హైదరాబాద్, అక్టోబరు 12: తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ – కాంగ్రెస్ పెద్దల మధ్య పెద్ద కుట్ర జరుగుతుందని కేఏ పాల్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ పాలన అంతం కోసం 80 % ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఎలాగో కేసీఆర్ ఓటమి ఖాయం అని తెలిసి అయన అభ్యర్థులను కాంగ్రెస్ లోకి పంపి కాంగ్రెస్ నుంచి గెలవడం కోసం పెద్ద ప్లాన్ జరుగుతుందని కేఏ పాల్ ఆరోపించారు. హైదరాబాద్ అమీర్ పేట్ లోని ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో కేఏ పాల్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో కేఏ పాల్ మాట్లాడుతూ.. బీసీ ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు అందరు ఆలోచన చేయాలని.. ప్రజలందరూ నవంబర్ 30 నాటికి కేసీఆర్‌కి గుడ్ బాయ్ చెప్పాలని అన్నారు. అటు కాంగ్రెస్ దేశాన్ని సర్వ నాశనం చేసిందనే విషయాన్ని అందరు గుర్తు పెట్టుకోవాలని అన్నారు. బీసీలకు ప్రజాశాంతి పార్టీ తరపున 60 సీట్లు ఇస్తున్నామని.. అన్ని సామాజిక వర్గాలకు సీట్లు ఇస్తానని అన్నారు. ప్రతి ఒక్క అభ్యర్థి నామినేషన్ వేసుకోవచ్చని, ప్రజాశాంతి పార్టీలోకి అందరినీ ఆహ్వానిస్తున్నానని అన్నారు.కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇప్పటికీ నన్ను ఎందుకు కలుస్తున్నారు? ఒక్కసారి ప్రజలు అర్ధం చేసుకోవాలి.. ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రజలకి డబుల్ స్థాయిలో ఇస్తాను. అంబేద్కర్, గద్దర్ ఆశయాలు బతకాలి అంటే ప్రజా శాంతి పార్టీ గెలవాలి. ఎవరైనా ప్రజలకు సేవ చేయాలి అంటే ప్రజా శాంతి పార్టీలో చేరండి. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో జరిగే ఎన్నికల్లో మహిళలకు పెద్ద పీట వేస్తాం. రేవంత్ రెడ్డి, కేటీఆర్ లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ నాటకాలు ఆడుతున్నారు. తెలంగాణలో ఎన్నో సమస్యలపై కోర్టు ద్వారా తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేశాను. కేటీఆర్ నాపై దాడి చేపించారు. అది తెలంగాణ ప్రజలు మర్చిపోరు. రేవంత్ రెడ్డి ప్రజలను రెచ్చ గొట్టినా రెచ్చి పోవొద్దు. శాంతి యుతంగా ఏదయినా సాధించాలి. తెలంగాణ నిరుద్యోగ యువత కూడా కేసీఆర్ ను ఓడించడానికి కష్టపడాలి. తెలుగు సత్తా గుజరాతి గాళ్ళకు చూపించాలంటే అది ఒక్క కేఏ పాల్ తోనే సాధ్యం. కొన్ని మీడియా సంస్థ లు ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి అమ్ముడుపోయాయి.తెలంగాణ రాష్ట్రం శ్రీలంక అవుతుంది. అన్ని పార్టీలకు ప్రతి విషయంలో అనుమతి ఇచ్చారు. కానీ మాకు మాత్రం అడుగు అడుగునా అడ్డం పడ్డారు. KA పాల్ కావాలని ప్రజలు కోరుకుంటున్నట్లుగా ప్రతి సర్వే రిపోర్ట్ ఇస్తుంది. నా చరిత్ర ఒక్కసారి తెలుసుకోండి. నన్ను కమెడియన్ గా చూడటం మానుకోండి. దేశం రాష్టం నాశనం అవుతుంది. నన్ను ముఖ్యమంత్రి చేయండి. తెలంగాణను దేశంలో నెంబర్ 1 స్థాయికి తీసుకొని వెళ్తా’’ అని కేఏ పాల్ అన్నారు