- Advertisement -
కాంగ్రెస్ లో నామినేటెడ్ చిచ్చు
Nominated Chichu in Congress
నల్గోండ, ఆగస్టు 29 (న్యూస్ పల్స్)
ఉమ్మడి నల్లగొండ కాంగ్రెస్ పార్టీలో హేమా హేమీలైన జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్, దామోదర్ రెడ్డిలు రాష్ట్ర కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఎవరికి వారే సొంత గ్రూపులతో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సీనియర్లైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రులుగా కొనసాగుతున్నారు. రాజకీయ ఉద్దండులు ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ లో ఓ పదవి చిచ్చు పెట్టింది.నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి రాష్ట్ర మంత్రి కావాలనే చిరకాల వాంఛ.. కలగానే మిగిలిపోయింది. తన కలను తనయుడు అమిత్ రెడ్డితో సాకారం చేసుకోవాలని గుత్తా ప్రయత్నించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి తనయుడి పొలిటికల్ ఎంట్రీకి గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో తనయుడు అమిత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసం గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి పార్లమెంట్ ఎన్నికలవేళ కాంగ్రెస్ కండువా కప్పించారు. సీఎం రేవంత్ తో గుత్తా సుఖేందర్ రెడ్డి కుటుంబానికి దగ్గరి బంధుత్వం ఉంది.బీఆర్ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డిలకు రేవంత్ సర్కార్ కీలక పదవులు కట్టబెట్టింది. పోచారంను ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడిగా, గుత్తా అమిత్ రెడ్డిని రాష్ట్ర డెయిరీ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం రేవంత్ కుటుంబంతో ఉన్న బంధుత్వం వల్లే అమిత్ రెడ్డికి కార్పొరేషన్ పదవి వరించిందని పార్టీలో టాక్. అమిత్ రెడ్డికి కార్పొరేషన్ చైర్మన్ పదవికి నామినేట్ చేయడం ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది. ఉమ్మడి నల్గొండ నుంచి ఇప్పటికే పటేల్ రమేష్ రెడ్డి, బండ్రు శోభారాణి, నాగరి ప్రీతం, పాల్వాయి రజనీకుమారిలకు కార్పొరేషన్ పదవులు దక్కాయి.ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఇంకా చాలామంది ఆశావాహులు ఉన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కూడా కీలకమైన కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఆశిస్తున్నారట. మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. తన అనుచరుడు గుమ్ముల మోహన్ రెడ్డికి రాష్ట్రస్థాయి పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న శంకర్ నాయక్ కార్పొరేషన్ పదవిని ఆశిస్తున్నారు. అద్దంకి దయాకర్, పున్న కైలాస్ నేత ఆశావాహులుగా ఉన్నారు. దీనికి తోడు కేబినెట్ బెర్త్ కోసం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కూడా ప్రయత్నిస్తున్నారు.కాంగ్రెస్ లో చాలా కాలం నుంచి పనిచేస్తున్న సీనియర్లను కాదని గుత్తా అమిత్.. కీలక పదవి ఇవ్వడంపై ఉమ్మడి జిల్లా సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారట. పార్టీలో కొత్తగా వచ్చిన వారికే పదవులు కట్టబెడితే.. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న నేతల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారట. పోచారం శ్రీనివాస్ రెడ్డి, గుత్తా అమిత్ కు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వడంపై పార్టీ అధిష్టానం వద్ద ఓ సీనియర్ నేత తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారట. పార్టీలో కొత్తగా వచ్చిన వారికి పదవులు ఇస్తే పార్టీ క్యాడర్ కు తప్పుడు సంకేతాలు వెళ్తాయని నిరసన వ్యక్తం చేశారట.రాజకీయ భవిష్యత్తు కోసం తనయుడిని గులాబీ దళం నుంచి కాంగ్రెస్ గూటికి చేర్చినా.. గులాబీ పార్టీలో మాదిరిగానే ఇక్కడ కూడా తనయుడి రాజకీయ భవిష్యత్తుకు అడ్డంకులు తప్పడం లేదట. అయితే తాను ఒకటి తలచితే.. మరొకటి జరిగిందట. ఇప్పుడేం చేయాలో గుత్తా సుఖేందర్ రెడ్డికి పాలు పోవడం లేదట. ఈ నేపథ్యంలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డిలకు రేవంత్ సర్కార్ కట్టబెట్టిన కీలక పదవులపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో బ్రేక్ పడిందట.
- Advertisement -