రాజన్న కోడెలకు రక్షణ లేదా?
No protection for Rajanna Kodalu..?
ఆందోళన వ్యక్తం చేసిన
భారత్ స్వాభిమాన్ ట్రస్ట్
బాధ్యులైన వారిపై
చర్యలు తీసుకోవాలి
నందనం కృపాకర్
హైదరాబాద్,డిసెంబర్ 14
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన
కోడెలు అంగట్లో సరుకుగా మారడం పట్ల భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ ఆందోళన వ్యక్తం చేసింది.
భక్తులు రాజన్నకు సమర్పించిన కోడెల విక్రయాలకు సంబంధించి
ఇటీవల వెలుగులోకి వచ్చిన వార్తల పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ అంశంపై సమగ్ర విచారణ జరగాల్సి ఉందని,
బాధ్యులైన సిబ్బంది, అధికారులపై కఠిన చర్యలు
తీసుకోవాలని స్వాభిమాన్ ట్రస్ట్
ఆర్గనైజింగ్ సెక్రటరీ నందనం కృపాకర్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
శ్రీ రాజరాజేశ్వర మందిర గోశాలలో గోమాతకు రక్షణ లేదనే విషయాలను ఇటీవల జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్, వరంగల్ జిల్లా గీసుకొండలో బయటపడ్డ ఉదంతాలు బహిర్గతం చేశాయని ఆయన అన్నారు. ఈ సంఘటనలు రాజన్న భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని అన్నారు.
భక్తులు ఎంతో భక్తితో దేవాలయానికి ముడుపుగా చెల్లించిన గోమాతల రక్షణ బాధ్యత నిస్సందేహంగా ఆలయ అధికారులదే అని అన్నారు.
ఆలయ గోశాలలోని గోవులకే రక్షణ లేకపోతే వాటికి ఎక్కడ రక్షణ ఉంటుందని ప్రశ్నించారు.
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్, వరంగల్ జిల్లా గీసుకొండ ప్రాంతాలలో గోశాల నిర్వాహకుల పేరిట కొందరు నకిలీ వ్యక్తులు
రాజన్న ఆలయ గోవులను తీసుకువెళ్లి విక్రయిస్తూ పట్టుపడ్డ ఉదంతాలపై సంబంధిత పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాజన్న ఆలయ గోవుల విక్రయాలపై ప్రతిస్పందించి ఇందుకు కారణమైన దేవాలయ అధికారులపై తగుచర్యలను తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. రాజన్న ఆలయ గోశాల ప్రాంగణాన్ని విస్తరించి, గోవులను రక్షించడానికి కావలసిన ఏర్పాట్లను చేపట్టాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
భక్తుల మనోభావాలను కించపరిచే ఎటువంటి చర్యలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని ఆయన దేవాలయ సిబ్బందికి ,ప్రభుత్వానికి, సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ యంత్రాంగానికి
విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలోని అనేక దేవాలయాల అధీనంలోఉన్న గోవులను సంరక్షించి, మెజారిటీ ప్రజల విశ్వాసాన్ని పొందడానికి వెంటనే కార్యాచరణను ప్రకటించాలని
డిమాండ్ చేశారు.