నల్గోండ, నవంబర్ 25, (వాయిస్ టుడే): నల్లగొండ… నిజాంపై తిరగబడ్డ పోరుగడ్డ.. సాయుధ పోరాటానికి ఊపిరులూదిన జిల్లా. ఇక్కడ రాజకీయ చైతన్యం ఎక్కువ. ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోట. తర్వాత కాంగ్రెస్, టీడీపీలకు అండగా నిలిచింది. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత.. ఉద్యమ పార్టీ బీఆర్‌ఎస్(టీఆర్‌ఎస్)కు అండగా ఉంటోంది. స్వరాష్ట్రం సాధించుకుని పదేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఈ పోరుగడ్డ.. ఎవరికి అండగా నిలుస్తుందో అన్న ఆసక్తి నెలకొంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో శాసనసభ ఎన్నికల సమరం ఉత్కంఠగా సాగుతోంది. విద్యుత్ శాఖ మంత్రి జగదీశెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేతలైన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీపీఎం సీనియర్ నేత జూలకంటి రంగారెడ్డి తదితరులు బరిలో నిలవడంతో ఈ జిల్లా రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ బీఆర్‌ఎస్, కాం్రVð స్ మధ్య హోరాహోరీ పోరు సాగుతుండగా… భాజపా, బీఎస్పీ, సీపీఎం సైతం పలుచోట్ల పోటీనిస్తున్నాయి. గత ఎన్నికల్లో మొత్తం 12 నియోజకవర్గాల్లో తొమ్మిదింటిని గెలిచిన బీఆర్‌ఎస్ గెలిచింది. ఈసారి అదే జోరు కొనసాగించాలని శ్రమిస్తోంది. ప్రజలు తమకే పట్టంగడతారని కాంగ్రెస్ బలంగా నమ్ముతోంది.
సూర్యాపేట..
ఇక్కడ మంత్రి జగదీశ్‌రెడ్డి మరోసారి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి(కాంగ్రెస్)తో తలపడుతున్నారు. 2014, 2018 ఎన్నికల్లో ఆయన మీదే గెలిచిన మంత్రి హ్యాట్రిక్‌పై కన్నేశారు. సూర్యాపేటలో వైద్య కళాశాల ఏర్పాటు, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, మినీట్యాంక్బండ్, మార్కెట్ యార్డుల నిర్మాణాలు, పట్టణ అభివృద్ధి, సుందరీకరణ వంటివి సానుకూల అంశాలుగా భావిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్‌రెడ్డి… తనకివే చివరి ఎన్నికలని చెబుతున్నారు. సానుభూతికితోడు ప్రభుత్వ వ్యతిరేకత లాభిస్తుందని భావిస్తున్నారు. కాంగ్రెస్ సంస్థాగతంగా బలంగా ఉన్నా… పార్టీలో అసమ్మతి కొంత ప్రతికూలం కావచ్చు. మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర్‌రావు బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. 2014లో రెండోస్థానంలో నిలిచిన ఆయనకు ఓటు బ్యాంకు గణనీయంగానే ఉంది. బీఎస్పీ అభ్యర్థి వి.జానయ్య యాదవ్ బీసీ నినాదంతో ముందుకెళుతున్నారు.
హుజూర్‌నగర్..
హుజూర్‌నగర్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇక్కడ పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 2009, 2014, 2018 ఎన్నికల్లో గెలుపొందారు. 2019లో నల్గొండ ఎంపీగా గెలిచి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఉప ఎన్నికలో ఉత్తమ్ సతీమణి పద్మావతిని పోటీ చేయించగా ఆమె ఓడిపోయారు. ప్రస్తుతం తానే గెలిచేందుకు యత్నిస్తున్నారు. 2018లో ఓడిన బీఆర్‌ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి… ఉప ఎన్నికలో గెలిచారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులపై, విస్తృతంగా ఉన్న తమ బంధువర్గంపై ఆశలున్నాయి. కొన్నివర్గాల వ్యతిరేకత సమస్యగా మారుతుందంటున్నారు. చల్లా శ్రీలతారెడ్డి(బీజేపీ). మల్లులక్ష్మి (సీపీఎం), పిల్లుట్ల రఘు(ఫార్వర్డ్ బ్లాక్) కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
నల్లగొండ..
ఇక్కడ 2018లో బీఆర్‌ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి… కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఓడించి సంచలనం సృష్టించారు. మరోసారి ఆయనపైనే విజయానికి ప్రయత్నిస్తున్నారు. అయితే, ప్రభుత్వ వ్యతిరేకత, పార్టీలో అసంతృప్తులతో ఇబ్బందులు ఉన్నాయి. అధినేత కేసీఆర్, మంత్రి కేటీఆర్ అసమ్మతి నేతలను బుజ్జగించి, దారికి తెచ్చారు. చాడ కిషన్‌రెడ్డి తదితరులు భూపాల్ గెలుపునకు కృషి చేస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన వెంకట్‌రెడ్డి తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా గెలిచారు. అయినా నల్గొండపై పట్టు కొనసాగిస్తున్నారు. ఈసారి ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్, సీపీఎం అభ్యర్థి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి పిల్లి రామరాజు దూకుడుగా ప్రచారం చేస్తున్నారు.
