- రూ.5వేల కోట్లతో మున్నూరుకాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
- చలో కలెక్టరేట్ ముట్టడికి తరలివెళ్లిన మున్నూరుకాపులు

munnurukapu-self-respect-mahadharna
మున్నూరుకాపుల సంక్షేమం, అభివృద్ధి కోసం రూ.5 వేల కోట్లతో మున్నూరుకాపు కార్పొరేటషన్ ఏర్పాటు చేయాలని మున్నూరుకాపు ఆత్మగౌరవ మహాధర్నా సేన అధ్యక్షుడు ఉగ్గే శ్రీనివాస్ పటేల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్నూరు కాపుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్నూరుకాపు ఆత్మగౌరవ మహాధర్నా సేన ఆధ్వర్యంలో బుధవారం చలో హైదరాబాద్ కలెక్టరేట్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్నూరుకాపు విద్యార్థి వసతి గృహాన్ని ఎండోమెంట్ పరిధి నుంచి తొలగించి మున్నూరుకాపులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. మున్నూరుకాపుల కులవృత్తి వ్యవసాయం చేస్తున్న వారికి కులవృత్తుల సహాయం కింద కుటుంబానికి రూ.5 లక్షలు ఇవ్వాలని, మున్నూరుకాపు బంధు పథకం ప్రవేశపెట్టి ప్రతి ఇంటికి రూ.10లక్షలు ఇవ్వాలని అన్నారు. జనాభాలో అత్యధిక శాతం ఉన్న మున్నూరుకాపులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, చట్టసభల్లో, ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో 30 శాతం పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మున్నూరుకాపు పేరు చివర పటేల్ అని ప్రభుత్వం గెజిట్ చేయాలని, పంట భీమా పథకం అందించాలని, ఏరువాక పౌర్ణమి మున్నూరుకాపు రైతు పండుగగా అధికారికంగా ప్రభుత్వం జరపాలని అన్నారు. మున్నూరుకాపులను విస్మరిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మున్నూరుకాపులు తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. మున్నూరుకాపుల ఆగ్రహానికి ముఖ్యమంత్రి గురికావద్దని అన్నారు. మున్నూరుకాపుల సమస్యలు పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి ఆలోచన చేయాలని కోరారు. ర్యాలీగా పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన మున్నూరుకాపులు కలేక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కార్యక్రమంలో మున్నూరుకాపు సంఘం నేతలు కటికం మహేష్, బత్తుల రాములు, ఆకుల సుధ, వసుందర రామిని సందీప్, మన్నె వెంకటేష్, నల్లచెర్ల శ్రీనివాస్, ఆజువారి బాలరాజు, బాయికాడి సాయిలు, కల్లూరి నరహరి, గర్వల్లి గణేష్, గడ్డం అనిల్, పత్తి అనిల్,బిళ్ళ కంటి శ్రీనివాస్ ,కాటర్ల ధన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.


