- Advertisement -
మున్నేరు, బుడమేరు ఉగ్రరూపం
Munneru and Budameru are aggressive
విజయవాడ, హైదరాబాద్, సెప్టెంబర్ 2
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జనజీవనానికి ఆటంకంగా మారాయి. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో వానలతో ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు. ఏర్లు, నదులకు భారీగా వరద నీరు చేరడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.బుడమేరు వరద ఉధృతితో విజయవాడ జలదిగ్బంధంలో చిక్కుకుంది. భారీ వర్షాలు, వరదలకు విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు కాగా, కొన్నింటిని దారి మళ్లించారు.కొండపల్లి, రాయనపాడులో రైలుపట్టాలపై వరదతో, ట్రాక్‌పైనే రైళ్లు నిలిచి పోయాయి. బస్సుల్లో ప్రయాణికులను అధికారులు తరలించారు.భారీ వర్షాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.బాధితులను పరామర్శించేందుకు విజయవాడ సింగ్ నగర్‌లో ఆయన పర్యటించారు. బుడమేరు ఉప్పొంగి ప్రవహించడంతో సింగ్ నగర్ జలదిగ్బంధంలో చిక్కుకుంది.విజయవాడలో ఇంత పెద్ద విపత్తును తాను ఎన్నడూ చూడలేదని చంద్రబాబు అన్నారు.వరద పరిస్థితిపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
తెలంగాణలో వర్ష బీభత్సం: ఉప్పొంగిన మున్నేరు, రైళ్లు రద్దు
తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జనజీవనం స్తంభించింది. రోడ్లు కొట్టుకుపోయి ఏపి, తెలంగాణ మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల రైల్వే ట్రాక్ లకు నష్టం కలగడంతో అధికారులు రైళ్లను దారిమళ్లించారు.భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా 9మంది చనిపోయినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు.ఖమ్మం జిల్లాలో మున్నేరు వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో వరదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు హెలికాప్టర్లను రంగంలోకి దించుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి హెలికాప్టర్‌ను రప్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్త పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు.పునరావాస, రక్షణ చర్యలపై సీనియర్ మంత్రులతో ఫోన్‌లో మాట్లాడి సూచనలు చేశారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతి రాజ్, వైద్య ఆరోగ్య శాఖ వంటి అత్యవసర శాఖల ఉద్యోగుల సెలవులను రద్దు చేసి రంగంలోకి దించాలని, జిల్లాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించి చర్యలు తీసుకోవాలని టెలికాన్ఫరెన్స్ లో కలెక్టర్లను ఆదేశించారు సీఎం.ఎంపీ, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లోనే ఉండి పరిస్థితులను సమీక్షించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
జలదిగ్బంధంలో ఖమ్మం, మహబూబాబాద్
భారీ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలపై పడింది.ఖమ్మం పట్టణంలో మున్నేరు ఉధృతికి పలు కాలనీలు జలమయం అయ్యాయి. ప్రకాశ్ నగర్ వద్ద మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది.మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో వరద ప్రవాహానికి రైల్వే పట్టాలకింద కంకర కొట్టుకుపోయింది. ట్రాక్ దెబ్బతినడంతో ఆ రూట్ లో రైళ్ల ను నిలిపివేశారు.మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో నిలిపివేసిన మచిలీపట్నం ఎక్స్ ప్రెస్ ప్రయాణీకులకు స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు ఆహారపదార్ధాలు, నీరు అందించారు. ప్రస్తుతం ట్రాక్ పునరుద్ధరణ పనులు సాగుతున్నాయి.ఏపీ, తెలంగాణలో ఏర్పడ్డ పరిస్థితులపై దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ సికింద్రాబాద్ రైల్ నిలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో పాటు, పట్టాల మరమ్మతు, రైల్ సర్వీసుల పునరుద్ధరణపై చర్చించారు.అధికారులు విజయవాడ-కాజీపేట మార్గంలో పలు రైళ్లను పూర్తిగా రద్దుచేయడం లేదా దారి మళ్లించడం చేశారు.ఖమ్మం పట్టణాన్ని ఊహించని వరద చుట్టుముట్టింది. మున్నేరు నది ఉధృతంగా పారుతోంది. ప్రస్తుతం 27.5 అడుగుల ఎత్తులో మున్నేరు ప్రవహిస్తోంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.పట్టణంలోని సగం కాలనీలు నీట మునిగాయి. ప్రకాశ్ నగర్ ప్రాంతం జలదిగ్బంధంలో ఉంది. ప్రకాశ్ నగర్ బ్రిడ్జిపై తొమ్మిది మంది ఉదయం నుండి చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు హెలికాప్టర్ ను రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే చీకటి పడటంలో బ్రిడ్జిపైన చిక్కుకున్న వారి భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతోంది“మున్నేరుకు ప్రొటెక్షన్ వాల్ నిర్మాణ పనులు నత్తనడక కొనసాగుతున్నాయి. నాలాల కబ్జా, మున్నేరు వరద ఒత్తిడితో నీరు బయటికి పోవడం లేదు.’’ అని ఆయన అన్నారు.
- Advertisement -