మెదక్ పార్లమెంట్ రేసు లో నీలం మధు ముదిరాజ్ ?
పటాన్ చెరు ఎమ్మెల్యే అభ్యర్ధిగా 46 వేలకు పైగా ఓట్లు
మెదక్ లో ముదిరాజ్ సామాజికవర్గం కలిసొచ్చే అవకాశం
తెలంగాణలోని ఏ నియోజకవర్గానికీ లేనంతగా మెదక్ పార్లమెంటు నియోజకవర్గానిది ఘనమైన చరిత్ర. దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ ఇక్కడినుంచే ప్రాతినిధ్యం వహించారు. ఆమె చనిపోయేనాటికి మెదక్ ఎంపీనే కావడం గమనార్హం. బాగారెడ్డి వంటి నాయకుడు వరుసగా నాలుగుసార్లు గెలుపొందారు. ఇక సినీ, రాజకీయ నాయకురాలు విజయశాంతి, తెలంగాణ టైగర్ గా పేరుగాంచి ఆలె నరేంద్ర, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్థాయి నాయకుడూ ఇక్కడినుంచి పోటీ చేసి నెగ్గారు. అలాంటగి మెదక్ టికెట్ కాంగ్రెస్ పార్టీలో ఈసారి ఎవరికి దక్కనుంది అనేది చర్చనీయాంశం అవుతోంది. ఈ సీటుకు ప్రముఖంగా వినిపిస్తున్న పేరు మాత్రం నీలం మధు ముదిరాజ్.
పటాన్ చెరులో సత్తా
అసెంబ్లీ ఎన్నికల్లో తొలుత పటాన్ చెరు టికెట్ సాధించిన నీల మధు ముదిరాజ్ గెలుపు ఖాయం అనే వాతావరణం కల్పించారు. అయితే, కాంగ్రెస్ పార్టీలో జరిగిన పరిణామాల నేపథ్యంలో పటాన్ చెరు టికెట్ చివరకు కాటా శ్రీనివాస గౌడ్ కు వెళ్లింది. చివరకు బీఎస్పీ తరఫున పోటీ చేసిన నీలం మధు 46 వేలకుపైగా ఓట్లు సాధించి మూడొ స్థానంలో నిలిచారు. కేవలం 5,101 ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి విజయం సాధించారు. కాగా.. తాను గెలవకున్నా.. కాంగ్రెస్ అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్ విజయాన్ని అడ్డుకున్నారు నీల మధు ముదిరాజ్.
జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ బలోపేతానికి
గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి ఇటీవలి ఎన్నికల్లో ఒకటీ అరా తప్ప సీట్లు రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే అనిల్ కుమార్ యాదవ్ కు రాజ్య సభ ఎంపీ ఇచ్చి బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తోంది. దీనిని మరింత ముందుకు తీసుకెళ్లాలంటే నీలం మధు వంటి వారికి పెద్ద పీట వేయాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం నీలం మధు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. మెదక్ పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్న ఆయన అందుకోసమే కాంగ్రెస్ లోకి వచ్చారు. మరోవైపు నీలం మధు సామాజికవర్గం ముదిరాజ్ లు మెదక్ జిల్లాలో అత్యధికంగా ఉన్నారు. ఈ సమీకరణం రీత్యా చూసినా ఆయన మెదక్ టికెట్ కు ప్రధాన పోటీదారుగా ఉంటారనడంలో సందేహం లేదు.
మెదక్ పార్లమెంట్ రేసు లో నీలం మధు ముదిరాజ్ ?
- Advertisement -
- Advertisement -