ప్రజావాణి దరఖాస్తులపై
ప్రత్యేక దృష్టి సారించాలి
వెంట వెంటనే పరిష్కరించాలి..
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్
ప్రజావాణిలో
370 దరఖాస్తుల స్వీకరణ
ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి జిల్లా కలెక్టర్, అధికారులతో కలిసి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజావాణి దరఖాస్తులను వెంటవెంటనే పరిష్కరించాలన్నారు. అలాగే హైదరాబాద్ నుంచి వచ్చే ప్రజా దర్బార్ కు సంబంధించిన దరఖాస్తులను క్లియర్ చేయాలని సూచించారు. ప్రజావాణి, ప్రజా దర్బార్ దరఖాస్తులను పెండింగ్లో పెట్టవద్దని పేర్కొన్నారు. ప్రజావాణికి మొత్తం 370 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కరీంనగర్ మున్సిపల్ కార్యాలయానికి 50, డిపిఓ కార్యాలయానికి 26, పోలీస్ కమిషనర్ కార్యాలయానికి 13, కరీంనగర్ ఆర్డీవో కార్యాలయానికి 16, హుజురాబాద్ ఆర్డీవో కార్యాలయానికి 11, ఎస్ఈ ఎన్పీడీసీఎల్ కార్యాలయానికి 16, మానకొండూర్ తహసిల్దార్ కార్యాలయానికి 18, కరీంనగర్ రూరల్ కార్యాలయానికి 14, వీణవంకలో 13, తిమ్మాపూర్ 11, కొత్తపెల్లి తహసీల్దార్ కార్యాలయానికి 10 దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
ధరణి పెండింగ్ దరఖాస్తులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలి.
ధరణి పెండింగ్ దరఖాస్తులను తహసిల్దార్లు యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. తహసిల్దార్ లాగిన్ లో ఉన్న పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో 100% పూర్తి చేయాలని, వీటి పై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని పేర్కొన్నారు. ఒక అప్లికేషన్ పెండింగ్లో ఉండవద్దని పేర్కొన్నారు.
ఎంబీ రికార్డులు పూర్తి చేయండి.
అమ్మ ఆదర్శ పాఠశాలల పనులకు సంబంధించిన ఎంబీ రికార్డులను ఇంజనీరింగ్ అధికారులు వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులు దాదాపు పూర్తి అయ్యాయని తెలిపారు. వీటికి సంబంధించిన ఎంబి రికార్డులు వెంటనే పూర్తి చేయాలని పేర్కొన్నారు. రికార్డులు పూర్తి చేస్తేనే బిల్లులు మంజూరు అవుతాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బూట్లు త్వరలో అందిస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించిన మెజర్మెంట్లు పక్కగా తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మి కిరణ్, డీఆర్ఓ పీ పవన్ కుమార్, కరీంనగర్, మానకొండూర్ ఆర్డీవోలు కే మహేశ్వర్, రమేష్ బాబు, కలెక్టరేట్ ఏవో సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణి దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలి
- Advertisement -
- Advertisement -