- Advertisement -
రేవంత్ పై చర్యలేవీ… ఢిల్లీకో రూలా..-ఖర్గేకు హరీష్ రావు లెటర్
No action against Revanth... Harish Rao's letter to Delhi..-Kharge
హైదరాబాద్, సెప్టెంబర్ 19, (వాయిస్ టుడే)
సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం అసభ్యకరమైన భాష వాడుతున్నారని, నేరపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. వీటిని అరికట్టడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని లేఖలో ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ తనే ప్రవచించిన ప్రమాణాలను పాటించకపోవడం ద్వంద్వ ప్రమాణాలను సూచిస్తున్నాయని.. కేసీఆర్‌పై రేవంత్ వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. ‘రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్రవాది అని వ్యాఖ్యలు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. రాజకీయాల్లో దిగజారుడు విమర్శలను తీవ్రంగా ఖండించింది. రాజ్యాంగ విలువలను దిగజారుస్తున్నారని మొసలి కన్నీరు కార్చింది. అలాంటి దూషణలే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తే హై కమాండ్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇది కాంగ్రెస్ పార్టీ డబల్ స్టాండర్డ్స్ కాదా?.’ అని లేఖలో ప్రశ్నించారు.ఢిల్లీలో ఒక రూల్.. గల్లీలో ఒక రూల్ పాటించడం కాంగ్రెస్ పార్టీకే చెల్లుతుందని హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు. ‘సీఎం రేవంత్ వ్యాఖ్యలు రాజ్యాంగ విలువలకు విరుద్ధం. కాంగ్రెస్ హై కమాండ్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. సీఎం ప్రవర్తన మహాభారతంలో దుర్యోధనుడి క్రూరత్వంలా ఉంది. కాంగ్రెస్ పార్టీ తన నైతిక ప్రమాణాలు పాటించకుండా ఇతరులకు నీతులు చెప్పడం శోచనీయం. కేసీఆర్, ఆయన కుటుంబంపై ముఖ్యమంత్రి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం ఆ పదవి స్థాయిని దిగజార్చడం కాదా?. ‘కేసీఆర్‌ను రాళ్లతో కొట్టి చంపాలి’ అనే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ హై కమాండ్ సమర్ధిస్తుందా?. హింసాత్మక వ్యాఖ్యలు, జర్నలిస్టులపై దాడులు చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రకటించిన రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదు. పోలీసులను అడ్డుపెట్టుకొని బీఆర్‌ఎస్ నాయకులపై నిరాధార కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడడం దుర్మార్గం. తెలంగాణలో సీఎం రేవంత్ నాయకత్వంలో నియంతృత్వ పాలన కొనసాగుతుందని చెప్పేందుకు ఇదే నిదర్శనం. పార్టీ ద్వంద్వ వైఖరి మహాభారతంలో ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడి దుర్మార్గాలను ఉపేక్షించడం లాంటిదే. రేవంత్ రెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్న సీఎంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.’ అని హరీష్ లేఖలో పేర్కొన్నారు.
- Advertisement -