తెలంగాణలోని పలుచోట్ల ఈ నెల 8 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు
హెచ్చరించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం
హైదేవ్రాబాద్ ఆగష్టు 4
Moderate to heavy rains in many places in Telangana till 8th of this month
తెలంగాణలోని పలుచోట్ల ఈ నెల 8 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు తీరం వెంట సముద్రమట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని.. తూర్పు-పశ్చిమ ద్రోణి తూర్పు మధ్‌య అరేబియా సముద్రం దక్షిణ భాగాల నుంచి దక్షిణ ఇంటీరియర్ కర్నాటక, తమిళనాడు మీదుగా మధ్య బంగాళాఖాతం తీర ప్రాంతంలోని ఉపరితల ఆవర్తనం వరకు కొనసాగుతుందని.. సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని.. ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణం వైపు వంగి ఉందని పేర్కొంది.సోమవారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని చెప్పింది. బుధవారం నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. గురువారం మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో.. శుక్రవారం నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.



