విజయవాడ, నవంబర్ 13: ఏపీలో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. సీఎం జగన్ సహా పలువురు మంత్రులు, అధికారులు మొత్తం 41 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేసింది. రాష్ట్రంలో పథకాల మాటున ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని, వీటిపై కేంద్ర దర్యాప్తు సంస్థ తో విచారణ జరిపించాలని ఎంపీ రఘురామ తన పిటిషన్ లో పేర్కొన్నారు. విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ తన వాదనలు వినిపించారు. ఈ పిటిషన్ ప్రజా ప్రయోజనం లేదని, వ్యక్తిగత ఉద్దేశంతోనే దాఖలు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అసలు దీనికి విచారణ అర్హతే లేదని చెప్పారు. పిటిషన్ వేసిన తర్వాత కూడా ‘ప్రభుత్వ అవినీతి’ అంటూ మీడియాలో రఘురామ కృష్ణం రాజు మాట్లాడారని అభ్యంతరం తెలిపారు.రఘురామ కృష్ణంరాజు తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ రావు వాదనలు వినిపించారు. ఈ పిటిషన్ దాఖలు చేయగానే ప్రభుత్వం కొన్ని రికార్డులు ధ్వంసం చేసిందని కోర్టుకు విన్నవించారు. సీఎం జగన్ తనకు అనుకూలమైన వారికి లబ్ధి చేకూరేలా వ్యవహరించారని అన్నారు. ఇసుక, మద్యం, ఆరోగ్య శాఖకు కొనుగోలు చేసిన కొన్ని పరికరాలు, సిమెంట్ కొనుగోలు వ్యవహారంలో బంధువులు, అనుకూలురుకు లబ్ధి చేకూర్చారని పేర్కొన్నారు. వీటిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం సీఎంతో సహా 41 మందికి నోటీసులు ఇచ్చింది. ప్రతివాదుల్లో సజ్జల రామకృష్ణా రెడ్డి, ఎంపీ విజయసాయి, మంత్రి పెద్దిరెడ్డి, పలువురు అధికారులు ఉన్నారు. తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది.