తీసుకున్న డబ్బులు ఇవ్వమని అడిగినందుకు అఘాయిత్యం…
ఉత్తరప్రదేశ్ వాసులుగా పోలీసుల గుర్తింపు..
వరంగల్ క్రైం బ్యూరో, ఆగస్టు 30 (వాయిస్ టుడే ప్రతినిధి): వరంగల్ జిల్లా కేంద్రంలోని శివనగర్ కు చెందిన రౌడీషీటర్ నజీర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఉత్తరప్రదేశ్ చెందిన నలుగురు ఇనుప రాడ్లతో తలపై కొట్టడంతో రక్తస్రావమై అక్కడిక్కడే మృతి చెందాడు. వరంగల్ రైల్వే స్టేషన్ సెకండ్ ప్లాట్ ఫారం వైపు ఉన్న బార్ షాప్ వద్ద మంగళవారం అర్ధరాత్రి నజీర్ ను కొట్టి చంపారు. నజీర్ చనిపోయాడని నిర్ధారించుకొన్న ఉత్తరప్రదేశ్ కు చెందిన నలుగురు పారి పోయారు. అర్ధరాత్రి పన్నెండున్నర ప్రాంతంలో మద్యం మత్తులో ప్రారంభమైన గొడవ పెరిగి పెద్దదిగా మారినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బతుకు దేరువు కోసం ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన వారు శివనగర్ కు చెందిన లోకల్ వ్యక్తిని మర్డర్ చేయడం చర్చనీయాంశంగా మారింది. బతుకు దేరువు కోసం వచ్చిన ఉత్తరప్రదేశ్ చెందిన వారికి రైళ్ళల్లో కీచైన్స్ లాంటి చిరు వ్యాపార నిమిత్తం నజీర్ డబ్బులను అప్పుగా ఇస్తూ వసూళ్లు చేసుకొంటాడు. కొంతకాలం నుండి డబ్బులివ్వకుండా తప్పించుకు తిరుగుతున్న వారిని మంగళవారం రాత్రి పట్టుకొని నిలదీయడంతో మాట మాట పెరిగి హత్యకు దారి తీసిన్నట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మిల్స్ కాలనీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.