మునుగోడు..
మునుగోడులో 2018లో గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి్డ(కాంగ్రెస్) అనూహ్యంగా 2022లో బీజేపీలో చేరారు. ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. తాజాగా మళ్లీ కాంగ్రెస్‌లో చేరి, టికెట్ తెచ్చుకున్నారు. పార్టీల మార్పిడి కారణంగా రాజగోపాల్‌పై శ్రేణుల్లో కొంత అసంతృప్తి ఉంది. తనకు ప్రభుత్వ వ్యతిరేకత కలిసొస్తుందని ఆయన ధీమాగా ఉన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి అభివృద్ధి పనులపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకురాలు పాల్వాయి స్రవంతి బీఆర్‌ఎస్‌లో చేరడం ప్రభాకర్రెడ్డికి లాభిస్తోంది. కాంగ్రెస్ నేత సీహెచ్ కృష్ణారెడ్డికి చివరి నిమిషంలో బీజేపీ టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్‌లోని అనుచరవర్గం తనకే మద్దతిస్తుందని విశ్వసిస్తున్నారు. సీపీఎం నుంచి దోనూరి నర్సిరెడ్డి బరిలో ఉన్నారు.
తుంగతుర్తి(ఎస్సీ)…
తుంగతుర్తి(ఎస్సీ)లో గత రెండు ఎన్నికల్లో(2014, 18) గెలిచిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్ మూడోసారి గెలవాలని పట్టుదలతో శ్రమిస్తున్నారు. ఇక్కడ పార్టీ సంస్థాగతంగా బలంగానే ఉన్నా… కొంత అసమ్మతి నెలకొనడం ఆయనకు సమస్యగా మారింది. అభివృద్ధి పనులపై నమ్మకం పెట్టుకున్నారు. బీఆర్‌ఎస్ సీనియర్ నేత మందుల సామేలు కాంగ్రెస్‌లో చేరి టికెట్ పొందారు. స్థానిక పరిచయాలతోపాటు బీఆర్‌ఎస్‌లోని అనుచరులు తనకే మద్దతిస్తారని ఆయన భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతపై ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్ శ్రేణుల నుంచి పూర్తి మద్దతు రాకపోవడం కొంత ప్రతిబంధకంగా ఉంది. బీజేపీ అభ్యర్థి కడియం రామచంద్రయ్య గట్టిగానే ప్రచారం చేస్తున్నారు.
నాగార్జునసాగర్..
ఇక్కడ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ సీనియర్ నేతల వారసుల మధ్య రసవత్తర పోరు సాగుతోంది. దివంగత ఎమ్మెల్యే నోముల నరసింహయ్య తనయుడు భగత్ 2021లో జరిగిన ఉప ఎన్నికలో… కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డిపై గెలిచారు. మరోసారి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా నిలిచారు. అభివృద్ధి పనులు, సాగర్‌లో ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, బీసీ కార్డు కలిసొస్తాయని భావిస్తున్నారు. పార్టీలో కొందరు సీనియర్లు సహకరించకపోవడం ప్రతికూలాంశం. జానారెడ్డి తన కుమారుడు జయ్‌వీర్‌రెడ్డిని పోటీకి దింపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్య పదవికి సానుకూలత లభిస్తుందని ప్రజలకు చెబుతున్నారు. బీజేపీ అభ్యర్థి నివేదిత పట్టుదలగా ప్రచారం చేస్తున్నారు.
మిర్యాలగూడ..
మిర్యాలగూడలో గత రెండు ఎన్నికల్లో గెలిచిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే భాస్కర్‌రావు మూడోసారి విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇక్కడ బీఆర్‌ఎస్ బలంగా ఉండడం కలిసొస్తుందని.. చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు దోహదపడతాయని భావిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి విజయంపై ధీమాగా ఉన్నారు. పురపాలక సంఘం కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్‌గా పట్టణంలో పరిచయాలు ఉన్నాయి. తన సేవా కార్యక్రమాలను, ప్రభుత్వ వ్యతిరేకతను అస్త్రాలుగా సంధిస్తున్నారు. సీపీఎం అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి నియోజకవర్గంలో విస్తృంగా పర్యటిస్తూ, ప్రధాన పార్టీలకు పోటీదారుగా మారారు.
కోదాడ..
