దేశ భవిష్యత్తుపై కీలక ప్రశ్నలు
— కేంద్ర ప్రభుత్వంపై ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్ర విమర్శలు
MP Gaddam Vamsi Krishna strongly criticizes the central government
ఇరోజు దేశం ముందుకు ఒక అత్యంత కీలకమైన ప్రశ్న సూటిగా నిలుస్తోందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. నరేంద్ర మోదీ భారతదేశాన్ని ఢిల్లీ నుంచి నడిపిస్తున్నారా? లేక వాషింగ్టన్ డీసీ నుంచి ట్రంప్ నడిపిస్తున్నారా? అనే సందేహం ప్రజల మనసుల్లో స్పష్టంగా కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
ఇది సాధారణ రాజకీయ అంశం కాదని, దేశ భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత కీలకమైన విషయం అని స్పష్టం చేశారు. బీజేపీ నేతలు భయంతో, విదేశీ ఒత్తిళ్లకు లోంగిపోయినట్టు పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు.
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అడుగుతున్న ప్రశ్నలు దేశం ముందు ఉన్న నిజాలను బయటపెడుతున్నాయని అన్నారు. ఇప్పటివరకు కొనసాగిన ద్వంద్వ వైఖరిని తొలగించి, కేంద్ర ప్రభుత్వ వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకువచ్చారని పేర్కొన్నారు. మోదీ ఎక్స్‌పోజ్ అయ్యారని, నిజం ఇప్పుడు దేశ ప్రజల ముందుకు వచ్చేసిందని తెలిపారు.
ఈ నిర్ణయాల భారం నేరుగా భారతదేశ ప్రజలపై పడుతోందని ఎంపీ గడ్డం వంశీకృష్ణ హెచ్చరించారు.
ప్రస్తుతం భారత్ దిగుమతి చేసుకుంటున్న రష్యన్ ఆయిల్ సుమారు 40 శాతం వరకు ఉండగా, ట్రంప్ ఒత్తిడి వల్ల ఆ దిగుమతులను 20 శాతానికి తగ్గించాలని చెప్పడం వల్ల దాదాపు ఒక లక్ష కోట్ల రూపాయల వరకు నష్టం సంభవించే ప్రమాదం ఉందని వివరించారు.
అలాగే, కేంద్ర ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసిన “మేక్ ఇన్ ఇండియా” విధానాన్ని పక్కన పెట్టి, అమెరికా ఉత్పత్తులపై ఉన్న టారిఫ్‌లను పూర్తిగా తొలగించడం ద్వారా దేశీయ పరిశ్రమలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. దీని వల్ల మొత్తం మీద రెండు లక్షల నుంచి మూడు లక్షల కోట్ల రూపాయల వరకు భారత ఆర్థిక వ్యవస్థకు నష్టం కలగనున్నట్లు అంచనా వేశారు.
ఈ కీలక అంశాలపై బీజేపీ నేతలు సమాధానం చెప్పే ధైర్యం లేకుండా, వాస్తవాల నుంచి తప్పించుకుంటున్నారని విమర్శించారు. లోక్‌సభలో రాహుల్ గాంధీ గారు ఈ ప్రశ్నలను సూటిగా అడుగుతుంటే, అధికార పక్షం స్పందించలేక ఇబ్బంది పడుతోందని తెలిపారు.
చివరగా, దేశ ప్రయోజనాలను కాపాడేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే పోరాటం కొనసాగుతుందని వంశీకృష్ణ స్పష్టం చేశారు.


