యాదాద్రి పుణ్యక్షేత్రంలో 1000 మందికి నిత్యాన్న ప్రసాదం
యాదగిరిగుట్ట : యాదాద్రి పుణ్యక్షేత్రంలో నిత్యాన్న ప్రసాదం సదుపాయాన్ని ఆదివారం నుంచి వెయ్యి మంది భక్తులకు కల్పిస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వాహణాధికారి భాస్కర్‌రావు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పదేళ్ల పండగ సందర్భంగా కొండపైన జాతీయ జెండావిష్కరణ చేసి ఆయన ప్రసంగించారు. ఇప్పటి వరకు 600 మంది భక్తులకు నిత్యాన్న ప్రసాదం కల్పిస్తున్నామని, ఇక నుంచి మరో 400 మందికి పంపిణీ చేస్తామన్నారు. స్థానిక భక్తులకు ప్రతి మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి అరగంట పాటు దైవదర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తామని, వారు గర్భాలయంలోకి ప్రవేశించవచ్చన్నారు. ఆదివారం ఏకాదశిని పురస్కరించుకుని 4,600 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా రూ.2,30,000 ఆదాయం సమకూరిందని ఈవో తెలిపారు. యాదాద్రి కొండపై ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించామని.. దీనికి భక్తులు, స్థానికులు, వ్యాపారులు సహకరించాలంటూ ఈవో భాస్కర్‌రావు, ధర్మకర్త నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది కొండపైన ర్యాలీ నిర్వహించారు.