ఇక్కడ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, కాంగ్రెస్ అభ్యర్థి ఎన్.పద్మావతిరెడ్డి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్న మల్లయ్యయాదవ్ బీసీ కార్డును ప్రయోగిస్తున్నారు. అభివృద్ధి పనులనూ ప్రస్తావిస్తున్నారు. కొందరు ద్వితీయశ్రేణి నేతల నుంచి సహకారం లభించకపోవడం ఇబ్బందికరంగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి విజయానికి ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పావులు కదుపుతున్నారు. పార్టీ శ్రేణుల మద్దతు సమీకరిస్తున్నారు. అవినీతి, ఇతర ఆరోపణలు లేకపోవడం ఆమెకు కలిసొచ్చే అంశం. ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో గెలుస్తామని నమ్ముతున్నారు. జనసేన నుంచి మేకల సతీశ్‌రెడ్డి, సీపీఎం తరఫున మట్టిపల్లి సైదులు పోటీ చేస్తున్నారు.
భువనగిరి..
భువనగిరిలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖపోటీ నడుస్తోంది. గత రెండు ఎన్నికల్లో గెలిచిన బీఆర్‌ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి హ్యాట్రిక్ సాధిస్తానని నమ్మకంగా ఉన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నా… తనకున్న పేరుతోపాటు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అండగా నిలుస్తాయంటున్నారు. గత ఎన్నికల ప్రత్యర్థి జిట్టా బాలకృష్ణారెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరడం, పార్టీ సీనియర్ నేత చింతల వెంకటేశ్వర్‌రెడ్డి మద్దతివ్వడం అనుకూలాంశాలు. కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి… పార్టీ బలం, ప్రభుత్వ వ్యతిరేకతపై ఆశలు పెట్టుకున్నారు. ఆయన పార్టీల మార్పిడి వ్యవహారం శ్రేణుల్లో అయోమయానికి దారితీసింది. బీజేపీ అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డికి నియోజకవర్గంలో అధిక పరిచయాలున్నాయి. పూర్తిస్థాయిలో కేడర్ లేకపోవడం సమస్యగా ఉంది. సీపీఎం నుంచి కె.నరసింహ పోటీ చేస్తున్నారు.
నకిరేకల్..
నకిరేకల్(ఎస్సీ)లో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన చిరుమర్తి లింగయ్య… ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనకే భారాస అధిష్ఠానం టికెట్ ఇచ్చింది. పార్టీ శ్రేణుల మద్దతుతోపాటు సెగ్మెంట్లో జరిగిన అభివృద్ధి, ప్రజలకు చేసిన సేవలతో తాను గెలుస్తానని ఆయన విశ్వసిస్తున్నారు. కొన్ని వర్గాల వ్యతిరేకత ప్రతికూలంగా మారినా అధిగమిస్తానని భావిస్తున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం… కాంగ్రెస్‌లో చేరగా ఆయనకే టికెట్ లభించింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను చాటుతూ, తమపార్టీ ఆరు గ్యారంటీలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కోమటిరెడ్డి సోదరులకు ఈ నియోజకవర్గంపై పట్టుండడం అనుకూలిస్తుందని అనుకుంటున్నారు. బీజేపీ అభ్యర్థి మొగులయ్య, సీపీఎం అభ్యర్థి బొజ్జ చిన్నవెంకులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు.
ఆలేరు..
ఆలేరులో 2014, 2018 ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే గొంగిడి సునీత మరోసారి బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం, గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఆశీర్వదిస్తారని నమ్మకంగా ఉండగా… సునీతపై అసంతృప్తితో కొందరు నేతలు పార్టీని వీడడం ఇబ్బందికరంగా మారొచ్చు. కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య… తాను చేసిన సేవా కార్యక్రమాలపై విశ్వాసంతో ఉన్నారు. తన సామాజికవర్గం మద్దతు, పార్టీ బలంగా ఉండడం కలిసొస్తుందని అంటున్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో ఇళ్లు కోల్పోయిన వారికి సాయం అందకపోవడం, గుట్టపైకి ఆటోలను అనుమతించకపోవడాన్ని ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి పడాల శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేస్తున్నారు.
దేవరకొండ(ఎస్టీ)..
దేవరకొండ(ఎస్టీ)లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మూడుసార్లు(2004, 2014, 2018) గెలిచారు. ముఖ్యనేతలు కొందరు ఆయనకు సహకరించకపోవడం, ప్రభుత్వ వ్యతిరేకతపై కొంత ఆందోళన ఉన్నా.. ముందడుగేస్తున్నారు. చేసిన అభివృద్ధితోపాటు గిరిజనుల ఓట్లపై నమ్మకంగా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్‌కు పార్టీపై పట్టుంది. ప్రభుత్వ వ్యతిరేకతను నమ్ముకున్నారు. బీజేపీ అభ్యర్థి కేతావత్ లాలూనాయక్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ గరిష్ఠంగా ఓట్లు సాధించేందుకు యత్నిస్తున్నారు.