14న వైసీపీలోకి ముద్రగడ…
కాకినాడ, మార్చి 11
ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడంపై స్పష్టత రాకున్నా ఆయన ఈ నెల 14న వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. ముద్రగడతో పాటు ఆయన కుమారుడు గిరిబాబు సహా పలువురు కాపు సంఘం నేతలు కూడా వైసీపీలో చేరనున్నారు. కిర్లంపూడి నుంచి భారీ సంఖ్యలో అనుచరులతో తాడేపల్లికి వెళ్లి సీఎం జగన్ సమక్షంలో వీరు వైసీపీ కండువా కప్పుకోనున్నారు. కాగా, ఇటీవల కిర్లంపూడిలోని ముద్రగడను కలిసిన రీజనల్ కోఆర్టినేటర్ మిథున్ రెడ్డి ముద్రగడతో సమావేశమై ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ క్రమంలో ఆయన వైసీపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. తాను ఎలాంటి పదవులు ఆశించడం లేదని.. సీఎం జగన్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ముద్రగడ తెలిపారు. కాపు ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన ముద్రగడ పద్మనాభం ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1978లో జనతా పార్టీ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. 1983, 1985లో టీడీపీ తరఫున బరిలో నిలిచి విజయం సాధించారు. 1989లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. 1994లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ముద్రగడ కుటుంబం ఆరుసార్లు గెలిచింది. ఎన్టీఆర్, చెన్నారెడ్డి మంత్రివర్గాల్లో పని చేశారు. 1999లో టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2009లో కాంగ్రెస్ తరఫున పిఠాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమించారు. అనంతరం, రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముద్రగడ ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరుతారనే ప్రచారం సాగింది. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీన భారీ విందు సమావేశం ఏర్పాటు చేసిన ఆయన.. వైసీపీలో చేరుతాననే ప్రకటన చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఆయన ప్రకటించలేదు. తర్వాత వైసీపీలో చేరేది లేదని.. జనసేనలో చేరుతానని ప్రకటించారు. అనంతరం జనసేన నేతలు ఆయనతో భేటీ అయ్యారు. స్వయంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముద్రగడ ఇంటికి వచ్చి పార్టీలోకి ఆహ్వానిస్తారనే ప్రచారం సాగింది. అయితే, పవన్ ఇటీవల రాజమండ్రిలో పర్యటించినా ముద్రగడ నివాసానికి వెళ్లలేదు. దీంతో ఆయన అసంతృప్తి వ్యక్తి చేశారు. ‘మనం చెప్పాల్సింది చెప్పాం. తర్వాత మనం చేసేది ఏమీ లేదు. వస్తే ఓ నమస్కారం. రాకపోతే రెండు నమస్కారాలు.’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తుందన్న ప్రకటన వెలువడగానే.. ఈ అంశంపై ముద్రగడ పవన్ కల్యాణ్ కు లేఖ రాశారు. జనసేన తక్కువ సీట్లు తీసుకుందన్నారు. అనంతరం సభలో పవన్ వ్యాఖ్యలతో ఆయన జనసేనకు పూర్తిగా దూరమయ్యారు. సీఎం జగన్ ఆదేశాలతో వైసీపీ నేతలు ముద్రగడతో భేటీ కాగా.. చర్చల అనంతరం వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయనకు.. కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అటు, ముద్రగడ కుమారుడు గిరిబాబుకు నామినేటెడ్ పదవి ఇవ్వనున్నట్లు సమాచారం. ముద్రగడ పార్టీలో చేరిన తర్వాతే ఈ అంశాలన్నింటిపైనా స్పష్టత వచ్చే అవకాశం ఉంది
14న వైసీపీలోకి ముద్రగడ…
- Advertisement -
- Advertisement -