15 తర్వాత అమరావతికి మోడీ…
అమరావతి,ఏప్రిల్ 7, (వాయిస్ టుడే )
Modi to visit Amaravati after 15...
గత టీడీపీ ప్రభుత్వంలో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వచ్చిన ప్రధాని మోదీ.. పిడికెడు మట్టి, చెంబుడు నదీ జలాలను తీసుకొచ్చారు. నిధులిస్తారనుకుంటే, నీళ్లు, మట్టి మాత్రమే ఇచ్చారంటూ అప్పట్లో ఓ రేంజ్ లో సెటైర్లు పేలాయి. ఆ తర్వాత టీడీపీ, బీజేపీకి మధ్య వైరం మొదలు కావడంతో ఆ ప్రహసనాన్ని టీడీపీ నేతలే తీవ్రంగా తప్పుబట్టారు. మళ్లీ ఇప్పుడు అదే సీన్ రిపీట్ కాబోతోంది. ఈనెల 3వ వారంలో అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్రమోదీ రాబోతున్నారు. కనీసం ఈసారయినా ఆయన నిధులు తెస్తారా.. అమరావతికి, ఏపీకి ఏదైనా శుభవార్త చెబుతారా అనేది వేచి చూడాలి.ఈనెల మూడో వారం లేదా, నాలుగో వారంలో ప్రధాని మోదీ అమరావతికి వస్తారని తెలుస్తోంది. అధికారికంగా ఈ పర్యటన ఇంకా ఖరారు కాలేదు. అయితే ప్రధాని మోదీ రాక కోసం ప్రభుత్వం ఆల్రడీ ఏర్పాట్లు చేస్తోంది. రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవాన్ని ఆయన చేతుల మీదుగా మొదలు పెట్టడానికి ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ కార్యక్రమానికి లక్షమంది హాజరయ్యేలా, భారీ ఎత్తున ప్రణాళికలు రచిస్తున్నారు. వెలగపూడి సమీపంలో రాష్ట్ర సచివాలయం వెనక ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. 250 ఎకరాల్లో సభ ఏర్పాట్లు చేస్తున్నారు. సభాప్రాంగణానికి చేరుకోడానికి 8 మార్గాలను గుర్తించారు, ఆయా మార్గాలకు ఇన్ చార్జ్ లను నియమించి అన్నీ పక్కాగా జరిగేలా చూస్తున్నారు.ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మూడు రాజధానుల కాన్సెప్ట్ పూర్తిగా పక్కనపడిపోయినట్టయింది. ఏపీకి ఏకైక రాజధాని అమరావతి అని తేలిపోయింది. వైసీపీ కూడా మూడు రాజధానుల నిర్ణయాన్ని అటకెక్కించేసిందని అర్థమవుతోంది. ఆ మధ్య శాసన మండలిలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా మూడు రాజధానుల విషయంలో తాము ఆలోచించుకోవాల్సి ఉందన్నారు. అమరావతిని కాదంటే ఫలితం ఎలా ఉంటుందో జగన్ కి తెలిసొచ్చిందని టీడీపీ నేతలు అంటున్నారు. ఒకరకంగా జగన్ కూడా తన మూడు రాజధానుల నిర్ణయాన్ని పక్కనపెట్టేసినట్టేనని తేలిపోయింది. ఈ దశలో అమరావతి నిర్మాణాన్ని తిరిగి భుజానికెత్తుకున్నారు సీఎం చంద్రబాబు. ప్రపంచంలోనే గొప్ప రాజధానిగా అమరావతికి గుర్తింపు తెస్తామంటున్నారు.2014లో తొలిసారి ప్రధాన మంత్రి అయిన తర్వాత ఏపీ రాజధాని అమరావతికి మోదీ శంకుస్థాపన చేశారు. ఉద్దండరాయునిపాలెంలో రాజధాని నగర నిర్మాణానికి 2015 అక్టోబరు 22న విజయదశమి నాడు ఈ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. కొంతమేర పనులు జరిగినా అనుకున్న టైమ్ కి అవి పూర్తి కాలేదు. 2019లో ప్రభుత్వం మారడంతో అమరావతి నిర్మాణ పనులు ఆగిపోయాయి. జగన్ మూడు రాజధానుల వ్యూహం తెరపైకి తెచ్చారు. దీంతో అమరావతిని పక్కనపెట్టారు. ఇప్పుడు తిరిగి కూటమి అధికారంలోకి రావడంతో అమరావతి పనుల్లో పురోగతి కనపడుతోంది. అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవానికి తిరిగి ప్రధాని మోదీనే ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. మోదీతో కొత్త నిర్మాణాలకు శంకుస్థాపనలు చేయిస్తారు.అమరావతి నిర్మాణానికి ఈసారి 15వేల కోట్ల రూపాయలు నిధులిస్తామని కేంద్రం చెప్పింది. ఇందులో కొంత అప్పు, మరికొంత గ్రాంట్ రూపంలో రానుంది. అయితే ఆ అప్పు కూడా తిరిగి చెల్లించే అవసరం లేకుండా కేంద్రం రుణమాఫీ చేస్తుందని రాష్ట్రం ఆశిస్తోంది. ఈ దశలో అమరావతికి వస్తున్న ప్రధాని మోదీ.. మరిన్ని నిధులకు హామీ ఇస్తారేమో చూడాలి. కేంద్రంలో బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ లేని ఈ సమయంలో కూటమిలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉన్న ఈ టైమ్ లో ఏపీకి కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా వరాలు ప్రకటిస్తుందనే అంచనాలున్నాయి.