- Advertisement -
వైసీపీలో ఆగని షాక్ లు
Non-stop shocks for YCP
విజయవాడ, డిసెంబర్ 14, (వాయిస్ టుడే)
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్‌సీపికి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఉదయం మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు. మధ్యాహ్నం భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆ పని చేశారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించి లేఖ రిలీజ్ చేశారు ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండి గ్రంథి శ్రీనివాస్ వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. పార్టీకి దూరంగా ఉన్నారు. ఇతర పార్టీల్లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఏ పార్టీతో చర్చలు పూర్తయ్యాయో కానీ ఆయన రాజీనామా చేశారు. ఇటీవల గ్రంధి శ్రీనివాస్ ఇంట్లో ఐటీ దాడులు జరిగాయి. దాదాపుగా వారం రోజుల పాటు ఆయన వ్యాపార వ్యవహారాల్లో ఉన్న అవకతవకలన్నింటినీ వెలికి తీశారని ప్రచారం జరుగుతోంది. అంతకు మందు నుంచే ఆయన వైసీపీకి దూరంగా ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున అప్పటి విపక్ష నేతలపై కక్ష సాధింపులకు పాల్పడటంతో వైసీపీ ఉంటే తనకూ ఇబ్బందులేనన్న ఉద్దేశంతో ఆయన కొంత కాలంగా సైలెంట్ గా ఉన్నారు. దీనికి కూడా ప్రత్యేకమైన కారణం ఉంది. అదేమిటంటే.. ఆయన 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పై గెలిచారు. ఆ తర్వాత పవన్ పై అనేక అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. పలు మార్లు భీమవరంలో జనసేన, వైసీపీ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార సమయంలో భీమవరంలో గ్రంధి శ్రీనివాస్ పై తీవ్ర విమర్శలు చేశారు. రౌడీయిజం చేస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి వ్యాపారి నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రౌడీయిజాన్ని అణిచి వేస్తామని హెచ్చరించారు. దీంతో కూటమి గెలిచిన తర్వాత తనకు చిక్కులు తప్పవని ఆయన అనుకుంటున్నారు. అయితే ఆయనను జనసేన పార్టీలో చేర్చుకునే అవకాశం లేదు. టీడీపీ లేదా బీజేపీలో చేరేందుకు ఆయన ప్రయత్నాలు చేశారని అంటున్నారు. కానీ ఆయనకు గ్రీన్ సిగ్లన్ రాలేదని చెబుతున్నారు. వైసీపీకి రాజీనామా చేసే నేతల సంఖ్య వరుసగా పెరుగుతోంది. ఇప్పటికే మెజార్టీ సీనియర్ నేతలు యాక్టివ్ గాలేరు. వారిలో వరుసగా రాజీనామా బాట పడుతున్నారు. మరో వైపు కూటమి ప్రభుత్వంపై పోరుబాట పట్టాలని జగన్ అనుకుంటున్న సమయంలో ఇలా వరుసగా నేతలు ఒకరి తర్వాత ఒకరు గుడ్ బై చెబుతూంటడం.. ఆ పార్టీ పెద్దల్ని కూడా కలవర పరుస్తోంది.
- Advertisement -