ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితం
రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదు
బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మర్రిపల్లి సత్యమ్
జగిత్యాల
:జగిత్యాలలో సోమవారం జరిగిన బిజెపి విజయసంకల్ప సభలో ప్రధానమంత్రి నరేంద్ర ప్రసంగంలో స్పష్టత లోపించిందని దేశ భవిష్యత్తు,ప్రణాళికను వివరించాల్సి ఉండగా నిస్తేజంగా ఉందని నిర్మాణాత్మకంగా లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్ విమర్శించారు. మంగళవారం జిల్లా లోని పెగడపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడుతూ
వ్యవసాయ రంగం గురించి మాట్లాడిన జీవన్ రెడ్డి 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన మద్దతు ధర వరికి 1,200 అయితే 2014లో బిజెపి అధికారం చేపట్టాక 2,024 వరకు పది సంవత్సరాలలో మద్దతు ధరను రెండింతలు చేసిందని లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ ఇచ్చి రైతులను ప్రోత్సహిస్తుందని అన్నారు. ప్రతి రైతుకు సంవత్సరానికి ఒక ఎకరానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కిసాన్ సమ్మాన్ నిధిని కలుపుకొని ఇరవై నాలుగు వేల రూపాయల వరకు పెట్టుబడి సహాయం అందిస్తుందన్నారు.
కాంగ్రెస్ హయాంలో మూతపడిన రామగుండం ఎరువుల కర్మగారాన్ని రూపాయలు 6,500 కోట్లు వెచ్చించి నరేంద్ర మోడీ పునరుద్ధరించి తెలంగాణ ప్రాంత రైతులకు ఎరువుల కొరత తీర్చారని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు అనేక రకమైనటువంటి ఎరువుల కొరత ఏర్పడిందని ఎరువుల దుకాణాల ముందు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ముందు చెప్పులను క్యూ లైన్ లో పెట్టి వేచి చూసిన విషయాన్ని జీవన్ రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఎంఎస్పీ పోరాడితే అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో ఇలాంటి నిరసన కార్యక్రమాలు ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. అధికారంలోకి రావడానికి అడ్డగోలుగా హామీలు ఇచ్చి డిసెంబర్ 9 తారీకు 2023 రోజున ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ ప్రతి రైతుకు సంవత్సరానికి ఎకరాకు 15 వేల రూపాయల రైతుబంధు అంటూ మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చినాక 100 రోజులు అంటూ దాటవేసి రైతులను మోసం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. దేశ భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ ప్రణాళిక నిర్మాణాత్మకంగా లేదని మాట్లాడిన జీవన్ రెడ్డి దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తాం అన్న కమ్యూనిస్టు నాయకుడు కన్నయ్య కుమార్ లాంటి వారిని కాంగ్రెస్ లో చేర్చుకొని భారత్ జూడో న్యాయ యాత్ర పేరిట చేస్తున్న యాత్ర భారతదేశ భవిష్యత్ నిర్మాణాత్మకానికి సంకేతమా సమాధానం చెప్పాలని అన్నారు.గతంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి బిఆరెస్ లోకి పోతే ఇప్పుడు బిఆరెస్ నుండి గెలిచి కాంగ్రెస్ లోకి పోతున్నపుడు బీజేపీ బిఆరెస్ రెండు ఒకటి ఎలా అవుతాయని అన్నారు.నిజంగా కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే రైతుల మీద ప్రేమ ఉంటే యాసంగి సీజన్లో ఎలాంటి తరుగు లేకుండా వరిధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షులు గంగుల కొమురెల్లి మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతకింది అనసూయ, మండల నాయకులు పెంట నరేందర్,కిషోర్, మన్నే రమేష్, తడగొండ అంజయ్య తదితరులు పాల్గొన్నారు..