అధికారులు అప్రమత్తంగా ఉండాలి
Officials should be vigilant
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
జయశంకర్ భూపాలపల్లి,
సెప్టెంబర్ 2
రానున్న రెండు రోజులు జిల్లాకు రెడ్ అలెర్ట్ ఉన్నదని యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా తెలిపారు. వర్షాలు, వరదలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సోమవారం అన్ని శాఖల జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపిడివోలు, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గడిచిన రెండు రోజుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకున్నామని, రానున్న రెండు రోజులు ఇదే స్పూర్తితో అప్రమత్తంగా ఉండాలని ఈ రెండు రోజులు చాలా ముఖ్యమని అన్నారు. మండల స్టాయిలో రెవెన్యూ, పంచాయతి, పోలీస్ అధికారులు పరిస్థితులను పర్యవేక్షణ చేయాలన్నారు. వర్షం ఎపుడు వస్తుందో తెలీదని ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. వాగులు, రహదారులపై నీళ్ళు వస్తే ప్రయాణాలు నియంత్రణకు ప్రమాద హెచ్చరికలు బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాలల్లో పటిష్ఠ రక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా ముంపు గ్రామాల జాబితాను సిద్దం చేసుకుని తగు జాగ్రత్తలు పాటించే విధంగా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. విద్యుత్ ప్రమాదాలు నివారణ చర్యల్లో భాగంగా లూజు వైర్లు గుర్తించి ఎలాంటి ప్రమాదాలు వాటిల్లకుండా తగు రక్షణ చర్యలు చేపట్టాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. నిండు కున్న జలాశయాలకు వీక్షణకు ప్రజలు వస్తుంటారని నియంత్రణ చర్యలు చేపట్టాలని పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. పొంగే వాగులు, రహదారులపై వాహనాలు రాకపోకలు నియంత్రణ చేయాన్నారు. అన్ని తహసీల్దార్ కార్యాలయాలతో పాటు కలెక్టరేట్ నందు కంట్రోల్ రూములు ఏర్పాటు చేయడం జరిగిందని, ఏదేని అత్యవసర సేవలకు ప్రజలు కంట్రోల్ రూము నంబర్స్ కు కాల్ చేయాలని ఆయన తెలిపారు.
ప్రసవానికి దగ్గర తేదీ ఉన్న మహిళలను ఆసుపత్రులకు తరలించాలని వైద్యాధికారులను ఆదేశించారు. 102, 104 వాహనాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. కాళేశ్వరానికి వరద ఉదృతి పెరిగే అవకాశం ఉన్నందున రెవెన్యూ, పోలీస్, పంచాయతి, ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ఈ టెలి కాన్ఫరెన్స్ లో అన్ని శాఖల జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపిడివోలు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు