- Advertisement -
వరద సాయంపై నోరు మెదపని కేంద్రం
No words or actions from Center on flood relief
హైదరాబాద్, సెప్టెంబర్ 14, (వాయిస్ టుడే)
వరదలు మిగిల్చిన నష్టం నుంచి తెలంగాణ ఇప్పుడప్పుడే కోలుకునేలా కనిపించడం లేదు. కేంద్ర పెద్దలెవరూ సాయం పై నోరు మెదపడం లేదు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. అందులో ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు. కానీ తెలంగాణకు ఒరిగిందేమీ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు కొట్టిన డైలాగులు ఎక్కడికి పోయాయో.. ఎవరికీ అర్థం కావడం లేదని అంటున్నారు.అన్నింటికీ మించి తెలంగాణ ఎంపీలకు కేంద్ర మంత్రి పదవులు వచ్చాయి. ఇక వీరందరూ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. వీరితో పాటు బీజేపీ ఎంపీల బృందాలు పర్యటించాయి. ఖమ్మం జిల్లాలో వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించి.. రాకాసితండాలో వరద బాధితులను పరామర్శించారు. బాధితులకు అండగా కేంద్ర ప్రభుత్వం ఉంటుందని అభయమిచ్చారు.ముందుగా.. పంట పొలాల్లో ఇసుక మేటను తొలగిస్తామని హామీ ఇచ్చారు. అందుకు తగిన ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంతే ఇక్కడితో డ్రామా అయిపోయిందని అంటున్నారు. వచ్చారు.. చూశారు.. వెళ్లారు. అనే కాన్సెప్ట్ లోనే నడిచిందని అంటున్నారు. కనీసం వీరెవరూ కూడా కేంద్ర పెద్దలతో మాట్లాడి నిధులు రప్పించే ప్రయత్నాలు చేయడం లేదనే తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.వరదల కారణంగా తెలంగాణకు రూ.5,348 కోట్ల మేర నష్టం జరిగిందని సాక్షాత్తూ సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ గా ప్రకటించారు. అంతేకాదు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో జరిగిన సమావేశంలో కూడా ఇదే మాట తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఆపదలో ఉన్న ప్రజలకు సాయం చేస్తామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. కట్ చేస్తే.. ఫలితం శూన్యం. ఆయన హైదరాబాద్ నుంచి ఫ్లయిట్ ఎక్కి, అన్నీ ఇక్కడే మరిచిపోయారని, ఢిల్లీ వరకు తీసుకెళ్లలేదని అంటున్నారు.గతంలో కూడా తెలంగాణకు భారీ వరదలు వచ్చాయి. అప్పుడు హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలకు కేంద్రం నుంచి ఆశించిన సాయం అందలేదు. అదే గుజరాత్ లో జరిగితే మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్లి, కోట్ల రూపాయలు కుమ్మరిస్తారని అంటున్నారు. అక్కడ వారే ప్రజలు, ఇక్కడి వారు కారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వరదలకు తెలంగాణలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం కలిగింది. ఎంతోమంది పేదలు నిరాశ్రయులయ్యారు. వారందరికీ పునరావాసం కల్పించాల్సి ఉంది. ఇవన్నీ జరగాలంటే కేంద్రం ఏదో మొక్కుబడి తంతుగా విదిలిస్తే సరిపోదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.పక్కనే ఉన్న మరో తెలుగురాష్ట్రం ఏపీకి ఎక్కువ నిధులిచ్చి, తెలంగాణకు తక్కువ ఇచ్చినా ఊరుకునేది లేదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇలా చేస్తే.. తెలంగాణ ప్రజల్లో బీజేపీ పట్ల వ్యతిరేకత మరింత పెరుగుతుందని, ఇది వారికే నష్టమని సీనియర్ రాజకీయ విశ్లేషకులు వ్యాక్యానిస్తున్నారు. అన్నింటికీ మించి గొప్ప విషయం ఏమిటంటే.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాక్షేమం కోసం ఒక మెట్టు దిగి పార్టీలు వేరేనా ప్రజల కోసం పార్టీలకతీతంగా పనిచేద్దామని ముందడుగు వేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
- Advertisement -