభించిన పదవిని పదవిగా కాకుండా బాధ్యతగా పనిచేయాలని, దేవునికి సేవ చేస్తూనే భక్తులకు సౌకర్యాలు కల్పించాలని, పాలకవర్గం దేవునికి భక్తులకు అనుసంధానంగా ఉండాలని, దేవాలయాన్ని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. దేవాలయానికి నల్గొండ నుండే కాకుండా, హైదరాబాద్ నుండి కూడా భక్తులు వచ్చే విధంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
రేణుక ఎల్లమ్మ దేవాలయం అభివృద్ధిలో భాగంగా 15 రోజుల్లో చుట్టుపక్కల అంతర్గత రహదారులు మంజూరు చేయడమే కాకుండా పూర్తి చేస్తామని తెలిపారు. దేవాలయ ఫంక్షన్ హాల్ కళ్యాణ మండపం ఎత్తు పెంచేలా కృషి చేస్తామని, దేవాలయ సౌకర్యాల కోసం 4 కోట్ల బడ్జెట్ అవుతుందని , ఇందుకు ప్రభుత్వం తో పాటు , పాలకవర్గ సభ్యులు సైతం ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందించాలని కోరారు.
కనగల్ మండలం లో రహదారుల అభివృద్ధికి గాను రోడ్లు, భవనాల శాఖ ద్వారా సుమారు
100 కోట్ల రూపాయలను ఇది వరకే మంజూరు చేసామని,దోరేపల్లి నుండి పగిడిమర్రి, గుర్రంపల్లి వరకు 50 కోట్లు, పగిడిమర్రి నుండి సోమన్నవాగు ,సాగర్ రోడ్డు వరకు 40 కోట్లు మంజూరు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.
ఈనెల 26 నుండి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అందరికీ అందజేస్తామని మంత్రి తెలిపారు.
అనంతరం మంత్రి మీడియా ప్రతినిధుల తో మాట్లాడుతూ… అర్వపల్లి -దానం చెర్ల రహదారిపై అర్వపల్లి వద్ద ఫ్లైఓవర్ కోసం భూములు పోతున్నాయని అపోహలను సృష్టిస్తున్నారని ,ఇది ఎంత మాత్రం నిజం కాదని తెలిపారు. కనగల్ జంక్షన్ అభివృద్ధి చేసినట్లుగానే అర్వ పల్లి జంక్షన్ వద్ద ప్రమాదాల నివారణకు జంక్షన్ అభివృద్ధి పనులు మాత్రమే చేపట్టేందుకు సర్వే నిర్వహిస్తున్నామని, అక్కడ ఎలాంటి ఫ్లై ఓవర్ నిర్మాణం జరగడంలేదని, ఇందుకోసం ప్రజలకు సంబంధించి ఒక్క ఇంచు భూమిని కూడా తీసుకోవటం లేదని మంత్రి స్పష్టం చేశారు. జంక్షన్ అభివృద్ధి, సుందరీకరణకు మాత్రమే చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రివివరించారు.
నల్గొండ జిల్లా అభివృద్ధిలో భాగంగా త్వరలోనే 900 కోట్ల రూపాయలతో ఏఎంఆర్పి ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీ కాలువల లైనింగ్ పనులు చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఎస్ ఎల్ బి సి ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నామని, బస్వాపూర్ పథకాన్ని నెలలోనే పూర్తి చేస్తున్నామని చెప్పారు.మహాత్మా గాంధీ యూనివర్సిటీలో నాలుగు భవనాల నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందని, అలాగే 80 కోట్లతో చేపట్టిన పనులు నడుస్తున్నాయని చెప్పారు.
గత ప్రభుత్వం 10 ఏళ్ల నుండి నుండి ఏ ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వలేదని ,ఇప్పుడు తమ ప్రభుత్వం కొత్తగా 40 లక్షల రేషన్ కార్డులు ఇవ్వనున్నదని, ఈ నెల 27 నుండి రేషన్ కార్డులతో పాటు ,ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వనున్నామని, పాత రేషన్ కార్డులు అలాగే కొనసాగుతాయని, కొత్త కార్డులు 40 లక్షలు ఇవ్వనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
కాగా దర్వేసి పురం రేణుక ఎల్లమ్మ నూతన పాలకమండలి చైర్మన్ గా వెంకట్ రెడ్డి, డైరెక్టర్లు ప్రమాణం చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్డిఓ వై అశోక్ రెడ్డి , ఆర్ అండ్ బి అధికారులు, తహసిల్దార్, ఇతర అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.