నిర్వాహకుల నిర్లక్ష్యం.. హోటల్‌లో భోజనం అంటేనే భయపడేలా …
హైదరాబాద్: కొందరు నిర్వాహకుల నిర్లక్ష్యం.. హోటల్‌లో భోజనం అంటేనే భయపడేలా చేస్తోంది. కనీస ప్రమాణాలు పాటించకుండా, పరిశుభ్రతను గాలికొదిలేసి నిల్వ ఉంచి బూజు పట్టిన వంటకాలను వినియోగదారులకు వడ్డిస్తున్నారు. ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీల్లో వెలుగు చూస్తున్న దారుణాలే ఇందుకు నిదర్శనం. తాజాగా లక్డీకాపూల్‌లోని హోటల్ అశోకా, కిచెన్ ఆఫ్ మూన్‌లైట్ బార్, హైడ్రేట్ ది బార్, న్యూ ఫిష్‌ల్యాండ్ హోటల్‌లో తనిఖీలు నిర్వహించారు. వీటిల్లో గడువు తీరిన ఆహార పదార్థాలు, పాడైపోయిన చికెన్ (5 కేజీలు), కారమెల్ కలర్, పెసర్లు (10 కేజీలు)ను అధికారులు సీజ్ చేశారు. మాంసం నిల్వ ఉంచే ప్రాంతంలో బొద్దింకలు తిరుగుతున్నట్లు గుర్తించారు.
ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనలు పాటించని, లేబుల్ లేని జీడిపప్పు (24 ప్యాకెట్లు), వండటానికి సిద్ధం చేసి ఫ్రిజ్‌లో ఎప్పటి నుంచో నిల్వ ఉంచిన పదార్థాలను సీజ్ చేసి నోటీసులు జారీ చేశారు. లక్డీకాపూల్‌లోని హైడ్రేట్ ది బార్‌లో గడువు తీరిన చికెన్ వింగ్స్(10 కేజీలు), అముల్ పీనట్, పాస్తా(5 కేజీలు), లేబుల్ లేని బీబీక్యూ సాస్ గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. హోటల్ న్యూ ఫిష్‌ల్యాండ్‌లోని కిచెన్‌లో ఎలుకల సంచరించడాన్ని గుర్తించారు. సింథటిక్ ఫుడ్ కలర్, మూతలు ఏర్పాటు చేయని డస్ట్ బిన్లు, లేబుల్ లేని పదార్థాలు స్వాధీనం చేసుకొని నోటీసులు జారీ చేశారు.